విభిన్న ప్రేమ

6 Oct, 2017 12:52 IST|Sakshi

నెల్లూరు రూరల్‌: రాష్ట్రంలో 2,450 మందికి మోటరైజ్డ్‌ త్రీవీలర్లను పంపిణీ చేయనున్నారు. ఈ లెక్కన జిల్లాకు 188 యూనిట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాటరీ సాయంతో నడిచే వీల్‌ చైర్స్‌ రాష్ట్ర వ్యాప్తంగా 175 మందికి ఇవ్వనున్నారు. వీటిలో జిల్లాకు సుమారు 13 యూనిట్లు రావచ్చని అధికారుల అంచనా. అర్హులైన వారు ఈ నెల 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 23వ తేదీ లోపల దరఖాస్తు కాపీలను విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారుల ఎంపికలో సవాలక్ష నిబంధనలు పెట్టారు.

80 శాతం వికలత్వం ఉంటేనే
మోటారైజ్డ్‌ త్రీ వీలర్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే శారీరక వికలత్వం కనీసం 80 శాతంతో పాటు 18–40 ఏళ్లలోపు వయసు దివ్యాంగులే అర్హులు. అలాగే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌(పీజీ) చదువుతుండాలి. లేదంటే పదోతరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధి విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. పీజీ విద్యార్హత సర్టిఫికెట్‌తో పాటు డ్రెవింగ్‌ లైసెన్స్, స్వయం ఉపాధి యూనిట్‌ ఫొటో జత చేయాల్సి ఉంది. బ్యాటరీ వీల్‌ చైర్స్‌కు దరఖాస్తు చేసుకునేవారు కనీసం పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి. వీటిలో మోటారైజ్డ్‌ త్రీ వీలర్‌ వెహికల్స్‌కు నిబంధనలు పెట్టారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

15 వేల మంది అర్హులు
జిల్లాలో మొత్తం సుమారు 50 వేల మంది శారీరక వికలత్వం కల్గిన దివ్యాంగులున్నారు. వీరిలో 15 వేల మంది 80 శాతం పైగా వికలత్వం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరిలో ఎంతమంది పీజీ చేసి ఉంటారనేది ప్రశ్న. దీనికి తోడు స్వయం ఉపాధి యూనిట్లు నడిపే వారు కూడా చాలా అరుదుగా ఉన్నారని సమాచారం. ఈ పరిస్థితుల్లో నిబంధనలు పెట్టడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్న తలెత్తుతోంది. మరో వైపు జిల్లాకు కేటాయించిన యూనిట్లు ఏమాత్రం సరిపోవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేల సంఖ్యలో అభ్యుర్థులుంటే కేవలం 200 లోపు యూనిట్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

 డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధన దారుణం
సాధారణ పురుషులు, మహిళలు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడటమే చాలా కష్టం. అలాంటిది దివ్యాంగులు వాహనం పొందేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ను తప్పని సరి చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వికలాంగులకు ఇన్‌వ్యాలిడిటీ వెహికిల్‌ కింద ఎల్‌ఎల్‌ఆర్‌ను అందించే వీలుంది. అయితే దివ్యాంగులు నడపకలిగిన వాహనాన్ని కొనుగోలు చేసిన తర్వాతగానీ ఎల్‌ఎల్‌ఆర్‌ను జారీ చేయరు. అలాంటప్పుడు ప్రభుత్వం డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనను ఎలా అమలు చేస్తోందని దివ్యాంగులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు