డ్వాక్రా మహిళలకు టోకరా 

3 Jul, 2019 08:41 IST|Sakshi
సమావేశమైన డ్వాక్రా మహిళలు (ఇన్‌సెట్‌లో) ఎంపీపీ సుంకరత్నమ్మ 

అనుభవం.. అవినీతికి అందలం 

స్త్రీనిధి, సీఐఎఫ్‌ సొమ్మును ఊడ్చేసిన టీడీపీ ఎంపీపీ 

ఉరవకొండ క్లస్టర్‌లో వెలుగు చూసిన అక్రమాలు 

గత తెలుగుదేశం పాలనలో అప్పటి ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ కనుసన్నల్లో ఆ పార్టీ నాయకులు అవినీతి అక్రమాలకు తెరలేపారు. ఐదేళ్లలో చేపట్టిన ప్రతి పనిలోనూ పర్సంటేజీలు దండుకున్నారు. తమ అధినాయకుడి అండను చూసుకుని ఉరవకొండ ఎంపీపీ సుంకరత్నమ్మ డ్వాక్రా మహిళలకు సంబంధించిన సొమ్మును రూ.లక్షల్లో స్వాహా చేసినట్లు బయటపడింది.  

సాక్షి, ఉరవకొండ: ఉరవకొండ ఏరియా క్లస్టర్‌ పరిధిలోని ఆమిద్యాలలో ఐదు గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. టీడీపీ ఎంపీపీ సుంకరత్నమ్మ స్వగ్రామమైన ఆమిద్యాలలో తానే తన మద్దతుదారులతో సిరివెన్నెల గ్రామైక్య సంఘం (వీఓ) ఏర్పాటు చేసుకుంది. ఈ వీఓలో మొత్తం 34 స్వయం సహాయక పొదుపు (డ్వాక్రా) సంఘాలు ఉండగా.. ఇందులో 90 శాతం తన బినామీలను సభ్యులు ఏర్పాటు చేసుకుని రూ.లక్షలు స్వాహా చేయడానికి పక్కా ప్రణాళిక రూపొందించుకుంది.

ఆమిద్యాలలోని జాబిలి, ఝాన్సీలక్ష్మి, ముద్దమందారం, మారుతీ ప్రసన్న, విజయ సంఘాల్లో ఎక్కవ శాతం అవినీతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అవినీతి జరిగిన సంఘాల్లో వీఓలో మారుతీ ప్రసన్న సంఘానికి ఎంపీపీ లీడర్‌గా ఉంది. గతంలో మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేసిన అనుభం ఎంపీపీకి ఉండటంతో వీఓలకు ఎన్ని నిధులు వస్తాయో పూర్తి స్థాయిలో అవగాహన ఉంది.
 
స్త్రీనిధి, సీఐఎఫ్‌ సొమ్ము స్వాహా 
సిరివెన్నెల గ్రామైక్య సంఘానికి రూ.20 లక్షల వరకు స్త్రీనిధి మొత్తం 2016–17లో మంజురు కాగా.. ఇందులో ఒక్క పైసా కుడా సంఘాలకు పంపిణీ చేయలేదు. 2011 నుండి 2013లో సామాజిక పెట్టుబడి నిధి కింద వీఓకు రూ.10 లక్షలు మంజూరైనా ఇప్పటివరకు ఒక్క పైసా రికవరీ చేయలేదు. 34 సంఘాల్లో ఉన్న రూ.3లక్షల పొదపు సొమ్ము మొత్తం ఎంపీపీ స్వాహ చేసినట్లు తెలిసింది. ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కింద ఎస్టీ సంఘానికి జీవనోపాధుల కోసం రూ.5 లక్షల మంజూరైతే తనే ఎరికల సరస్వతీ మహిళా సంఘానికి మంజూరు చేసినట్లు చూపింది. అయితే ఆ సంఘానికి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. వాస్తవానికి ఆ సంఘానికి ఒక్క పైసా మంజూరు కాలేదని వెలుగు అధికారుల విచారణలో బయటపడింది.  

సంఘాలను భ్రష్టు పట్టించిన టీడీపీ నేతలు 
ఉరవకొండ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ఎంపీపీ సుంకరత్నమ్మ ఆమె ప్రధాన అనుచరులైన టీడీపీ నాయకులు డ్వాక్రా సంఘాలను భ్రష్టు పట్టించారు. కొంతమంది యానిమేటర్లను ఎన్నికల సమయంలో ఓటర్లకు డబ్బులు పంచడానికి ఎంపీపీ వినియోగించినట్లు తెలుస్తోంది. అధికారం ఉంది కదా అని సంఘంలో మహిళలను బెదిరించి టీడీపీకి ఓటు వేయాలని ప్రలోభాలకు గురిచేసింది. స్త్రీనిధి సొమ్మును ఎంపీపీ ప్రోద్బలంతో కొంతమంది యానిమేటర్లు గ్రామైక్య సంఘాల ద్వారా స్వాహా చేసినట్లు తెలుస్తోంది.

ప్రతి పైసా కక్కిస్తాం 
ఆమిద్యాల వీఓ పరిధిలోని ఆరు సంఘాల్లో అవినీతి జరిగినట్లు విచారణలో తేల్చాం. ఈ సొమ్మ కట్టాలని ఆయా సభ్యులకు అడిగితే తాము కడుతామని చెబుతున్నారు. సంఘాల పేరుతో ఒక వ్యక్తి సొమ్మను తీసుకుని వాడుకున్నట్లు తెలుస్తోంది. తిన్న ప్రతి పైసా కక్కిస్తాం.  – రవీంద్రబాబు, ఏసీ, ఉరవకొండ క్లస్టర్‌  

మరిన్ని వార్తలు