కొలిక్కిరాని కుస్తీ...

12 Mar, 2019 07:02 IST|Sakshi

టీడీపీలో తేలని సీట్ల పంచాయితీ 

సద్దుమణగని వివాదాలు.. కుదరని ఏకాభిప్రాయం

సాక్షి, ఏలూరు (పశ్చిమ గోదావరి) : తెలుగుదేశం పార్టీలో సీట్ల ఎంపిక ఇంకా కొనసా..గుతూనే ఉంది. చింతలపూడి, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం సీట్లకు సంబంధించి వివాదాల కారణంగా అభ్యర్థుల ఎంపిక ముందుకు సాగడం లేదు. సమన్వయ కమిటీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి సంబం ధించి మూడు, నాలుగు సార్లు సమీక్షలు నిర్వహించినా ఏకాభిప్రాయం రాలేదు. సోమవారం కూడా నిడదవోలు, కొవ్వూరు నాయకులను అమరావతి పిలిపించి సమన్వయ కమిటీ అభిప్రాయాలు సేకరించింది.

అయితే అక్కడ ఏకాభిప్రాయం రాలేదు. సగంమంది కొవ్వూరులో మంత్రి జవహర్‌కు ఇవ్వడానికి ససేమిరా అనగా మిగిలిన వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం. అదే సందర్భంలో నిడదవోలుపై కూడా పీటముడి వీడలేదు. ఒక వర్గం కుందుల సత్యనారాయణకు సీటు ఇవ్వాలని కోరగా, మరికొంతమంది శేషారావుకు మద్దతు పలికారు. దీంతో ఈ అంశాన్ని మరో రెండురోజులు వాయిదా వేశారు. ఘంటా మురళి చేరికను పురస్కరించుకుని చింతలపూడి నేతలు కూడా తమ నాయకుడి దృష్టిలో పడేందుకు అమరావతి వెళ్లారు.

స్థానిక టీడీపీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయని విషయం తెలిసిందే. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న స్థానాలు, సీట్లు కేటాయించిన స్థానాల విషయంలో ముఖ్యమంత్రి అసంతృప్తులను బుజ్జగించేందుకు తంటాలు పడుతున్నారు. వాటిలో భాగంగా అసంతృప్తులను బుజ్జగించేందుకు రెండు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి నేతలందరితో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు.

అసంతృప్తులు ఉన్న చోట్ల ఆయా నేతలను పిలిచి మాట్లాడుతున్నారు. నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అనుకూల, వ్యతిరేక వర్గాలను పిలిపించి మాట్లాడారు. ఎక్కడెక్కడ అసమ్మతి రగులుకుంటుందో ఆయా అసమ్మతి నేతలతో మాట్లాడి నామినేషన్లకు ముందుగానే అక్కడి పరిస్థితులను చక్కదిద్దడం, మార్పులు చేర్పులు చేయడం లాంటి అంశాలపై చంద్రబాబు కుస్తీ పడుతున్నారు. అయితే ఇరువర్గాలు తగ్గకపోవడంతో మళ్లీ నిడదవోలు, కొవ్వూరుపై రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పి పంపించారు.

చింతలపూడి, పోలవరం, గోపాలపురం నియోజకవర్గాలపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాడేపల్లిగూడెంలో ఈలి నానికి టిక్కెట్‌ ఇస్తామని చెప్పడంతో జెడ్పీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు వర్గం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. సీటు ఆశించిన మున్సిపల్‌ చైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి జనసేనలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఈ అసమ్మతి సద్దుమణిగేలా చేసేందుకు బాపిరాజుకు ఉంగుటూరు సీటు కేటాయిస్తే ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


మంత్రి జవహర్‌కు మళ్లీ చుక్కెదురు
కొవ్వూరు టీడీపీ అభ్యర్థి ఖరారు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి కేఎస్‌ జవహర్‌కి మరోసారి చుక్కెదురైంది. సోమవారం నియోజకవర్గ నాయకులతో భేటీ అయిన సీఎం చంద్రబాబు అభ్యర్థి ఎంపిక అంశాన్ని మరో రెండు రోజులు పాటు వాయిదా వేశారు. జవహర్‌పై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వం ఖరారుపై అధిష్టానం సుముఖంగా లేనట్లు చెబుతున్నారు. అందుకే చంద్రబాబు సాగదీత ధోరణి అవలంభిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. జవహర్‌కి టిక్కెట్టు కేటాయిస్తే తాము సహకరించబోమని వ్యతిరేక వర్గీయులు పార్టీ అధినేత చంద్రబాబు ముందు తెగేసి చెబుతున్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో మరో రెండు రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం.


ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆశావహులు
మంత్రి జవహర్‌కి దాదాపుగా ఈసారి టిక్కెట్‌ ఇవ్వరన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుండడంతో ఇక్కడ టిక్కెట్‌ ఆశిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరుపక్షాల నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. పార్టీ పెద్దలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు తనకు గానీ తన కుమార్తె దివ్యరాణికి టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారు. రిటైర్డు ఉద్యోగులు రాపాక సుబ్బారావు, అయినపర్తి రాజేంద్రప్రసాద్, పెనుమాక జయరాజుతో పాటు వేమగిరి వెంకటరావు, బచ్చు శ్రీనుబాబు తదితరులు టికెట్‌ ఆశిస్తున్నారు.   

మరిన్ని వార్తలు