అన్న క్యాంటీన్లలోనూ కమీషన్ల ఫుడ్డు

17 Jul, 2018 03:16 IST|Sakshi

     చదరపు అడుగు నిర్మాణానికి రూ.4,800

     750 చదరపు అడుగుల్లో ఒక్కో క్యాంటీన్‌కు రూ.36 లక్షలు 

     162 క్యాంటీన్ల ఒప్పందం విలువ రూ.58.32 కోట్లు

      తెలంగాణలో ‘అన్నపూర్ణ’ నిర్మాణ వ్యయం రూ.4.60 లక్షలే

     హంగూ.. ఆర్భాటాలకే టీడీపీ సర్కార్‌ పెద్దపీట

     మెటీరియల్‌ ధరల్లోనూ భారీ వ్యత్యాసం

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలను కళ్లుతిరిగే అంచనాలతో చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పేదలకు తక్కువ ధరకు ఆహారం అందించే అన్న క్యాంటీన్ల నిర్మాణంలోనూ అదే రీతిలో చెలరేగిపోయింది. పొరుగున ఉన్న తెలంగాణలో మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఇదే తరహా అన్నపూర్ణ క్యాంటీన్ల కోసం అక్కడి సర్కార్‌ వెచ్చించిన మొత్తానికి.. ఇక్కడ చంద్రబాబు సర్కార్‌ చెల్లిస్తున్న దానికీ మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. స్థలం ఖర్చుతో కలిపి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తమ అపార్ట్‌మెంట్లను చదరపు అడుగును రూ.3,500–రూ.4,500లకు అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతుంటే.. ఏపీ సర్కార్‌ మాత్రం అన్న క్యాంటీన్లకు ఉచితంగా స్థలమిచ్చి కేవలం నిర్మాణానికే రూ.4,800 చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుబారా చేస్తోంది.

అక్కడ రూ.4.60లక్షలు.. ఇక్కడ రూ.36లక్షలు
మూడేళ్ల క్రితం తెలంగాణలో అక్కడి సర్కార్‌ పేదలకు తక్కువ మొత్తానికే ఆహారం అందించాలన్న ఉద్దేశ్యంతో అన్నపూర్ణ క్యాంటీన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం ఒక్కోదానికి రూ.4.60లక్షలను మాత్రమే వెచ్చించి అవసరమైన విస్తీర్ణంలోనే రేకుల షెడ్లను నిర్మించింది. కానీ, చంద్రబాబు సర్కార్‌ మాత్రం ఒక్కో క్యాంటీన్‌ నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.4,800 చొప్పున 750 చ.అడుగులకు రూ.36లక్షలను చెల్లించి బడా రెస్టారెంట్లను తలపించేలా నిర్మింపజేసింది. అలాగే, తెలంగాణ సర్కార్‌ ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా వీటిని నిర్మించి ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తుంటే ఇక్కడి తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం షోకులకు పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తళుకుబెళుకులకే ప్రాధాన్యత 
ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 162 క్యాంటీన్లను నిర్మించేందుకు చంద్రబాబు సర్కార్‌ రూ.58.32కోట్లకు ఓ ప్రముఖ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వీటిలో 134 క్యాంటీన్లను ఆ సంస్థ సబ్‌కాంట్రాక్టుకు ఇచ్చి మిగిలిన వాటిని తనే నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న రాష్ట్రంలోని 25 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో మొత్తం 60 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. రెండో దశలో మిగిలిన వాటిని నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటి నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రచారానికి చేస్తున్న ఆర్భాటం.. దుబారా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.

ఇదిలా ఉంటే.. కేఎఫ్‌సీ, మెక్‌డోనాల్డ్‌ వంటి అంతర్జాయ రెస్టారెంట్లు వాడిన మెటీరియల్‌ను అన్న క్యాంటిన్ల నిర్మాణంలో వాడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పగా చెబుతున్నప్పటికీ వాస్తవానికి వాటి ధరల్లో భారీ వ్యత్యాసం ఉందని నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అన్న క్యాంటీన్లలో బ్రిక్‌వర్క్‌ (ఇటుక పనికి) కంటే గ్లాస్, అల్యూమినియం ప్యానెల్స్, ఫ్లోర్‌ టైల్స్, ఫాల్స్‌ సీలింగ్, ఫ్లోరింగ్‌కు ఎక్కువ నిధులు ఉపయోగించారు. వీటివల్ల అన్న క్యాంటీన్లు కమర్షియల్‌ కాంప్లెక్సుల్లోని రెస్టారెంట్లను తలపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఈ క్యాంటీన్ల చుట్టూ ప్రహరీగోడ నిర్మాణ బాధ్యతలను ఆయా మున్సిపాల్టీలకు ప్రభుత్వం అప్పగించి నిర్మాణ సంస్థలకు వెసులుబాటును కల్పించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు