చంద్రబాబువి హైలెవెల్ డ్రామాలు: వాసిరెడ్డి పద్మ

10 Aug, 2013 13:28 IST|Sakshi
చంద్రబాబువి హైలెవెల్ డ్రామాలు: వాసిరెడ్డి పద్మ

రాష్ట్ర విభజనపై ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాయడం ద్వారా కొత్త డ్రామాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తెరతీశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ  ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రకటన చేసి 10 రోజుల తర్వాత బాబు స్పందించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.



ప్రధానికి లేఖ రాసి చంద్రబాబునాయుడు అప్పుడే మెలకువ వచ్చిన వ్యక్తిలా వ్యవహారిస్తున్నారని ఆమె ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలకు భయపడి చంద్రబాబు ఆ లేఖ రాశారన్నారు. రంగులు మార్చడంలో చంద్రబాబు ఊసరవెల్లిని మించిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు విజన్ ట్వంటీ-20 కాదు... డివిజన్ 420 అని ఆమె అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజల్లో బాబు ఓ విరోధిలా మారిపోయారని ఆమె పేర్కొన్నారు.


సీడబ్ల్యూసీ ప్రకటన కంటే ముందే చంద్రబాబుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటవుతుందన్న విషయం తెలుసని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ఓ విధంగా వెన్నుపోటు పోడిచారన్నారు. తెలంగాణపై క్రెడిట్ పొందటంలో భాగంగానే చంద్రబాబు పలుమార్లు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని పద్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సీట్లు, ఓట్లు కోసమే ప్రణబ్ కమిటీకి గతంలో బాబు తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చారన్నారు. ఆ లేఖను ఆమె ఓ బ్లాంక్ చెక్కుగా ఆభివర్ణించారు.

మరిన్ని వార్తలు