ఓటుకు మూడువేలు అంటున్న టీడీపీ

11 Apr, 2019 11:59 IST|Sakshi

సాక్షి, కృష్ణా :  రాజకీయాలకు రాజ ధానిగా పేరున్న కృష్ణా జిల్లాలో ప్రజాస్వామ్యం చిన్నబోయే రీతిలో ఓట్ల కొనుగోలుకు అధికారపార్టీ సిద్ధమైంది. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్లుగా ఏకంగా వేలం పద్ధతిన ఓట్లు కొనుగోలుకు తెగపడుతున్నారు. చివరకు ఒక్కో ఓటుకు రూ.3000 చొప్పున చెల్లించి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారు.

ప్రత్యేక దళాల నిశిత పర్యవేక్షణలో టీడీపీ నాయకులు పంపిణీ కొనసాగిస్తున్నారు. పోలింగ్‌కు చివరి రోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా టీడీపీ అభ్యర్థులు రూ. కోట్లుకుమ్మరించారు. నియోజకవర్గంలోని ఓట్లలో 60 నుంచి 70 శాతం కొనుగోలు చేయాలనేది లక్ష్యంగా డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం.

వ్యూహాలు మార్చి డబ్బు పంపిణీ.. 
జిల్లా వ్యాప్తంగా పంపకాల పర్వానికి తెరలేపిన టీడీపీ అభ్యర్థులు మద్యాన్ని సైతం ఏరులై పారిస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓట్లను పెంచేలా టీడీపీ పార్టీ నాయకులు గ్రామస్థాయి నాయకులతో ఒప్పందాలు చేసుకుని రూ. లక్షల్లో డబ్బు అందజేశారు. మాజీ పోలీసు ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ డబ్బును గ్రామీణ ప్రాంతాలకు చేర్చారు. డబ్బు పెద్ద మొత్తంలో ఉంటే అధికారులకు పట్టుబడితే కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుందని బృందాలు ఏర్పడి రూ.49 వేల చొప్పున తీసుకెళ్లి ఓటర్లకు పంపిణీ చేయడం కనిపించింది. డబ్బు పంపిణీ విచ్చలవిడిగా జరుగుతున్నా అడ్డుకోటానికి అధికారులకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం గమనార్హం.

  • ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎన్ని కోట్లు వెచ్చించైనా ఓట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ అభ్యర్థులు ఒక్కో నియోజకవర్గంలో రూ.50 కోట్లపైగానే ఖర్చు చేసినట్లు  సమాచారం. 
  • విజయవాడ ఎంపీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 లక్షల ఓట్లు కొనుగోలుకు సిద్ధమయ్యారనేది సమాచారం. ఒక్కో ఓటుకు సగటున రూ.1000 నుంచి రూ.2000 చొప్పున చెల్లించినట్లు తెలిసింది. 
  • నగారానికి ఆనుకునే ఉన్న గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఓటుకు రూ. 2వేలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి కంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముందంజలో ఉండటంతో ఓటర్లకు ప్రలోభాలకు టీడీపీ నాయకులు గురిచేస్తున్నారు.
  • విజయవాడ లోక్‌సభకు పోటీ చేసే ఓ అభ్యర్థి వర్గాల వారీగా సమావేశాలు పెట్టి వారికి అవసరమైన వనరులు సమకూర్చారు. తన నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులకు భారీగా వనరులు సమకూర్చారు.
  • గుడివాడలో ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో టీడీపీ భారీ ఎత్తున ప్రలోభాలకు తెరతీసింది. ఓటుకు ఎంత ధరైనా చెల్లించడానికి వెనుకాడటం లేదు. ఇప్పటి వరకు ఓటుకు రూ.3 వేలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.  
మరిన్ని వార్తలు