రాత్రికి రాత్రే విదేశాలకు ఎంపీ జేసీ!

17 Jun, 2017 13:40 IST|Sakshi
రాత్రికి రాత్రే విదేశాలకు ఎంపీ జేసీ!

న్యూఢిల్లీ: విశాఖ ఎయిర్‌పోర్టులో వీరంగం చేసి వివాదంలో చిక్కుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి రాత్రికి రాత్రే విదేశాలకు వెళ్లిపోయారు. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు బోర్డింగ్ పాస్ మేషీన్లను ధ్వసం చేసిన జేసీపై తీవ్ర విమర్శలు వెల్లుతున్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధిష్టానం రంగంలోకి ఆయనను బుజ్జగించి క్షమాపణ చెప్పించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు. క్షమాపణ చెబుతారా అని విలేకరులు హైదరాబాద్‌లో శుక్రవారం ప్రశ్నించగా.. చెప్పడానికి ఏమీ లేదని, తానేమీ మాట్లాడనంటూ వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లొస్తే వివాదం సద్దుమణుగుతుందని భావించిన ఆయన కుటుంబంతో సహా యూరప్ వెళ్లినట్లు సమాచారం.

శుక్రవారం రాత్రి 9:50 గంటలకు ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ వెళ్లిన జేసీ, అక్కడి నుంచి మరో విమానంలో ఫ్రాన్స్ చేరుకున్నారు. దాదాపు వారం రోజులు కుటుంబంతో అక్కడే గడుపుతారని తెలుస్తోంది. తాజా వివాదానికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కుటుంబంతో కలిసి ఆయన విదేశాలకు వెళ్లిపోయారని దేశీయ విమానయాన సంస్థలతో పాటు పలువురు నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఇండిగో, ఎయిర్‌ ఇండియా, స్పైస్‌ జెట్‌, విస్తారా, గోఎయిర్, ఎయిర్‌ఆసియా ఇండియా సంస్థలు జేసీని తమ విమానాలు ఎక్కనివ్వబోమని స్పష్టం చేశాయి.టీడీపీ ఎంపీ జేసీ విదేశీ పర్యటనపై ఆయన సన్నిహితులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా ఆయన ఇప్పుడు యూరప్ వెళ్లలేదని, కొన్ని రోజుల ముందుగానే ఫ్రాన్స్ వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

గతంలో శివసేన ఎంపీ గైక్వాడ్ విషయంలో కఠినంగా వ్యవహరించి ఆయనపై చర్యలు తీసుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, ఎంపీ జేసీ విషయంలో ముట్టిముట్టనట్లుగా ఉంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలు అన్ని వివరాలు బయటపెడతాయని, బోర్డింగ్ పాస్ ఇచ్చే సమయానికి జేసీ ఎయిర్‌పోర్టుకు రాలేదని గుర్తించామని చెప్పారు. కానీ అంతకుముందు విజయనగరంలో ఈ కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. జేసీ విషయాన్ని అధికారులే చూసుకుంటారని, ఆయన విషయంలో తనకేం సంబంధం లేదని చెప్పడం గమనార్హం.