హోటల్ కూలిన ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరపాలి:చంద్రబాబు

8 Jul, 2013 15:39 IST|Sakshi

 హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సోమవారం సికింద్రాబాద్లో సిటీ లైట్ హోటల్‌ ఘటనా స్థలిని పరిశీలించారు. ప్రమాదంపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు.

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే భవనం కూలి పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆయన విమర్శించారు. భవనం కూలిన వెంటనే అధికారులు స్పందించిన తీరుపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పాటు టీఆర్ఎస్ నేత కేశవరావు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

కాగా సిటీలైట్ హోటల్‌ కుప్పకూలిన ఘటనలో 13 మంది మృతి చెందారు. మృతుల్ని అధికారులు గుర్తించారు. మృతుల్లో నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన రమేష్, సికింద్రాబాద్ పాన్‌బజార్‌కు చెందిన ఎం.రమేష్, ముస్తఫాలతో పాటు ఒడిషాకు చెందిన సంతోష్‌, మురళి, రాజు, మనోజ్‌లు  ఉన్నారు.

అలాగే  సిటీ లైట్స్‌ ఓనర్ కుమారుడు, సయ్యద్‌ మజ్తాబా, బన్సిలాల్‌పేటకు చెందిన దుర్గయ్య, బోలక్‌పూర్‌కు చెందిన బాలకృష్ణ కూడా ఈ ప్రమాదంలో మరణించారు.   క్షతగాత్రులు ప్రదీప్‌రావు, నరేందర్, సాయిలు, ప్రతిమ, ఇ.ప్రభాకర్, ఎం.చిరంజీ వి, ఎం.సురేష్, నరేష్, కె.రామయ్య, బి.రమేష్, రాహుల్‌సింగ్, రామాంజనేయులు, సుధీర్, బాషాగా గుర్తించారు.

మరిన్ని వార్తలు