‘మందు’ చూపు

27 Feb, 2019 08:19 IST|Sakshi

ఎన్నికల కోసం మద్యం సిద్ధం చేసే పనిలో ‘పచ్చ’ నేతలు

‘సార్వత్రిక’ కోడ్‌ రాకముందే చక్క పెట్టేందుకు ప్రయత్నాలు

వ్యాపారులకు భారీగా ఆర్డర్లు

2014 మే నెలలో జిల్లాలో రూ.139.63 కోట్ల మద్యం విక్రయాలు

ఈ ఎన్నికల్లో రూ.400 కోట్ల మద్యం ఏరులైపారుతుందని అంచనా

తూర్పుగోదావరి , మండపేట: ‘సార్వత్రిక’ ఎన్నికల సమరంలో జిల్లాలో  మద్యాన్ని ఏరులై పారించేందుకు అధికార పార్టీ నేతలు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కోడ్‌ కూయకముందే రహస్య ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా స్టాకులు పెట్టే దిశగా లిక్కరు వ్యాపారులతో అంతా చక్కబెట్టేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఒక్క మే నెలలోనే జిల్లాలో రూ.139.63 కోట్ల విక్రయాలు జరుగగా, ప్రస్తుత ఎన్నికల్లో సుమారు రూ.400 కోట్లకు పైగా విక్రయాలు జరగొచ్చుననే భావనలో వ్యాపార వర్గాలు ఉన్నాయి. ఎన్నికల వేడి రాజుకున్న నాటి నుంచి మద్యం కీలకంగా మారుతోంది. ప్రచారం మొదలుకొని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం వరకూ ప్రధాన భూమిక పోషిస్తోంది. ప్రచారంలో పాల్గొన్న మందుబాబులకు రెండు పూటలా  ఓటుకు నోటుతోపాటు బాటిళ్లు అందించడం నేతలు ఆనవాయితీగా మార్చేశారు. గత ఎన్నికల్లో ఒక్క మే నెలలోనే రూ.139.63 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా వీటిలో రూ.33.17 కోట్ల విలువ చేసే 3,55,599 బీరు కేసులు, రూ.106.46 కోట్ల విలువ చేసే 3,26,584 లిక్కర్‌ కేసులను మందుబాబులు ఊదేశారు. అదే ఏడాది ఏప్రిల్‌ నెలలో రూ.70.25 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఎన్నికలు జరిగిన మే నెలలో 90 శాతానికిపైగా విక్రయాలు పెరిగాయి. జూన్‌ నెలలో రూ. 54.6 కోట్లకు పడిపోవడం గమనార్హం.

అంతకు ముందే... : ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తే మద్యం విక్రయాలపై ఆంక్షలు అమలులోకి వస్తాయి. మునుపటి ఏడాది చేసిన స్టాకు కొనుగోళ్లు ప్రమాణికంగా అంతే మొత్తం స్టాకును మాత్రమే డిపోల నుంచి షాపులకు విడుదల చేస్తారు. నిబంధనల మేరకు ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు మద్యం క్రయ, విక్రయాలపై ఆంక్షలు వర్తిస్తాయి. ఆమధ్య కాలంలో ఎంత స్టాకును కొనుగోలు చేశారో కోటా మేరకు ఆయా నెలల్లో అంత స్టాకును మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేసే వీలుంటుంది. మార్చి నెలలో స్టాకు ముందుగానే అయిపోతే విక్రయాలు ఆగిపోయినట్టే. సరుకు లేదని ఏప్రిల్‌ నెల స్టాకును ముందుగా విడుదలకు వీలుండదని అధికారవర్గాలంటున్నాయి.

ఈ నేపథ్యంలో నేతలు, వ్యాపారులు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. 2018 మార్చి నెలలో జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అమలాపురం మద్యం డిపోల ద్వారా రూ. 149. 7 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఏప్రిల్‌ నెలలో రూ. 150.64 కోట్లు, మే నెలలో రూ. 197.65 కోట్లు విక్రయాలు జరిగాయి. మార్చిలో ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఆయా నెలల్లో అంత మేర స్టాకును మాత్రమే విడుదల చేయనున్నారు. నెలాఖరు నాటికి లేదా మార్చి మొదటివారంలో ఎన్నికల కోడ్‌ వెలువడుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల బరిలో తమ అభ్యర్ధిత్వం ఖాయమని భావిస్తున్న నేతలు సార్వత్రిక సమరానికి అస్త్రశస్త్రాలు కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అందులోభాగంగా కోడ్‌ కూయకముందే మద్యం స్టాకులు పెట్టుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆ దిశగా వ్యాపారులతో మద్యం స్టాకులపై సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కోడ్‌ రాక ముందే స్టాకులు రహస్య ప్రదేశాలకు తరలించే దిశగా పావులు కదుపుతున్నారు. ఎలా చూసినా ప్రస్తుతం పెరిగిన మద్యం అమ్మకాలు, ఎన్నికల సీజన్‌లో ఉండే ప్రత్యేక డిమాండ్‌తో దాదాపు రూ.400 కోట్ల విలువైన మద్యం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు.

మరిన్ని వార్తలు