కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా

30 Dec, 2014 12:33 IST|Sakshi
కోడి పందాలు... నేతల అరెస్ట్... ఎంపీల ధర్నా

ఏలూరు: కోడిపందాలు ఆడుతు పోలీసులకు చిక్కి అరెస్ట్ అయిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ ఎంపీలు పోలీసులను డిమాండ్ చేశారు. నేతల అరెస్ట్కు నిరసనగా మంగళవారం ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజుతోపాటు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బైఠాయించారు. దాంతో జడ్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు.

జిల్లాలోని ద్వారక తిరుమలలో కోడిపందాలు ఆడుతున్న దాదాపు 17 మంది టీడీపీ నేతలను పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  అయితే నూతన సంవత్సరం, సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఇప్పటికే హెచ్చరించారు.

అదికాక రాష్ట్రంలో కోడి పందేల నిర్వహణకు ఎవరికీ అనుమతి లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందేలను నిర్వహించినా, జూదమాడినా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. దాంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుపా నేతృత్వంలోని ధర్మాసనం కోడి పందేలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ గతవారం హైకోర్టులో  దాఖలు చేశారు. దీనిపై ప్రభుత్వ న్యాయవాది ఇచ్చిన వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు