వైద్యం.. ఎండమావి!

15 Mar, 2019 08:58 IST|Sakshi
అనంతపురం జీజీహెచ్‌లో మందుల కోసం బారులు తీరిన ఔట్‌ పేషెంట్‌ రోగులు

ఏ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లినా గంటల తరబడి క్యూలోనే

వెంటాడుతున్న వెంటిలేటర్ల సమస్య

మందుబిళ్ల అందాలంటే గంటల పోరాటం

వేలల్లో బాధితులు.. పదుల సంఖ్యలో కూడా లేని వైద్యులు

జబ్బుకు తగ్గ మందులు కనిపించని దైన్యం

గుంటూరు జిల్లా విశదలకు చెందిన 60 ఏళ్ల వృద్ధునికి ఒంట్లో నలతగా ఉండడంతో దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాడు. మూడు రోజులుగా వెళుతున్నా ఎలాంటి ఉపశమనం కనిపించకపోవడంతో కిందా మీద పడి 20 కిలోమీటర్ల దూరంలోని గుంటూరు పెద్దాస్పత్రి(జీజీహెచ్‌)కి చేరుకున్నాడు. ఔట్‌పేషంట్‌ క్యూలో దాదాపు రెండు గంటలు ఎదురుచూశాకగానీ డాక్టర్‌ దర్శనం కాలేదు. ఆయన కొన్ని మందుల కోసం చీటీ రాసిచ్చారు. దాన్ని పట్టుకుని ఆ పెద్దాయన మళ్లీ క్యూలో నిలబడితే మరో రెండు గంటల తర్వాత ఇతని వంతు వచ్చింది. చీటీ చూసిన సిబ్బంది.. కొన్ని మందులు ఇక్కడ లేవని చెప్పడంతో ఉసూరుమంటూ ఇంటి దారిపట్టాడు.

ఇది ఈ ఒక్క జిల్లా పరిస్థితి మాత్రమే కాదు. రాష్ట్రమంతటా రోగులు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. శరీరాన్ని వేధిస్తోన్న జబ్బు ఓవైపు.. సర్కారీ నిర్లక్ష్యపు జబ్బు మరోవైపు వెరసి.. పేద రోగి ఆవేదనతో నలిగిపోతున్నాడు. డాక్టరు ఎప్పుడొస్తారో, మందుబిళ్లలు దొరుకుతాయో లేదోనన్న అనుమా నాలతో బిక్కుబిక్కుమంటూ పెద్దాస్పత్రికి వెళ్లి నీరసంగా తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. దూరం భారమైనా ప్రభుత్వ వైద్యానికి ఆయువు పట్టు పెద్దాస్పత్రులే అంటూ వచ్చిన సామాన్యులకు క్రమంగా అపనమ్మకం ముసురు కుంటోంది. ఏ పెద్దాస్పత్రి చూసినా ఏమున్నది గర్వకారణం.. అంటూ పేదరోగి విలపిస్తున్న తీరు కలచివేస్తోంది.

ఎంఆర్‌ఐకి రాస్తే గోవిందా
నరాలు, వెన్నుపూస, మెదడు సంబంధిత వ్యాధులకు ఎంఆర్‌ఐ రాస్తుంటారు. ఈ పరిస్థితి వచ్చిందంటే రోగి పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతోంది. చాలా పెద్దాస్పత్రుల్లో ఎంఆర్‌ఐ స్కానర్లు లేవు. పీపీపీ కింద ఇచ్చిన కాంట్రాక్టు గడువు ముగిసింది. కొత్త వారిని నియమించడంలో కమీషన్ల బేరం కుదరకపోవడంతో 8 నెలలుగా ఎంఆర్‌ఐ సేవలు అందడం లేదు. దీంతో రోగులు బయటి ఆస్పత్రులకు పరిగెత్తుతున్నారు. సీటీస్కాన్‌ కూడా ఇదే పరిస్థితి. అంతెందుకూ ఎక్స్‌రే, రక్త పరీక్షలు వంటివి రాసినా గంటల తరబడి వేచి ఉండాల్సిందేనని రోగులు వాపోతున్నారు.

బెడ్డు ఒక్కటే.. పేషెంట్లు ఎందరో..
మన బోధనాస్పత్రుల్లో ఉన్న పడకలు 2011 జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేసినవి. అంటే గడిచిన ఏడేళ్లలో జనాభా ఎంత పెరిగి ఉంటుందో అంచనా వేయచ్చు. రోగులు పెరుగుతున్నా.. పడకలు, డాక్టర్లూ పెరగలేదు. రోగుల తాకిడి తట్టుకోలేక వైద్యులు ఒక పడకనే ఇద్దరు ముగ్గురికి కేటాయిస్తున్నారు. కాకినాడ నగరం నడిబొడ్డున ఉన్న పెద్దాస్పత్రిలో రోగుల తాకిడి పెరగడంతో ఒక్కో బెడ్డులో రోగులను కుక్కుతున్నారు.

వసతులు ఎక్కడ ?
తమిళనాడు, రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలకు వెళితే బోధనాస్పత్రులు కళకళలాడుతూ కనిపిస్తాయి. అంతెందుకూ మన రాష్ట్ర బృందం రాజస్థాన్‌లోని సవాయ్‌ మాన్‌సింగ్‌ వైద్యకళాశాలకు వెళ్లారు. అక్కడ రోజుకు 8 వేల మంది ఔట్‌పేషెంట్లు వస్తారు. ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా వైద్యసేవలు అందుతాయి. మన మొత్తం ఆస్పత్రులకు 10 వేల మంది వస్తేనే సేవలందించలేక పోతున్నారు. గత నాలుగున్నరేళ్లలో పెద్దాస్పత్రుల్లోనే మౌలిక వసతులు కల్పించలేకపోయారు. ఎంఆర్‌ఐ సేవలు లేవు, సీటీస్కాన్‌ దొరకదు.. ఇలా ఒకటేంటి ఏ సేవలూ ఇక్కడ లభించవు.  

సర్కారు ఆస్పత్రులకొచ్చే వాళ్లంతా సామాన్య రోగులే..
జబ్బుచేస్తే రూ. 100  ఖర్చు చేయలేని అభాగ్యులే.. ఉచితంగా వైద్యమందుతుందని గంపెడాశతో వెళితే వెక్కిరిస్తున్న నిర్లక్ష్యం..
 డాక్టరు నాడిపట్టి చూశారంటే ఆరోజు రోగి అదృష్టమే.. జబ్బు మూలాలు యటపడేందుకు నిర్ధారణ పరీక్షలు జరిగాయంటే ఆరోజు సునామీ నుంచి బయటపడ్డట్టే.. ఇదీ మన ధర్మాస్పత్రుల్లో  నిత్యం జరుగుతున్న క్రతువు

వెంటాడుతున్న వెంటిలేటర్ల సమస్య
రాష్ట్రంలో జనాభా పెరిగేకొద్దీ వెంటిలేటర్లూ పెరగాలి. కానీ ప్రస్తుతం ఉన్న రోగులకు వెంటిలేటర్ల సంఖ్యకు పొంతన లేదు. రోజుకు ఒక్కో వెంటిలేటర్‌కు 8 మంది పైనే క్యూలో ఉన్నారు. అంటే రెండున్నర గంటలు కూడా వెంటిలేటర్‌ చికిత్స దక్కదు. దీంతో రోగులు ప్రాణభయంతో అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళుతున్నారు.

నిధులు మళ్లింపు
రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులకు 2018–19 సంవత్సరానికి రూ. 250 కోట్లు కేటాయిస్తే రూ.100 కోట్లు కూడా వ్యయం చెయ్యలేదు. ఇంకా రూ.150 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. మందులకు కేటాయించిన నిధులు పెన్షన్లకు మళ్లించారు. దీంతో ఆస్పత్రుల్లో మందులు ఖాళీ అయ్యాయి. చాలా చోట్ల పారాసెటమాల్‌ బిళ్లలకూ దిక్కులేదు. వివిధ ఆస్పత్రుల నుంచి మందులు లేవని లేఖలిచ్చినా స్పందించడం లేదు.

ఓపీ సేవలకే దిక్కులేదు
ఒక్కో బోధనాస్పత్రికి రోజూ 2 వేల మంది పైనే ఔట్‌పేషెంటు సేవలకు రోగులు వస్తుంటే కనీసం పదుల సంఖ్యలో కూడా రోగాలను చూసే వారు లేరు. చాలా చోట్ల వారానికి మూడు రోజుల ఓపీ ఉంటుంది. ఆ మూడు రోజుల్లో ఓపీ దొరక్కపోతే దురదృష్టం వెంటాడినట్టే. స్పెషలిస్టులు చాలా తక్కువ మంది ఉండటంతో చాలా జబ్బులకు ఒకే డాక్టరు చూసి ఏదో మందు రాసిస్తున్నారని కర్నూలు పెద్దాస్పత్రిలో ఒక రోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ఏడు గంటలకే డాక్టరు రూము ముందు వచ్చి కూర్చున్నా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఓపీ చూసిన మహానుభావులు ఎవరూ కనిపించలేదని వాపోయారు. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు అడగడం లేదు. ‘జ్వరమొస్తే కాసింత చెయ్యిపట్టుకుని చూసి, నాలుగు మందులడుగుతున్నాం.. దీనికే ఒక రోజంతా నిలబడాలా సారూ’.. ఇది కాకినాడ సర్వజనాస్పత్రిలో ఓ బాధితుడి నిస్సహాయత. ‘నేను ఆస్తమా రోగిని. ఇప్పటికే రెండున్నర గంటలైంది. మందుల చిట్టీ పట్టుకుని లైన్లో ఉదయం 9 గంటలకు నిలబడ్డాను. మధ్యాహ్నం పన్నెండైంది సారూ’ అంటూ అనంతపురం పెద్దాస్పత్రిలో మరో రోగి వేడుకోలు. ఏ పెద్దాస్పత్రిలో చూసినా సమస్యలే.

గంటలకొద్దీ వేచి ఉండాల్సిందే
ఓపీ తీసుకునేందుకు గంట సమయమైతే.. మందులు తీసుకునేందుకు గంటలకొద్దీ వేచి ఉండాల్సిందే. మా అమ్మ తరచూ అనారోగ్యం బారిన పడుతోంది. ఆస్పత్రికి వచ్చినప్పుడల్లా ఇబ్బందులు తప్పవు. క్యూలో గంటల తరబడి నిల్చోలేక మందులు తీసుకోకుండానే వెనక్కు తిరిగి వచ్చిన సందర్భాలున్నాయి. ఆస్పత్రిలో రెండే కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల ఊపిరాడక అల్లాడిపోతున్నాం. కనీసం నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేయాలి.
– ఉమేష్, ఓబుళదేవ నగర్, అనంతపురం

 ఇక్కడ మౌలిక వసతుల్లేవు
అమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చాను. ఇక్కడ మౌలిక సదుపాయాల్లేవు. మహిళలు బాత్రూమ్‌కి వెళ్లాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. డాక్టర్‌ రాసిన మందులన్నీ ఇవ్వడం లేదు. స్టాక్‌ లేదని చెబుతున్నారు. పెద్ద డాక్టర్లు రావడం లేదు. పేరుకే పెద్దాస్పత్రి.. ఇక్కడ పేదలకు వైద్యం అందుబాటులో ఉండదు
– సత్య, రేసపువానిపాలెం, విశాఖజిల్లా  

మరిన్ని వార్తలు