నామినేషన్‌ పనుల్లో రూ. 10 కోట్ల అవినీతి

30 Jun, 2019 13:13 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విడదల రజని, పక్కన చైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారి

కౌన్సిల్‌ సమావేశంలో స్పష్టం చేసిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారి

విస్తుపోయిన టీడీపీ కౌన్సిలర్లు

 అవినీతిపై ఎమ్మెల్యే విడదల రజని మండిపాటు 

చిలకలూరిపేట: ఒక్కొక్కటి లక్ష రూపాయల చొప్పున విభజించి నామినేషన్‌ ప్రాతిపదికన గత ఐదేళ్లలో నిర్వహించిన పనుల్లో రూ.10కోట్ల అవినీతి జరిగిందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రస్తుత అధికారులు విచారణ నిర్వహించాలని కోరారు. పురపాలక సంఘ కౌన్సిల్‌ సమావేశం మైలవరపు గుండయ్య కౌన్సిల్‌ హాలులో శనివారం చైర్‌పర్సన్‌ గంజి చెంచుకుమారి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఆమె జరిగిన అవినీతి గురించి మాట్లాడటంతో పాలక పక్షమైన టీడీపీ కౌన్సిలర్లు ఖంగుతిన్నారు. ఈ విషయమై మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ నాయుడు వాసు, వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు షేక్‌ నాగుల్‌మీరా, సాపా సైదావలి తదితరులు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా జరుగుతున్న అవినీతిపై తాము ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదని, అభ్యంతరాలు చెప్పినా ఎజెండాలు ఆమోదించుకొని వెళ్లి పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కారణంగా కోట్లాది రూపాయాల ప్రజాధనం దోపిడీకి గురైందని మండిపడ్డారు. ఈ తరుణంలో టీడీపీ సభ్యులు వాదనకు దిగటంతో కొద్ది సేపు సమావేశంలో వాదోపవాదాలు జరిగాయి. మీ చైర్‌పర్సన్‌నే అవినీతి జరిగిందని ఒప్పుకున్నప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్లు నిలదీశారు.

రశీదులు ఇవ్వండి... 

పట్టణ ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఇస్తే అవి తీసుకొని మున్సిపల్‌ అధికారులు వాటికి రశీదులు ఇచ్చే విధానాన్ని అమలు పరచాలని సూచించారు. ఏ పని ఎన్ని రోజుల్లో చేస్తారో చిన్న చీటీపై రాసి ప్రజలకు అందించాలన్నారు. లంచాల కోసం ప్రజ లను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటే తగు చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరించారు. పలు సమస్యలపై డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ షేక్‌ అబ్దుల్‌ రౌఫ్, ఏడో వార్డు కౌన్సిలర్‌ సాతులూరి దేవికుమారి, రెండో వార్డు కౌన్సిలర్‌ దారా అరుణకుమారి, కౌన్సిలర్లు నాంపల్లి పూర్ణిమ, బొల్లెద్దు కృపమ్మ, షేక్‌ బాజీబేగం, షేక్‌ కాలేషావలి, షేక్‌ పాచ్చాబుడే, చెమిటిగంటి పార్వతిదేవి, పుల్లగూర కల్పన, కుప్పాల ప్రశాంతి మాట్లాడారు. 

నిజాయితీతో కూడిన పాలన ప్రజలకు అందించాలి

పురపాలక సంఘం గత ఐదేళ్లు దోపిడీకి గురైందని, ఇక ఆ విధానాలు విడనాడి నిజాయితీతో కూడిన పాలన ప్రజలకు అందించాలని ఎమ్మెల్యే విడదల రజని చెప్పారు. పురపాలక సంఘ కౌన్సిల్‌ సమావేశంలో ఎక్స్‌అఫీషియో సభ్యురాలిగా తొలిసారి ఎమ్మెల్యే రజని కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగేతర శక్తిగా, అనధికార మంత్రిగా మాజీ మంత్రివర్యుడి సతీమణి పురపాలక సంఘాన్ని దోచుకుతిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు పురపాలక సంఘ అధికారులు సైతం వత్తాసు పలికి ప్రజాధనాన్ని దోచిపెట్టారని ఆరోపించారు. అందుకే ప్రజలు ఓటు అనే ఆయుధంతో అడ్రస్‌లేకుండా చేశారని పేర్కొన్నారు. ర్యాటిఫికేషన్‌ ద్వారా నామినేషన్‌ పనుల రూపంలో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. టీడీపీకే చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సైతం దారుణమైన అవినీతి జరిగిందని ఆవేదన వ్యక్తం చేయటం ఇక్కడి అవినీతికి అద్దం పట్టిందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు