-

‘ఎమ్మెల్సీ’ సీట్లపై ‘దేశం’ కసరత్తు

12 Jun, 2015 00:07 IST|Sakshi
‘ఎమ్మెల్సీ’ సీట్లపై ‘దేశం’ కసరత్తు

వైవీబీ, బచ్చుల, వెంకన్న మధ్యే పోటీ
నేడు ప్రకటించే అవకాశం

 
విజయవాడ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధిష్టానం తలమునకలై ఉంది. జిల్లా నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలూ తెలుగుదేశం పార్టీకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో జిల్లాకు చెందిన నాయకులు హైదరాబాద్‌లో మకాం వేసి తమ శక్తి మేరకు ఎమ్మెల్సీ సీటు  కోసం ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక గురువారం రాత్రి వరకు కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం ఉదయం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ముగ్గురి మధ్యే పోటీ! : జిల్లాలో ఉన్న రెండు స్థానాలకు ముగ్గురు నేతలు పోటీపడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. వీరు హైదరాబాద్‌లో మకాం వేసి టిక్కెట్ దక్కించుకునేందుకు తమ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గతంలో ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ పడ్డ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధ ప్రస్తుతం కొద్దిగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆమెకు గవర్నరు కోటాలో సీటు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన అనూరాధ పార్టీ తనను గుర్తించి సీటు ఇస్తే తీసుకుందామని, లేకుండా మౌనంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఎవరి ప్రయత్నాలు వారివి : చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన వైవీబీ రాజేంద్రప్రసాద్ మరోసారి సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఒక ఎంపీ, ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్‌పర్సన్, మేయర్ తదితర కీలక పోస్టులన్నీ ఆ సామాజిక వర్గానికే ఉన్నందున మరో సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని కొంతమంది నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే చంద్రబాబు హామీ ఇవ్వడం, స్థానిక సంస్థల్లో తనకు పట్టు ఉండటాన్ని ఆసరాగా చేసుకుని వైవీబీ సీటు కోసం ముమ్మరంగా యత్నిస్తున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడు బచ్చులకు మంత్రి దేవినేని ఉమా అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అయితే బందరు నుంచి ఇప్పటికే మంత్రి, ఎంపీ ఉన్నందున, శాసనమండలిలో ఇప్పటికే యాదవ సామాజిక వర్గం నుంచి  ముగ్గురు ఉండటం నేపథ్యంలో మరొకరికి అవకాశం కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మరోపక్క అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్నకు కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆశీస్సులు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును బీజేపీకి ఇచ్చారని, ఆ నియోజకవర్గ నేతల్లో అసంతృప్తి తగ్గించాలంటే బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని ఆయన వర్గం గట్టిగా వాదిస్తోంది. తొలుత నిర్ణయించినట్లు వైవీబీ, బచ్చుల పేర్లనే ఖరారు చేస్తారా.. లేక మార్చి ఇంకా ఎవరికైనా అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి.
 
 

మరిన్ని వార్తలు