హామీలిచ్చి.. ఏమార్చి!

20 Feb, 2019 12:15 IST|Sakshi
తిరుమలలో ఆందోళనకు దిగిన ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌

ఊరించి ఉసూరుమనిపించిన టీటీడీ పాలకమండలి

హామీలిచ్చి చేతులెత్తేసిన వైనం

ఒక్క సమస్యకూ దొరకని పరిష్కారం

రక్తికట్టించిన టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే హైడ్రామా

ఉద్రిక్తతల నడుమ టీటీడీ పాలకమండలి సమావేశం

సాక్షి, చిత్తూరు, తిరుపతి/తిరుమల: తిరుమల స్థానికులు కొన్నేళ్లుగా సమస్యల పరిష్కారం కోసం టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు, సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా తిరుమలలోని గొల్లకిష్టయ్య సందు, వరాహస్వామి ఆలయం వద్ద, దక్షిణ మాడవీధుల్లో నివాసాలు, దుకాణాలను తొలగించారు. ఆ సమయంలో వారందరికీ పరిహారంతో పాటు పునరావాసం కల్పిస్తామని టీటీడీ, తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చాయి. హాకర్స్‌ లైసెన్సులను రెన్యూవల్‌ చేస్తామని చెప్పుకుంటూ వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో మొత్తం 14,370 మంది కాంట్రాక్టు కార్మికులు వేతనాల పెంపు కోసం ఆందోళనలు చేస్తున్నారు.

వారంతా పలుమార్లు టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. ఫలితం లేకపోవడంతో తిరుపతిలోని పరిపాలనా భవనం ఎదుట కొన్ని రోజులుగా దీక్షలు చేస్తున్నారు. మంగళవారం నిర్వహించిన బడ్జెట్‌ సమావేశంలో న్యాయం జరుగుతుంద ని ఆశించారు. పాలకమండలి సమావేశం అజెండాలో ఈ అంశాలు లేవని తెలుసుకున్న బాధితులు సోమవారం సాయంత్రం తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మను కలిసేందుకు ప్రయత్నించారు. రాత్రంతా అక్కడే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుగుణమ్మ తుడా చైర్మన్‌ నరసింహయాదవ్‌ను పిలిపించి చర్చలు జరిపారు. పాలకమండలి సమావేశంలోని అజెండాల్లో అంశాలన్నీ చేర్చాలను పట్టుబట్టారు.

దీక్ష ఎందుకు విరమింపజేశారు?
సమస్యల పరిష్కారం కోసం తిరుమల స్థానికులు తిరుపతి పరిపాలనా భవనం ఎదుట దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ దీక్షల వద్దకు ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని వెళ్లి వారితో చర్చలు జరిపి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. సమస్యలను పాలకమండలిలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో వాటి ప్రస్తావనే లేకపోవడంతో పరువు పోతుందని గ్రహించిన ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎంపీ శివప్రసాద్‌ హడావుడిగా తిరుమల చేరుకుని నిరసన డ్రామా వేశారు. డ్రామా రక్తికట్టిం చకపోగా రివర్స్‌ కావడంతో చిన్నగా ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్, బోర్డు సభ్యులను బాధితులు అడ్డుకున్నారు. తిరుపతి పరిపాలనా భవనం ముందు కాంట్రాక్టు కార్మికులు ఆందో ళనలు చేపట్టారు. తిరుమల, తిరుపతిలో బాధితుల ఆందోళనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. తిరుమలలో చైర్మన్‌ వాహనం ముందు కు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. తిరుపతిలో పరిపాలనా భవనంలోకి అధికారులు వెళ్లకుండా కాంట్రాక్టు కార్మికులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశంచేసి వారిని ఈడ్చి జీవులో పడేశారు. స్టేషన్‌కు తరలించారు. తమకెటువంటి సంబంధమూ లేనట్టుగా టీటీడీ ఈఓ, జేఈఓ వ్యవహరించడం గమనార్హం.

మరిన్ని వార్తలు