అయ్యో.. ఏయూ

25 May, 2018 13:10 IST|Sakshi

ప్రతిష్టాత్మక వర్సిటీని టీడీపీ అడ్డాగా మార్చేస్తున్నారు

పార్టీ సమావేశాలకు, మహానాడుకు అప్పనంగా అప్పగింత

అధికార పార్టీ నేతల పెళ్లిళ్లకూ ఇదే వేదిక

స్నాతకోత్సవానికీ రాజకీయ రంగు

31న స్నాతకోత్సవ వేదికపై మంత్రి గంటా ఆసీనులవుతారట

వివాదాస్పదమవుతున్న ఏయూ పాలకుల నిర్ణయాలు

విఖ్యాత ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ పంకిలంలో నిలువునా కూరుకుపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీ ప్రాంగణాలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నా అధికారులు, ఆచార్యులు నోరెత్తకపోవడంతో అంతా టీడీపీ నాయకుల ఇష్టారాజ్యంగా సాగుతోంది.

గత ఏడాది మహానాడు.. నిన్న గాక మొన్న ధర్మపోరాట సభ నిర్వహించినా.. ఆ సభకు కార్యకర్తలు, వాహనాల ప్రవేశానికి వీలుగా వర్సిటీ గోడలు సైతం పగులగొట్టినా.. విద్యుత్‌ను అడ్డగోలుగా వాడేసుకున్నా.. వర్సిటీ అధికారులు కిక్కురుమనలేదు.

ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఈనెల 31న జరగనున్న ఏయూ 85వ స్నాతకోత్సవ వేదికపై ముందెన్నడూ లేని విధంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసీనులవుతారని పేర్కొనడం మరో వివాదం రేపుతోంది.
వర్సిటీ చరిత్రలో స్నాతకోత్సవ వేదికపై గవర్నర్, ముఖ్య అతిథి, వీసీ, రిజిస్ట్రార్, అకడమిక్‌ సెనేట్‌ సభ్యులు మాత్రమే ఆసీనులవుతారు. దీనికి భిన్నంగా మంత్రి గంటా కూర్చుంటారని పేర్కొనడం చర్చనీయాంశమవుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాన్ని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా మార్చేశారు. గత నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు, లోకేష్‌బాబుల పుట్టినరోజు వేడుకలనూ ఇక్కడే  చేసుకున్న టీడీపీ నేతలకు నగరంలో భారీఎత్తున బహిరంగసభ నిర్వహించాలంటే ఏయూనే గుర్తుకు వస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను పట్టించుకోకుండా అనుకున్నదే తడవుగా కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. వర్సిటీ భవనాలు, ఖాళీ ప్రదేశాలను వినియోగించుకోవాలంటే ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి. కానీ టీడీపీ నేతలు అది కూడా చేయడంలేదు. మంగళవారం జరిగిన ధర్మపోరాట సభ సందర్భంగా వర్సిటీ గోడను సైతం పగులగొట్టి ప్రవేశ మార్గం కల్పించడం వివాదాస్పదమవుతోంది. ఈ గోడ పునర్నిర్మాణానికి రూ.రెండు లక్షలకు పైగా ఖర్చవుతుంది. ఈ డబ్బును ఎవరు చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక ధర్మ పోరాట సభకు  వర్సిటీ  నుంచి అక్రమంగా విద్యుత్‌ వినియోగించినా ఇటు వర్సిటీ అధికారులు గానీ.. అటు ట్రాన్స్‌కో అధికారులు గానీ ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారు.

టీడీపీ నేతల పెళ్లిళ్లకూ ఇచ్చేస్తున్నారు..
వాస్తవానికి  వర్సిటీ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరాన్ని పెళ్లిళ్లకు ఇవ్వకూడదని ప్రస్తుత వీసీ ఆచార్య నాగేశ్వరరావు హయాంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం వర్సిటీ ఉద్యోగులు సైతం తమ సొంత శుభకార్యాలను ఇతర ఫంక్షన్‌ హాళ్లలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ కొద్దిరోజుల క్రితం జరిగిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు  వివాహా నికి ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానంతో పాటు, ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరాన్ని కూడా ఇచ్చేశారు. వివాహానికి సంబంధించిన అనేక క్రతువులు ఇక్కడే జరిపారు. వర్సిటీ ఉద్యోగులకే ఇవ్వని ప్లాటినం జూబ్లీ సమవేశ మందిరాన్ని రాజకీయ నాయకులకు ఇవ్వడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

స్నాతకోత్సవ వేదికపై మంత్రి గంటా
ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం ఈ నెల 31న జరగనుంది. సహజంగా స్నాతకోత్సవ వేదికపై రాష్ట్ర గవర్నర్, ముఖ్య అతిధి, వైస్‌ చాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్స్, పాలక మండలి, అకడమిక్‌ సెనేట్‌ సభ్యులు మాత్రమే ఆసీనులవుతారు. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి స్నాతకోత్సవ వేదికపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసీనులు కానున్నారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను ఇప్పటికే ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వాస్తవానికి విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రతి స్నాతకోత్సవం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ, నైపుణ్యం, ప్రత్యేకత కలిగిన వారికి ముఖ్య అతిధిగా ఆహ్వానించి డాక్టరేట్‌ ప్రదానం చేస్తారు. వీరితో పాటు పలువురికి గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. కార్యక్రమానికి చాన్సలర్‌ హోదాలో రాష్ట్ర గవర్నర్‌ హాజరై స్వయంగా డాక్టరేట్లు, మెడల్స్, పట్టాలు అందిస్తారు.  ప్రతి వ్యక్తి జీవితంలో ఇది ఒక మధురానుభూతిగా నిలుస్తుంది. ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సైతం రాజకీయ రంగు పులమడమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

అవును ఇదే మొదటిసారి.. జీవో వచ్చిందిఆ మేరకు గంటా ఆసీనులవుతారు: వీసీ నాగేశ్వరరావు
ఏయూ స్నాతకోత్సవ వేదికపై ఒక మంత్రి ఆసీనులవుతుండటం ఇదే మొదటిసారని వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. వర్సిటీల స్నాతకోత్సవ వేదికల్లో మానవ వనరుల శాఖ మంత్రిని గవర్నర్‌ పక్కన కూర్చోబెట్టాలని  ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసిందని చెప్పారు. ఆ మేరకు పాలకమండలి సమావేశంలో తీర్మానించి 31న జరిగే స్నాతకోత్సవంలో గంటా శ్రీనివాసరావును ప్రత్యేక అతిధిగా గౌరవిస్తామని చెప్పారు. ఇక టీడీపీ ధర్మపోరాట సభ సందర్భంగా వర్సిటీ గోడను ధ్వంసం చేసిన ఘటన గానీ, విద్యుత్‌ చౌర్యం విషయం గానీ తన దృష్టికి రాలేదన్నారు.

మరిన్ని వార్తలు