‘చంద్రబాబుకు కోపమొస్తుంది, అయినా మాట్లాడతా’

9 May, 2017 16:34 IST|Sakshi
రైల్వే బోర్డుపై ఎంపీ రాయపాటి ఆగ్రహం

విజయవాడ: దక్షిణ మధ్య రైల్వే బోర్డుపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ జరుగుతున్న సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా బయటకు వచ్చేశారు. అనంతరం రాయపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రైల్వేమంత్రి చెప్పినా అధికారులు లెక్కచేడయం లేదని, వారు ప్రధానికన్నా పవర్‌ఫుల్‌ అని వ్యాఖ్యానించారు. చిన్న చిన్న పనులు కూడా అధికారులు చేయడం లేదని, ఇలా అయితే ప్రజలు తమను చెప్పుతో కొడతారని ఆయన అన్నారు.

గుంటూరు-తెనాలి డబ్లింగ్‌ పనులు పదేళ్లు నుంచి సాగుతునే ఉన్నాయని అన్నారు. అలాగే గుంటూరు-చెన్నై డే ట్రయిన్‌ అడిగానని, దానిపై కూడా స్పందన లేదన్నారు. ఇక విశాఖ రైల్వే జోన్‌ ...అధికారుల వల్లే రాలేదని విశాఖకు రైల్వే జోన్‌ ఇవ్వడం బోర్డు అధికారులకు ఇష్టం లేదని అన్నారు. అసలు ముందు రైల్వే జోన్‌ను ప్రకటిస్తే...తర్వాత చిన్నగా విశాఖకు తరలించవచ్చన్నారు.

తాను మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని, అయినా తాను మాట్లాడతానని రాయపాటి అన్నారు. చంద్రబాబు పదిసార్లు ప్రధానిని కలిసినా రైల్వే జోన్‌ ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నిం​చారు. దీనిపై సీఎంకానీ, పార్టీ నేతలు కానీ ఆలోచించడం లేదని, కొద్దిరోజులు ఆగితే రైల్వేజోన్‌ను కూడా మర్చిపోవడమే అని అన్నారు. ప్రతి ఏటా సమావేశాలు పెట్టి విందు భోజనాలతో సరిపెడుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు