ఆశల తీరం.. అభివృద్ధికి దూరం

23 Mar, 2019 11:40 IST|Sakshi
బియ్యపుతిప్పలో హార్బర్‌ నిర్మిస్తామని చెబుతున్న ప్రాంతం

సాక్షి, నరసాపురం: జిల్లాలో 19 కిలోమీటర్లు మేర తీర ప్రాంతం.. అపార మత్స్యసంపద, ఏటా రూ.300 కోట్లపైగా మత్స్యసంపద ఎగుమతులు.. వేటపై ఆధారపడి జీవించే 3 వేల మత్స్యకార కుటుంబాలు.. ఇది నరసాపురం ప్రాంతం పరిస్థితి. అయితే సముద్రంలోకి బోట్లను పంపుకోవడానికి, మత్స్యసంపద ఎగుమతులు, దిగుమతులు చేసుకోవడానికి సరైన ఫ్లాట్‌పాం లేని దుస్థితి. నరసాపురం మండలం బియ్యపుతిప్పలో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని దశాబ్దాలుగా నేతలు చెబుతూనే ఉన్నా కార్యాచరణ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ అంశంపై కదలిక వచ్చింది. ఆయన మృతితో పట్టించుకునేవారే కరువయ్యారు. మత్స్యకారులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారి ఓట్లకు  గాలం వేసేందుకు తెలుగుదేశం పార్టీ హార్బర్‌ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. హార్బర్‌ స్థానంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం అంటూ హడావుడి కూడా చేశారు.  


అపార మత్స్యసంపద..
బంగాళాఖాతానికి చేరువలో ఉండటంతో నరసాపురం తీరంలో అపారంగా మత్స్యసంపద ఉంది. నరసాపురం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన సుమారు 150 వరకూ బోట్లు తీరంలో నిత్యం వేటసాగిస్తాయి. ఏటా ఈ ప్రాంతం నుంచి రూ.300 కోట్లపైనే మత్స్య ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే స్థానికంగా ఎగుమతి, దిగుమతులకు సంబంధించి, వేట బోట్లను నిలిపి ఉంచుకోవడానికి ఎలాంటి సదుపాయాలు లేవు. దీంతో వేట ముగించిన బోట్లు అటు తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది. నరసాపురంలోని లాకుల వద్ద ఉన్న గోదావరి పాయ వద్ద నిలిపి ఉంచుతారు. మళ్లీ బోట్లను వేట కోసం సముద్రంలోకి తీసుకెళ్లడం మత్స్యకారులకు కష్టంతో కూడుకున్న పని. మత్స్యకారుల వేటకు అనువుగా, మత్స్యసంపద ఎగుమతి, దిగుమతులకు వీలుగా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో హార్బర్‌ నిర్మించాలనే డిమాండ్‌ ఎంతో కాలంగా ఉంది. 


ఐదేళ్లు.. ఎన్నో డ్రామాలు
టీడీపీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో హార్బర్‌పై ఎలాంటి దృష్టిపెట్టలేదు.  హార్బర్‌ తరహాలోనే  బియ్యపుతిప్పలో రూ.13.58 కోట్లతో ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మిస్తామని కొత్త ప్రతిపాదన తెరమీదకు తెచ్చారు. 2017 జనవరి 26న మత్స్యశాఖ కార్యదర్శి ఎస్‌.అంజలి బియ్యపుతిప్ప ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని, మరో రెండు, మూడు నెలల్లోనే పనులు మొదలు పెడతామంటూ హడావుడి చేశారు. కేంద్ర మత్స్యశాఖ నిధులు అందిస్తుందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కొన్నాళ్ల తర్వాత ఎమ్మెల్యే సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వం కాదు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. గతంలో వైఎస్‌ హయాంలో స్థల సేకరణ జరిగిన ప్రాంతంలోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి మొదటి విడతగా రూ.13.58 కోట్లు మంజూరు చేశారని, దీనికి సంబంధించి జీఓ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. లోకేష్‌తో శంకుస్థాపన కూడా చేయించారు. అయితే ఒక్కపైసా కూడా నిధుల విడుదల కాలేదు.  


ఇవీ ఉపయోగాలు..
హార్బర్‌ నిర్మిస్తే తీరప్రాంతంతో పాటు జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మత్స్యసంపదకు డిమాండ్‌ ఉంది. అయితే గిడ్డంగులు వంటి సదుపాయలు లేకపోవడంతో మత్స్య ఉత్పత్తులను అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. హార్బర్‌ నిర్మిస్తే మత్స్యకారులకు మేలు జరుగుతుంది. రవాణా మార్గాలు అభివృద్ధితో పాటు అనుబంధ పరిశ్రమలు వస్తాయి. 


వైఎస్‌ హయాంలో కదలిక
2004లో వైఎస్‌ అధికారంలోకి రాగానే ఫిషింగ్‌ హార్బర్‌పై దృష్టిపెట్టారు. 2006లో వైఎస్‌ రాజశేఖరెడ్డి  రూ.8.53 కోట్లతో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయించారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత  కేంద్ర మత్స్యశాఖ ద్వారా నరసాపురం మండలం బియ్యపుత్పిలో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి దాదాపుగా రంగం సిద్ధం చేశారు. అప్పటి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చొరవతో అక్కడున్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో హార్బర్‌ నిర్మించాలని, రేవు నిర్మాణం, శీతల గిడ్డంగులు, బోట్లు, వలల మరమ్మతుల యూనిట్‌ నెలకొల్పాలని 
నిర్ణయించారు. 


మోసం చేస్తున్నారు 
ఐదేళ్లుగా పట్టించుకోలేదు. హార్బర్‌ నిర్మాణానికి జీఓ వచ్చిందన్నారు. శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. తీరంలో మత్స్యకారులను ప్రభుత్వం మోసం చేస్తుంది. ముందు హార్బర్‌ అన్నారు, మళ్లీ ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ అంటున్నారు. చివరకు ఏదీలేదు. వశిష్ట వంతెన తరహాలోనే హార్బర్‌ విషయంలో కూడా మోసం చేశారు. 
–బర్రి శంకరం, మత్స్యకారనేత

జిల్లా అభివృద్ధిపై ప్రభావం 
జిల్లాలో తీరప్రాంతం ఇక్కడే ఉంది. ఇక్కడ హార్బర్‌ నిర్మిస్తే కేవలం మత్స్యకారులకే కాదు అందరికీ ఉపయోగం. జిల్లా అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. అభివృద్ధిపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 2014 ఎన్నికల్లో 15కి 15 స్థానాలు కట్టబెట్టిన జిల్లాకు చంద్రబాబునాయుడు మొండిచేయి చూపించారు. 
–విన్నా ప్రకాష్, న్యాయవాది 
 

మరిన్ని వార్తలు