నిమ్మాడ వరకు.. సైకిల్ తొక్కేస్తారు!

18 Feb, 2014 02:23 IST|Sakshi
నిమ్మాడ వరకు.. సైకిల్ తొక్కేస్తారు!
మనం మాత్రమే సైకిల్‌పై సవారీ చేయాలి.. పార్టీలో మన ప్రత్యర్థులను అదే సైకిల్ కింద పడేసి తొక్కేయాలి.. ఇదీ కింజరాపు కుటుంబం రాజకీయ గేమ్ ప్లాన్. ఆ స్కెచ్ ప్రకారమే కింజరాపు అబ్బాయిగారి సైకిల్ యాత్ర సాగుతోంది. పాతపట్నంలో ఈ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో అక్కడి పార్టీ ఇన్‌చార్జిని సీన్‌లోంచి బయటకు నెట్టేయడం మొదలుకొని.. యాత్ర ముగింపు వేదికను జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి స్వగ్రామమైన నిమ్మాడకు మార్చడం వరకు అంతా ప్రత్యర్థులను అణగదొక్కి.. హోల్‌సేల్‌గా క్రెడిట్ కొట్టేసే వ్యూహంలో భాగమే.
 
 శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: టీడీపీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజ రాపు రామ్మోహన్‌నాయుడు నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర ముగింపు కార్యక్రమ వేదికను ఉన్నట్టుండి నిమ్మాడకు మార్చడంతో ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్న రామ్మోహన్‌నాయుడు ఈ నెల ఒకటో తేదీ నుంచి 23 వరకు ఈ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైకిల్ యాత్ర నిర్వహణకు పూనుకున్నారు. ఆ మేరకు పాతపట్నంలో యాత్ర ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి అయిన కళా వెంకట్రావు వర్గానికి చెందిన కొవగాపు సుధాకర్‌ను పూర్తిగా పక్కన పెట్టి తమ వర్గీయుడైన కలిశెట్టి అప్పలనాయుడుతో అన్ని ఏర్పాట్లు చేయించడం అప్పట్లో వివాదానికి దారి తీసింది. దీనికి నిరసనగా కొవగాపు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా బహిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ముగింపు కార్యక్రమం విషయంలోనూ కింజరాపు శిబిరం ఇదే తరహా వ్యూహం అనుసరిస్తుండటం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది.
 
 గుండకు క్రెడిట్ దక్కకూడదనే...
 ఒకటో తేదీన పాతపట్నంలో ప్రారంభమైన యాత్ర ను వాస్తవానికి ఎర్రన్నాయుడు జయంతి అయిన ఈ నెల 23న లోక్‌సభ నియోజకవర్గ కేంద్రం.. అందులోనూ జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ముగించాల్సి ఉంది. ఆరోజు శ్రీకాకుళంలో భారీ ఎత్తున ముగింపు సభ నిర్వహిస్తామని యాత్ర ప్రారంభానికి ముందే జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ పత్రికాముఖంగా కూడా వెల్లడించారు. అయితే శ్రీకాకుళంలో సభ నిర్వహిస్తే తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణకు ఆ క్రెడిట్ దక్కుతుందని భావించి ముగింపు వేదికను బాబాయి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని తమ స్వగ్రామమైన నిమ్మాడకు మార్చేశారు.  దీంతో పార్టీ కార్యకర్తలు గందరగోళానికి గురవుతున్నారు. జిల్లా కేంద్ర ంలో ఇటీవల కాలంలో పార్టీ తరఫున పెద్ద కార్యక్రమాలు నిర్వహించనందున సైకిల్‌యాత్ర ముగింపు సభను ఇక్కడే భారీ జన సమీకరణతో నిర్వహిస్తే బాగుంటుందనే భావన వారిలో ఉంది. అయితే సభ విజయవంతమైతే ఆ ఘనత గుండ అప్పలసూర్యనారాయణ ఖాతాలోకి వెళ్లిపోతుందన్న భయంతో కింజరాపు శిబిరం వేదికను మార్చేసి, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం కూడా ప్రారంభించేసింది. 
 
 అచ్చెన్న పట్టు పట్టడమే కారణం
 భారీ ఎత్తున తలపెట్టిన ముగింపు సభను శ్రీకాకుళంలో కాకుండా తన సొంత నియోజకవర్గమైన టెక్కలి పరిధిలోని నిమ్మాడలో నిర్వహిస్తే తనకు కూడా కలిసివస్తుందన్న ఆలోచనతో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి అచ్చెన్నాయుడు పావులు కదిపారు. ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తాపత్రయ పడుతున్నారు. అందులో భాగంగా రామ్మోహ న్ సైకిల్ యాత్ర ద్వారా అందే ఫలాల్లో తానూ కొంత స్వీకరించాలని భావించి వ్యూహం రచించారు. ఇదే నియోజకవర్గంలో కాకరాపల్లి థర్మల్ ప్లాంట్ నిర్మాణం తలనొప్పిగా మారడం, మరోవైపు వైఎస్సార్‌సీపీ పక్కలో బల్లెంలా తయారవడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న అచ్చెన్న సైకిల్ యాత్ర ముగింపు సభతోనైనా యాత్రతోనే కొంత మైలేజి సాధించాలని భావిస్తున్నారు. ఆయన వ్యూహం ప్రకారమే జిల్లా కేంద్రాన్ని కాదని నిమ్మాడకు కార్యక్రమాన్ని మార్చారని అంటున్నారు. తమ సొంత ప్రయోజనాల గురించే ఆలోచించిన వీరు, దీనివల్ల జిల్లాలో పార్టీలో విభేదాలు మరింత ముదిరి ఎన్నికల్లో చేటు చేస్తాయన్న విషయాన్ని విస్మరించారని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
 
 
మరిన్ని వార్తలు