దౌత్య మంత్రం

23 Oct, 2014 05:30 IST|Sakshi
దౌత్య మంత్రం

‘ఆళ్లగడ్డ’ ఏకగ్రీవానికి మార్గం సుగమం
* రాజకీయ అనుభవంతో చక్రం తిప్పిన భూమా
* వ్యూహాత్మక అడుగులతో చల్లారిన వేడి
* టీడీపీ, కాంగ్రెస్ స్వచ్ఛంద సహకారం

సాక్షి, కర్నూలు: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి అడ్డంకులు తొలగిపోయాయి. రెండు రోజుల క్రితం వరకు పోటీ తప్పదనే భావన సర్వత్రా వ్యక్తమైంది. ఊహించని విధంగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చూపిన రాజకీయ చతురత ఏకగ్రీవానికి బాటలు వేసింది. అన్ని రాజకీయ పార్టీలతో తనకున్న సత్సంబంధాలను ఉపయోగించుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో లేకుండా చేయడంలో సఫలీకృతులయ్యారు. భూమాకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవమే ఇందుకు ఉపకరించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడం తెలిసిందే. అప్పటికే ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఆమె పేరును అభ్యర్థుల17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం ముందుగా ప్రకటించినట్లుగానే ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే సాంకేతిక కారణాలతో ఉప ఎన్నికకు ఆలస్యంగా పచ్చజెండా ఊపింది. దీంతో ఈనెల 17న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ నామినేషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఆళ్లగడ్డలో రాజకీయ సందడి నెలకొంది. శాసనసభ్యులు చనిపోయి.. ఆ స్థానంలో వారి కుటుంబ సభ్యులు పోటీలో నిలిస్తే ఇతర పార్టీలేవీ తమ అభ్యర్థులను బరిలో నిలపరాదనే సంప్రదాయం రాష్ట్రంలో కొనసాగుతోంది.

ఇక్కడా అదే పరిస్థితి ఉంటుందని అందరూ భావించారు. కానీ టీడీపీ నేతలు పోటీలు నిలుస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఆ మేరకు అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వద్ద పంచాయితీ పెట్టారు. ఉప ముఖ్యమంత్రితోనూ చర్చించారు. ఇద్దరు ఆశావహులు బరిలో నిలిచే విషయమై పోటీపడ్డారు. ఇదంతా నాణేకి ఒకవైపు మాత్రమే. భూమా నాగిరెడ్డి తనకున్న విస్తృత రాజకీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చక్రం తిప్పడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టరాదని ఒకప్పుడు చంద్రబాబే స్వయంగా ప్రతిపాదించిన అంశాన్ని ఆ పార్టీ నేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతలతో దౌత్యం నెరిపి టీడీపీ నాయకులను పోటీకి దూరంగా ఉంచగలిగారు. పోటీకి దూరంగా ఉందామంటూ ఆ పార్టీ అధినేత ద్వారానే ఆశావహులను ఒప్పించగలగటం ఆయన రాజకీయ చతురతకు నిదర్శనం.
 
పీసీసీపై డీసీసీచే ఒత్తిళ్లు
నందిగామ ఉప ఎన్నికలో బరిలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఆ సందర్భంలోనే ఆళ్లగడ్డ ఉప ఎన్నికలోనూ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలో నిలుపుతామని స్పష్టం చేసింది. పీసీసీ నిర్ణయంతో తొలుత ఇక్కడ నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను డీసీసీ అధ్యక్షుడు పార్టీ పెద్దల ముందుంచారు. తీరా నామినేషన్ల ఘట్టం ముగిసే సమయానికి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పోటీలో నిలవటం లేదని స్వయంగా ప్రకటించేలా భూమా పావులు కదిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న కేంద్ర రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డితో మంతనాలు నెరిపి.. ఆ వెంటనే జిల్లా కాంగ్రెస్ నేతలు, డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్యతో సమావేశమై పోటీకి దూరంగా ఉండాలనే విషయమై తీర్మానం చేయించడంలో విజయం సాధించారు. ఒక దశలో డీసీసీచే పీసీసీపైనే ఒత్తిడి తీసుకొచ్చి ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు మార్గం సుగమమం చేసుకోవడం విశేషం.

మరిన్ని వార్తలు