సొంత పార్టీలోనే దళితులకు విలువ లేదు

3 Apr, 2019 08:32 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెలుగుదేశం పార్టీలో అగ్రవర్ణ అహంకారం అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనపడుతోంది. దళితులను చిన్న చూపు చూడటమే కాకుండా వారిపై దాడులకు కూడా తెగబడుతున్నారు. దళితులకు పదవులెందుకని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వ్యాఖ్యానిస్తే.. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మరో అడుగు ముందుకు వేసి తమ గ్రామంలో అభివృద్ధి చేయలేదని గోడు చెప్పుకోవడానికి వచ్చిన దళితులపై దగ్గరుండి దాడి చేయించారు. మరోవైపు సొంత పార్టీలోని దళిత నేతలపైనే అంబికా కృష్ణ తక్కువ చేసి మాట్లాడిన వైనం దళితుల ఆగ్రహానికి కారణం అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే... సోమవారం రాత్రి భీమడోలు మండలం పెదలింగంపాడులో టీడీపీ వర్గీయులు దళితులపై దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదలింగంపాడు పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యే గన్నికి దళితుల నుంచి నిరసన ఎదురైంది. గడచిన ఐదేళ్లలో తమ గ్రామాన్ని పట్టించుకోలేదని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించలేదంటూ పెదలింగంపాడు దళితులు తమ సమస్యను చెబుతుండగా, కాన్వాయ్‌ వెంట వచ్చిన గన్ని అనుచరులు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దళిత యువకులపై పిడిగుద్దులు కురిపించారు. వారిని చితకబాదారు. మరోవైపు గన్ని వీరాంజనేయులు కూడా మీరు ఓటు వేయకపోయినా పర్వాలేదంటూ బాధితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

దీంతో భాదితులు బీమడోలులోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది మంగళవారం ఉదయం ఉంగుటూరు రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రిటర్నింగ్‌ అధికారి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. మరోవైపు చింతలపూడిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదంటూ అంబికాకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మాజీ మంత్రి పీతల సుజాత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ సోమవారం జంగారెడ్డిగూడెంలో  ఆర్యవైశ్య సమావేశంలో వ్యాఖ్యలు చేయడంతో  సుజాత వర్గం అడ్డుకుంది. దీంతో సమావేశం రసాభాసగా మారింది. సుజాత చేసిన పాపాలు కడిగేసుకోవడానికే చంద్రబాబు అభ్యర్థిని మార్చారని అంబికాకృష్ణ వ్యాఖ్యానించారు. దళిత ఎమ్మెల్యే కాబట్టే పదేపదే అవమానిస్తున్నారని సుజాత వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని దళిత సంఘాలు తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి బుద్ధి చెప్పాలని ఆ వర్గాలు యోచిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు