అంతా మా ఇష్టం!

31 Oct, 2018 13:46 IST|Sakshi
ఆటోనగర్‌లో జరుగుతున్న కార్యాలయ కాంక్రీట్‌ పనులు

శరవేగంగా టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణ పనులు

అంతా చినబాబు ఆధ్వర్యంలోనే..

అనుమతి లేదంటున్న ఐలా అధికారులు

అయినా కన్నెత్తి చూడని వైనం

ఆటోనగర్‌(విజయవాడ ఈస్ట్‌): పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు 100 గజాల స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే వంద రకాల అనుమతులు తీసుకోవాల్సి పరిస్థితి. ఏమాత్రం తేడా వచ్చినా అధికారులు నిర్ధాక్షిణ్యంగా ఆ ఇంటిని కూల్చేస్తారు. అయితే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన జిల్లా కార్యాలయానికి ఏ విధమైన అనుమతులు లేకుండా.. అడ్డగోలుగా నిర్మాణం చేపడుతున్నా.. అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా అధికారులు చేయకపోవడం గమనార్హం.

కారుచౌకగా..
నగరంలో అత్యంత ఖరీదైన ఆటోనగర్‌లో సుమారు రూ. 29 కోట్ల విలువచేసే దాదాపు ఎకరం స్థలాన్ని కారుచౌకగా కేవలం నెలకి రూ.1000 అద్దె చెల్లించే టీడీపీ పార్టీ కార్యాలయానికి తీసుకోవడమే కాక.. అనుమతులతో నిమిత్తం లేకుండా నిర్మాణ పనులు చకచకా నిర్వహిస్తున్నారు

కనీసం అర్జీ కూడా లేకుండా..
ఆటోనగర్‌లో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ముఖ్యమంత్రి తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్‌ విజయదశమి రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి పార్టీకార్యాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పనులు ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పగించారు. స్థానిక టీడీపీ నాయకులు దగ్గరుండి పనులు చక్కబెడుతున్నారు. ప్రస్తుతం భవన నిర్మాణానికి కావాల్సిన పిల్లర్లు వేసేందుకుగాను కాంక్రీట్‌ పనులను చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఐలా అధికారులు మాత్రం కనీసం పరిశీలన కూడా చేయడం లేదు. తమకు ఇంత వరకు అర్జీపెట్టలేదని, నిర్మాణపనుల విషయాన్ని తమ దృష్టికి తీసుకురాలేదని చెబుతున్నా.. నిర్మాణాన్ని పరిశీలించి అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు.

అంతా చినబాబు చూసుకుంటారు..
అయితే ఈ నిర్మాణ విషయం అంతా చినబాబు లోకేష్‌ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుగబోయే ఎన్నికలకు ప్రచార సన్నాహాలన్ని ఇక్కడ నుంచే నిర్వహించాలంటూ చినబాబు ఆదేశించినట్లు సమాచారం. దీంతో రెండు మూడు నెలల్లోనే భవన నిర్మాణం పూర్తి చేయాలని..

ఈ పరిస్థితుల్లో అనుమతులంటూ కార్పొరేషన్, ఐలాతో పాటు ఇతర శాఖల చుట్టూ తిరుగుతూ కూర్చుంటే సమయం సరిపోదని.. అంతా చినబాబు చూసుకుంటారు.. మన పని మనం చేసుకుపోదాం అన్నట్లు టీడీపీ నాయకులు పనులు నిర్వహించేస్తున్నారు. దీంతో అధికారుల సైతం అడ్డుకునేందుకు వెనుకాడుతున్నారు. కాగా టీడీపీ నేతల తీరును చూసి పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. అధికారం అడ్డం పెట్టుకొని అనధికారికంగా నిర్మాణం చేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఎలాంటి దరఖాస్తు రాలేదు..
టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణ విషయం మా దృష్టికి రాలేదు. భవన నిర్మాణానికి సంబంధించి మాకు ఎలాంటి దరఖాస్తు అందలేదు. కనీసం ఆన్‌లైన్‌లో కూడా నమోదు కాలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.– విజయకుమారి, ఐలా కమిషనర్‌

మరిన్ని వార్తలు