అంపశయ్యపై అన్నదాత

30 Mar, 2019 10:10 IST|Sakshi
పొలంలో నీరులేక ఎండిన నాట్లు

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రతి ఏటా కరువు విలయతాండం చేస్తోంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండిచేయి చూపించింది. రైతులకు సకాలంలో రుణాలు అందక రుణమాఫీ పూర్తిస్ధాయిలో వర్తించక తమ కష్టాలను ప్రభుత్వ పట్టించుకోకపోవడంతో అన్నదాతలో నిర్వేదం అలముకుంటోంది. జిల్లాలో రైతు కుటుంబాలు 5.50 లక్షలకు పైగా ఉంటాయి. సాగు విస్తీర్ణం 2.50 లక్షల హెక్టార్లు.  ఇందులో దాదాపుగా 80 వేల హెక్టార్లలో వరిని ఎద పద్ధతిలో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 47,525 హెక్టార్లలో ఇతర పంటలు పండిస్తున్నారు. అధికారిక లెక్కలు అలా చెబుతున్నా వాస్తవానికి ఆ పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు.   


అతివృష్టి లేక అనావృష్టి
టీడీపీ అధికారం చేపట్టిన ఈ ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని ఎన్నో విపత్తులు కదిపేశాయి. 2014లో హుద్‌హుద్‌ తుపాన్‌ సమయంలో సుమారు 3 లక్షల హెక్టార్లలో పంట పోయింది. అంతేకాకుండా నదుల్లో కట్టలు తెగిపోయి పొలాల్లో నీరుచేరి భారీగానే నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చిన సమయంలో 2018లో తిత్లీ తుపాన్‌ వచ్చి సుమారు 3.50 లక్షల హెక్టార్లను నీటముం చింది. రూ.510 కోట్లు నష్టం జరిగితే నేటికీ ఆ పరిహారం ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలకే అప్పగించింది. ఈ ఐదేళ్లలో వర్షాలు సరైన సమయంలో కురవక రణస్ధలం, లావేరు, జి.సిగడాం, వంగర, రేగిడి, సంతబొమ్మాళి, మం దస, భామిని మండలాల్లో కరువు సంభవించినా కరువు నిధులు నేటికీ అందలేదు.


సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అందింది అరకొర నీరే
ప్రధాన సాగునీటి వనరులైన తోటపల్లి, నారాయణపురం, మడ్డువలస ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అంతంతమాత్రంగానే అందించారు. నీటిపారుదల శాఖ అధికారులు నీరు–చెట్టు పనులు మీద చూపించే శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టుల మీద చూపించకపోవడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పలేదు. కాలువల్లో పూడికలు తీయక ప్రధా న సాగునీటిప్రాజెక్టుల నుంచి వచ్చేనీరంతా వృధా గా పోయింది. ప్రాజెక్టులు పూర్తికాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 


సకాలంలో అందని విత్తనాలు, ఎరువులు
జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులందరికీ కావాల్సినన్ని విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించలే దు. అంతేకాక విత్తనాలు ఎరువులు అందించడంలోనూ పక్షపాత వైఖరినే అవలంబించారు. కల్తీ ఎరువులతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో దళారీల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిíస్ధితి ఏర్పడింది. ఖరీఫ్‌ సమయానికి అరకొరగా విత్తనాలు పంపిణీ చేయడంతో రైతులు విత్తన కేంద్రాలు, మార్కెట్‌ యార్డుల వద్ద తిండితిప్పలు లేకుండా పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. జిల్లాకు విత్తనాలు ఖరీఫ్‌లో 50 వేల టన్నులు, రబీలో 1389 టన్నులు, ఎరువులు 2,62,988 మెట్రిక్‌ టన్నులు అవసరం ఉన్నప్పటికీ సకాలంలో సరఫరా చేయకపోవడంతో రైతులు నానాపాట్లు పడ్డారు.


ఖరీఫ్‌ రుణాలు అంతంతమాత్రమే
రైతులకు రుణ మాఫీ చేస్తానని, తొలి సంతకం ఆ ఫైలు మీదే పెడతాననిని చెప్పి అధికారం చేపట్టిన చంద్రబాబు.. దానిని ఐదు విడతల్లో మాఫీ చేస్తానని చెప్పారు. అయితే ఇప్పటికీ మాఫీ జరగలేదు. రూ.5 వేలు లోపు రుణాలు తీసుకున్నవారికే మాఫీ జరిగింది తప్ప మిగిలిన వారికి బాండ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గతంలో ఇచ్చినవాటికి రె న్యువల్‌ చేశారు తప్ప కొత్తగా ఒక్క పైసా ఇవ్వలేదు.


నేటికీ అందని గతేడాది ఇన్‌పుట్‌ సబ్సిడీ
ప్రభుత్వం రైతుల మెప్పు కోసం హడావిడిగా కరువు మండలాలను ప్రకటించడమే గానీ ఆదుకున్నది లేదు. 2015–2016లో ఖరీఫ్‌లో 18 కరువు మండలాలు, 2016– 2017లో 11,  2017–20 18కి గాను 9 కరువు మండలాలుగా ప్రకటించినా నేటికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదు. 2015–2016లో 3,10,867 హెక్టార్లకుగాను 89,450మంది రైతులకు రూ.46.63 కోట్లుగా ఇన్‌పుట్‌ సబ్సిడీ నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. ఒక్క రైతు ఖాతాలో కూడా ఒక్క రూపాయీ జమ కాకపోవడం గమనార్హం. ఇప్పటికీ బిల్లులను ఆన్‌లైన్‌లో ప్రాసెస్‌ చేస్తున్నామని చెబుతున్నారు. 


కౌలు రైతుల బతుకులు చితికాయి
అధికారంలోకి రాకముందు కౌలు రైతులందరినీ ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. జిల్లాలో 2 లక్షలకు పైగా కౌలు రైతులున్నారు. వీరి లో ఇప్పటివరకు 18 వేల మందికి మాత్రమే గుర్తిం పు కార్డులు ఇచ్చారు. 


సాధారణ మరణాలుగానే ఆత్మహత్యలు
పంటలకు గిట్టుబాటు ధరలేక అప్పులపాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా వాటిని సాధారణ మరణాలుగానే గుర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. భామిని, కొత్తూరు మండలాల్లో రెండేళ్ల క్రితం పత్తి రైతు నష్టాలకు గురై మరణిస్తే వాటిని సహజ మరణాలుగానే అధికారులు, టీడీపీ నేతలు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు