టీడీపీ సొంతింటి ప్యాకేజీ...!

23 Nov, 2013 03:05 IST|Sakshi
టీడీపీ సొంతింటి ప్యాకేజీ...!
 పార్టీలోకి వచ్చే నేతలకే కాదు.. పార్టీని వీడిపోతారనే నేతలను బుజ్జగించడానికీ టీడీపీలో ప్యాకేజీలు ఇస్తున్నారు. ఈ సొంతింటి ప్యాకేజీ సంగతి గురించి తెలుసుకున్న పలువురు టీడీపీ నేతలు ఇదేదో బాగానే ఉందే అనుకుంటున్నారు. విషయమేమిటంటే.. కాంగ్రెస్‌తో కుదిరిన ప్యాకేజీలో భాగంగా నేడో రేపో పార్టీ మారిపోతున్నాడని ఒక తెలంగాణ నాయకుడిపై టీడీపీలో కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నాయకుడు పార్టీ ‘టీ’ నేతల మేధోమథన సదస్సులో అందరికీ షాకిచ్చారు.
 
  ‘‘పార్టీ మారుతున్నట్టు నాపై లేనిపోని ప్రచారం జరుగుతోంది. చూడండి.. నా గుండెల్లో చంద్రుడు(చంద్రబాబు) ఉన్నారు’’ అంటూ చొక్కా విప్పి మరీ తన ఛాతీని అక్కడున్నవారికి చూపించేశారు. పురాణాల్లో హనుమంతుడు తన రామభక్తిని చాటినట్టు ఈయన తన చంద్రభక్తిని చాటడంపై ఆ నేతలంతా ఆశ్చర్యపోయారు. నిన్నటివరకు రోజూ తిడుతున్న నాయకుడే ఒక్కసారిగా ఇలా భక్తి చాటుకోవడంలో ఆంతర్యమేంటా అని ఆరా తీసేసరికి అసలు విషయం తెలిసి ముక్కున వేలేసుకున్నారట. టీ టీడీపీ ఫోరానికి చెందిన ఆ నేత కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం జరుగుతుండటంతో బాబు ఆయన్ను రహస్యంగా పిలిపిం చుకుని మాట్లాడారట.
 
  అసలే పార్టీ స్థితి దయనీయంగా మారుతున్న టైమ్‌లో మీలాంటి నేతలు బయటికెళ్లిపోతే ఎలా? అలాంటి ప్రయత్నాలు విరమించుకోవాలని కోరారట. దాంతో పార్టీలో ఉండాలంటే ఇవి చేయండంటూ చాంతాడంత కోరికల చిట్టా విప్పారట. ‘‘వచ్చే ఎన్నికల్లో మీరు టికెట్ ఇచ్చినా గెలిచే స్థితి కనిపించట్లేదు. అలాంటప్పుడు నేను ఖర్చుపెట్టుకుని ఏం సాధిస్తాను. అందుకే ఇప్పట్నుంచి ఎన్నికలదాకా అయ్యే ఖర్చుతో పాటు ఎన్నికల ఖర్చునూ పూర్తిగా మీరే భరించాలి. నేను ఓడితే ఆ తర్వాత నాకు రాజ్యసభ టికెట్ ఇస్తానని హామీ ఇవ్వాలి’’ అంటూ జాబితా చెప్పుకుపోయారట. అందుకు అధినేత ఓకే అన్నారట. దాంతో సదరు నేత మీటింగ్‌లోకొచ్చి తన చంద్రభక్తిని చాటుకున్నారట. ఓహో! పార్టీలోకి వచ్చేవారికే కాదు! పార్టీని వీడిపోతారని ప్రచారం జరిగినా ప్యాకేజీలు ఇస్తారన్నమాట. ఇదేదో బాగుందే.. మనమూ ఆ ఫీలర్స్ వదిలితే పోలే...!!  అని పలువురు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట..!
మరిన్ని వార్తలు