బేరం మొదలైంది..

15 Jun, 2014 02:10 IST|Sakshi
బేరం మొదలైంది..

 సాక్షి, ఒంగోలు : అందరూ ఊహించినట్లే టీడీపీ నేతల దందా మొదలైంది. పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయ మార్గాల కోసం తెలుగు తమ్ముళ్లు బిజీ అయ్యారు. జిల్లాస్థాయి నేతల కనుసన్నల్లో మెలిగే చోటామోటా నేతలు సైతం రేషన్ డీలర్‌షిప్‌లు, ఇతర పోస్టులకు బహిరంగంగా ‘బేరం’ పెడుతున్నారు. రూ.లక్షలాది సొమ్మును అతితక్కువ కాలంలో ఆర్జించేందుకు టీడీపీ ద్వితీయశ్రేణి నేతలు పన్నిన పన్నాగం.. జిల్లాలో పలుచోట్ల రక్తపాతానికి దారితీస్తోంది.
 
తమ లాభార్జనకు అడ్డుగా ఉన్న వారిపై దాడులుకు తెగబడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న వరుస దాడుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రగాయాలపాలవుతున్నారు. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం పెదఅలవలపాడులో గురువారం జరిగిన దాడి ఒకరి మృతికి దారితీసింది. ఇదేదాడిలో మరోముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడగా ఒంగోలు రిమ్స్‌లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. టీడీపీ నేతల దుందుడుకు చర్యలపై అన్నివర్గాలు  మండిపడు తున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చీరాగానే ఆ పార్టీ నేతలు ధనార్జనకు వెంపర్లాడటంతోనే గ్రామాల్లో గొడవలు పెరుగుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దాడులపై పోలీసు అధికారులు సైతం పెద్దగా స్పందించకపోవడంపైనా  విమర్శలు గుప్పుమంటున్నాయి.
 
 రూ. లక్షల్లో బేరం
 సార్వత్రిక ఎన్నికల్లో ప్రలోభాలకు భారీగా ఖర్చుపెట్టిన మొత్తాన్ని అతితక్కువ కాలంలో వసూలు చేసుకోవాలనే లక్ష్యంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నట్లు ఆ పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. ఇందులో భాగంగానే రేషన్‌దుకాణాలు, కాంట్రాక్ట్ పోస్టులు, అంగన్‌వాడీలు, ఉపాధిహామీ పనులపై కన్నేసిన సంగతి బహిర్గతమైంది. పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు పెట్టుకుని మరీ ఆయా అంశాల్లో లొసుగులు గుర్తించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,202 రేషన్‌దుకాణాలుండగా వాటిల్లో 100 చోట్ల ఇన్‌చార్జిలే డీలర్‌షిప్ డీడీలు చెల్లిస్తూ నడిపిస్తున్నారు.
 
 జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న నాలుగు నియోజకవర్గాలను మినహాయించి వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట్ల రేషన్‌దుకాణాలపై కన్నేశారు. గ్రామంలో తమ పార్టీకి అనుకూలంగా ఉన్న పెద్ద మోతుబరిని గుర్తించి అతని వద్ద రూ. 2 లక్షల నుంచి రూ.4 లక్షలు దండుకుని రేషన్‌డీలర్‌షిప్పు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కాంట్రాక్ట్ పోస్టులకు సైతం బేరంపెడుతున్నట్లు.. గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలను విధుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నట్లు జిల్లా అధికారులకు ఫిర్యాదులొస్తున్నాయి.
 
తమ నియోజకవర్గంలో టీడీపీ నేతలు అనవసరంగా జోక్యం చేసుకుని రేషన్‌డీలర్‌లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, సాఫీగా కొనసాగే డీలర్‌షిప్పులను రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ ఇప్పటికే సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ కలెక్టర్, ఆర్డీవోలను కలిసి ఫిర్యాదు చేశారు. ఇటువంటి వ్యవహారాలపై టీడీపీ అధిష్టానం స్పందించి పార్టీ శ్రేణులను కట్టడిచేయకుంటే ఆందోళనలకు సిద్ధపడతామని ప్రజాసంఘాల నేతలు, వ్యాపార, ఉద్యోగవర్గాలతో పాటు గ్రామీణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు