మరో 'పచ్చ' పెత్తనం

13 Dec, 2017 11:43 IST|Sakshi

సాధికార మిత్ర నియామకాల ముసుగులో బూత్‌ మిత్రల రంగ ప్రవేశం

 జన్మభూమి కమిటీల తరహాలో ఏర్పాటు 

 ఎన్నికల ఎత్తుగడని విస్తృత చర్చ 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాధికార మిత్ర ముసుగులో బూత్‌ మిత్ర నియామకాలు చేపడుతున్నారు. బూత్‌ స్థాయి కార్యకర్తలుగా వినియోగించుకునేందుకు సీఎం చంద్రబాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. జన్మభూమి కమిటీల తరహాలో గ్రామాల్లో తనకు అనుకూల వ్యక్తులను నియమించుకుంటున్నారు. పథకాల ప్రచారం, సమస్యల పరిష్కారం కోసమని చేపడుతున్న సాధికార మిత్ర నియామకాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి నియామకాలు పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో అధికార వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. ఇప్పటికే జన్మభూమి కమిటీలు చెలరేగిపోతున్నాయి. గ్రామాల్లో పచ్చరోత రాజకీయాలు చేస్తున్నాయి. అర్హులు, అనర్హులన్న విషయాన్ని పక్కన పెట్టి  టీడీపీ మద్దతు దారులైతేనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాయి. ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి. గ్రామాల్లో రాజకీయ అశాంతిని సృష్టిస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఆగడాలపై ఇప్పటికే న్యాయస్థానాల్లో అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. కమిటీ సభ్యుల దౌర్జన్యాలను కోర్టులు సైతం ఆక్షేపించి, అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసింది. ఈ కమిటీలే గ్రామాల పాలిట శాపంగా మారాయనుకుంటే ఇప్పుడా విధానాన్ని బూత్‌ స్థాయికి ప్రభుత్వం తీసుకెళ్తోంది.

సాధికార మిత్ర పేరుతో కార్యకర్తల నియామకం 
స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)లోని తమకు అనుకూల మహిళలను సాధికార మిత్రలుగా నియమించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారు. 35 కుటుంబాలకొక మిత్ర చొప్పున నియమించాలని, నియమించేముందు ఎమ్మెల్యేను సంప్రదించి, జన్మభూమి కమిటీ ఆమోదం మేరకు నియామకం చేపట్టాలని నేరుగా ఆదేశించారు. ప్రజా సాధికారిత సర్వేలో చేసిన క్లస్టర్ల విభజన ఆధారంగా నియామకాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 17 లక్షల 83 వేల 145 కుటుంబాలున్నాయి. 35 కుటుంబాలకు ఒకరు చొప్పున జిల్లా వ్యాప్తంగా 50,947 మందిని సాధికార మిత్రలుగా నియమించనున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. గత నాలుగు రోజులుగా వీటి నియామకంలోనే అధికారులంతా నిమగ్నమయ్యారు. వీరిని ఎలా నియమించాలన్నదానిపై సదరు అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వీటిని సత్వరమే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టడంతో అధికారులంతా పరుగులు తీస్తున్నారు.

ఎన్నికల దృష్టితోనే..
ఎన్నికల దృష్టిలో ఉంచుకుని సాధికార మిత్ర నియామకాలు చేపడుతున్నారు. తమకు అనుకూల మహిళలను మిత్రలుగా నియమించి, బూత్‌ స్థాయిలో పనిచేయించనున్నట్టు సమాచారం. వీరి ద్వారానే ఎన్నికల వ్యూహరచనలు చేయనున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతీదీ వారిచేత చేయించాలని, లోపాయికారీ కథ నడిపించాలని రాజకీయ ఎత్తుగడతో సాధికార మిత్రలను ఏర్పాటు చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. బయటికి మాత్రం ఆ 35 కుటుంబాలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన, ప్రచారం చేయడంతో పాటు సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా చెప్పుకొస్తున్నారు. కానీ లోపాయికారీ మర్మమైతే మాత్రం రాజకీయ లబ్ధిపొందడానికేనన్న వాదనలు విన్పిస్తున్నాయి. విశేషమేమిటంటే  సాధికార మిత్ర నియామకాలని అధికారికంగా చెబుతుండగా...ఇటీవల వాటి నియామకాల ప్రగతిపై అధికారులతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో మాత్రం బూత్‌మిత్ర నియామకాలు ఎంత వరకు వచ్చాయని, వెంటనే పూర్తి చేయాలని సీఎం ఆదేశించడంతో అధికారులంతా అవాక్కయ్యారు. బయటికి సాధికార మిత్ర అని చెబుతున్నా...సీఎం మనసులో మాత్రం వారంతా బూత్‌ మిత్ర కార్యకర్తలే అన్న అభిప్రాయం ఉందనేది స్పష్టమయిందని అధికార వర్గాలు సైతం వాపోతున్నాయి. 

మరిన్ని వార్తలు