పోలీసుల తిరకేసు

26 Aug, 2018 11:57 IST|Sakshi
హిందూపురంలో నవీన్‌ నిశ్చల్‌ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ( ఇన్‌సెట్లో ) పట్టణంలో రహస్య సర్వేలో భాగంగా వైఎస్సార్‌సీపీ సమాచారం సేకరిస్తున్నారని ఆధారాలను చూపుతున్న నవీన్‌

ప్రతిపక్ష నేతల వివరాలు సేకరించిన యువకులు

వారిని పోలీసులకు పట్టించిన వైఎస్సార్‌సీపీ నేతలు

యువకులను కిడ్నాప్‌ చేశారంటూ నేతలపైనే కేసులు

నవీన్‌నిశ్చల్‌ ఇంటిలో పోలీసుల ఆకస్మిక సోదాలు

రోజంతా పోలీసుల హడావుడి

హిందూపురంలో అధికార టీడీపీని ఓటమి భయం వెంటాడుతోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానికంగా ఉండకపోవడం, ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోవడంతో ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఆకర్షితులవుతుండటం తెలిసిందే. ఇదే సమయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ ప్రజల్లో చెరగని అభిమానం కూడగట్టుకోవడం మింగుడుపడని టీడీపీ.. రహస్య సర్వేలతో ప్రజల నాడి తెలుసుకునేందుకు సిద్ధమైంది. పనిలో పనిగా వైఎస్సార్‌సీపీ ఓటు బ్యాంకు లక్ష్యంగా వివరాల సేకరణకు పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని మోహరించింది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు చర్యలు తీసుకోవాలని కోరితే.. పోలీసుల సాయంతో అధికార పార్టీ ఎదురుదాడికి సిద్ధమైంది. ఏకంగా నవీన్‌ ఇంట్లో సోదాలు చేపట్టి.. అరెస్టుకు యత్నించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

హిందూపురం అర్బన్‌: టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందా? ప్రతిపక్ష నేతలను బెదిరించి తమ దారికి తెచ్చుకోవాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారా? ఇందుకోసం పోలీసులను పావుగా వాడుకుంటున్నారా? పురంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది. పట్టణంలో రెండు రోజులుగా జరుగుతున్న వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. స్పార్క్‌ సోషియో పొలిటికల్‌ అనాలసిస్‌ అండ్‌ రిఫ్రెష్‌ సెంటర్‌ పేరిట నెల్లూరు, కర్నూలుకు చెందిన యువకులు నాలుగు రోజులుగా రహస్య సర్వే నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి కీలకమైన నేతల వివరాలను సేకరించారు. ఈక్రమంలో శుక్రవారం రాత్రి కొంతమంది యువకులు పట్టుబడగా స్థానికులు వారిని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం వారిని  వన్‌టౌన్‌ సీఐ చిన్నగోవిందుకు అప్పగించారు.

ఫిర్యాదు చేసిన వారిపైనే కేసు నమోదు
యువకులు తమ వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా సేకరించారని వారిపై సైబర్‌ చట్టాల ప్రకారం కేసు నమోదు చేయాలని శుక్రవారం రాత్రే వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు యువకులపై కేసు నమోదు చేయలేదు. శనివారం ఉదయం యువకులను కిడ్నాప్‌ చేశారని, వారిని దూషించడంతోపాటు దాడి చేశారని పలు సెక్షన్ల కింద నవీన్‌నిశ్చల్‌తోపాటు మరో11 మందిపై కేసు నమోదు చేయడం గమనార్హం.

ప్రతిపక్ష నేతలను లోబర్చుకునేందుకు కుయుక్తులు : నవీన్‌నిశ్చల్‌
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖరారైందని, అందుకే  అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ పార్టీ నాయకులు, బూత్‌ కన్వీనర్లను నయానోభయానో లోబర్చుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలను ఎంచుకుని అధికార పార్టీ నాయకులు స్పార్క్‌ సోషియో పొలిటికల్‌ అనాలసిన్‌ అండ్‌ రిఫ్రెష్‌ సెంటర్‌ పేరిట రహస్య సర్వేలు చేయిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా కొంతమంది యువకులు తమ పార్టీ నేతల వ్యక్తిగత వివరాలు, వారు దేనికిలొంగుతారో సేకరిస్తున్నారన్నారు. పట్టణంలోని తమ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లకు ఫోన్‌ ద్వారా నేరుగా బేరసారాలు, భయపెట్టడాలు జరిగాయని ఆరోపించారు. సర్వే చేస్తూ పట్టుబడిన యువకులు టీడీపీ నాయకులు తమతో సర్వే చేయిస్తున్నట్లు తెలిపారన్నారు.

దాదాపు 60 మంది యువకులు 4 రోజులుగా పట్టణంలో సర్వే చేస్తున్నా పోలీసులు తెలియదంటే ఎలా అని ప్రశ్నించారు. యువలకుపై తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏకంగా తమపైనే కిడ్నాప్, దాడి తదితర కేసులు పెట్టడం దారుణమన్నారు. కేవలం తనను బలహీనపర్చడానికే ఎమ్మెల్యే బాలకృష్ణ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యువకులపై వెంటనే కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో తమ పార్టీ తరఫున పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.  వైఎస్సార్‌సీపీ యూత్‌  రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, ఏ,బి,బ్లాక్‌ కన్వీనర్లు ఈర్షద్, మల్లికార్జున, మైనార్టీ విభాగం జిల్లా నాయకులు ఫజులూరెహెమాన్, ప్లోర్‌ లీడర్‌ శివ,  కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, జబీవుల్లా, రజనీ, మహిళా కన్వీనర్‌ నాగమణి, ఎస్సీ, బిసీ సెల్‌ నేతలు శ్రీన, రాము, చంద్రశేఖర్, నాయకులు బాలాజీ, ఆజుబా, మన్సూర్, దౌలా, శివశంకర్‌రెడ్డి, నరసింహరెడ్డి పాల్గొన్నారు.

సోదాల పేరుతో భయోత్పాతం..
డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు,  ప్రత్యేక పోలీసులు శనివారం మ«ధ్యాహ్నం నవీన్‌నిశ్చల్‌ ఇంటిలో సోదాలు నిర్వహించారు. అటుగా వెళ్తున్న వారిని ఆపి వివరాలు సేకరించారు. నవీన్‌నిశ్చల్‌ ఇంటిలో లేకపోవడంతో కుటుంబసభ్యులతో అడిగి తెలుసుకున్నారు.  సీసీ కెమెరాలలో దృశ్యాలు కూడా పరిశీలించారు. నవీన్‌నిశ్చల్, ఇతర నాయకులు లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. భారీగా పోలీసులు తరలిరావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనను వైఎస్సార్‌సీపీ నాయకులు శనివారం ఉదయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాన్న డీఎస్పీ మధ్యాహ్నానికల్లా వైఎస్సార్‌ సీపీ నేతలను అరెస్టు చేసేందుకు రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు