మిత్రమా... వెన్నుపోటే..!

4 Feb, 2018 09:10 IST|Sakshi

మిత్ర  ధర్మం పాటిస్తూ మా వాళ్లంతా మౌనం వహిస్తున్నారు. బీజేపీ చర్యలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ బీజేపీ మాత్రం మిత్రధర్మం పాటించడం లేదు. ఇది చాలా బాధాకరం.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మాటలు వింటుంటే నిజమే... సత్య హరిశ్చంద్రుడికి నారావారే వారసుడే మోనన్న రీతిలో నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ జిల్లా వాసులు మాత్రం ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే జిల్లాలో ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. బీజేపీకి 9 డివిజన్లను పొత్తులో భాగం గా ప్రకటించడంతో సంబంధిత వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టింది. వారికి మద్దతు ఇవ్వాల్సిన టీడీపీ లోపాయి కారీగా రెబెల్స్‌ను నిలబెట్టి బీజేపీ అభ్యర్థులను ఓడించింది. అంతేకాదు కేంద్ర పథకాలకు ‘పచ్చ’ రంగేసి తమవిగా ప్రచారం చేసుకుంటోంది. అడుగడుగునా అణగదొక్కి మిత్రులను అవమానాలపాల్జేస్తుంది. అదెలా అంటే...

సాక్షి ప్రతినిధి, కాకినాడ: అడుగడుగునా తూట్లు పొడుస్తూ మిత్రపక్ష ధర్మానికి ద్రోహం చేస్తున్న టీడీపీ వైఖరిపై జిల్లా బీజేపీ క్యాడర్‌ కన్నెర్ర చేస్తోంది. బీజేపీని ఎదగనివ్వకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. పసుపు కండువా వేసుకుంటే ఏ ఫలమైనా అందుతుందని, స్వపక్షానికే పెద్దపీట వేస్తూ ‘పచ్చ’పాతం పాటిస్తున్నారని, చివరకు కేంద్ర పథకాల్లో కూడా భాగస్వామ్యం కల్పించడంలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పథకాలకు కూడా ‘చంద్రన్న’ పేరు పెట్టుకుని, మోదీ ఫోటో లేకుండా, వాటికి పసుపు రంగు పూసి అవన్నీ తమ ఘన కార్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేసుకోవడాన్ని ఈ వర్గం తప్పు పడుతున్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికలని వీరు చెబుతున్నారు. బీజేపీ పోటీ చేసిన వార్డుల్లో టీడీపీ నేతల్ని రెబల్‌గా వేయించారు. వారిపై సస్పెన్షన్‌ వేటు వేయకుండా ఎన్నికల తర్వాత తమవారంటూ తమలో కలిపేసుకున్నారు.

పథకాలు హైజాక్‌...
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రంలో 160 పథకాలు అమలవుతున్నాయి. 80 శాతం నిధులు కేంద్రం భరిస్తుండగా, 20 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కానీ, రాష్ట్రంలో ఎక్కడా 20 శాతం నిధులి చ్చి 100 శాతం పనులు పూర్తి చేసిన దాఖలాల్లేవు. కేంద్రమిచ్చే 80 శాతం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సోకు చేస్తోంది. అంతటితో ఆగడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పథకాలకు చంద్రబాబు పేరు పెట్టుకోవడం మరీ విడ్డూరం. ప్రధానమంత్రి మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు ఫొటోలతో ‘షో’ చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా చంద్రన్న బాట, చంద్రన్న బీమానే తీసుకోవచ్చు. ఇక, పేరు మార్చి అమలు చేస్తున్న వాటిలో ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ పథకం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలకు పసుపు రంగు పూస్తున్నారు. చంద్రన్నబాటలో వేస్తున్న సీసీ రోడ్ల వివరాలను ప్రదర్శించే బోర్డుల్ని పసుపు రంగుతో తయారు చేశారు. ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులైతే గతంలో ఉన్న రంగు తీసేసి పసుపు రంగు పూశారు. మోదీ ఫొటో లేకుండా జాగ్రత్త పడ్డారు.

ఆలయ కమిటీల్లోనూ మొండిచేయి...
మిత్రపక్షమైన బీజేపీకి ఆల య కమిటీల్లో చోటు కల్పి స్తూ ఆ పార్టీ నేత,  మం త్రి మా ణిక్యాలరావు ఉత్తర్వులు జారీ చేశా రు. కా నీ, కాకినాడకొచ్చేసరికి  స్థానిక ఎ మ్మెల్యే వారిచేత ప్ర మాణ స్వీకారం చే యించకుండా అడ్డుతగిలారు. కాకినాడ నగరంలోని బాలా త్రిపుర సుందరి సమేత రా మలింగేశ్వర స్వామి దేవస్థానం లో బీజేపీ నాయకుడు కర్రి పాపారావుకు, జగన్నాథపురం వెంకటేశ్వర స్వా మి దేవస్థానంలో బీజే పీ నాయకుడు కొక్కిలగెడ్డ గంగరాజుకు స్థా నం కల్పించినా ఇద్దరి తో ప్రమాణ స్వీకారం చేయించలేదు. ఇప్పటికీ ఆ ఉత్తర్వులు గాలిలోనే ఉ న్నాయి. కమిటీలోని మిగతా సభ్యులుగా ఉన్న టీడీపీ నాయకులు మాత్రం ఆలయాల్లో పెత్తనం చెలా యిస్తున్నారు. బీజేపీ నేతలు సిఫార్సు చేసి న వారికి కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఇళ్లు కూడా మంజూరు చేయలే దు. సాక్షాత్తు ఆ పార్టీ ప్రజాప్రతినిధి ఒక రు తమ వ్యక్తికి ఇళ్లు మంజూరు చేయాలని ఓ టీడీపీ ఎమ్మెల్యేకు సిఫార్సు చేస్తే కనీ సం పట్టించుకోలేదు. సరికదా టీడీపీ కం డువా వేసుకుంటేనే ఇళ్లు ఇస్తామని సదరు వ్యక్తికి నిర్మొహమాటంగా చెప్పేశారు.

కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీకి షాక్‌...
కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీని టీడీపీ నాయకులు మోసం చేశారు. పొత్తులో భాగంగా బీజేపీకి 9 డివిజన్లు కేటాయించారు. కానీ ఒక్క డివిజన్‌లో తప్ప ఎనిమిది డివిజన్లలో టీడీపీ నాయకుల్ని రెబల్‌గా బరిలోకి దించారు.  రెబల్స్‌గా ఉన్న వారంతా పసుపు చొక్కాలు వేసుకుని ప్రచారం చేయాలని, ఎన్నికల్లో అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, అడిగినంత సొమ్ము అందిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. అంతటితో ఆగకుండా  సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఏకంగా రెబల్స్‌ తరపున ప్రచారం కూడా చేశారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన డివిజన్‌లలో పోటీ చేసిన టీడీపీ నాయకులను సస్పెండ్‌ చేస్తామని అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చారు. కానీ పోలింగ్‌ జరక్కముందే బీజేపీకి ఝలక్‌ ఇచ్చారు.

సస్పెన్షన్‌ గాలికి... రెబల్స్‌కు పార్టీలో రెడ్‌ కార్పెట్‌...
బీజేపీకి కేటాయించిన డివిజన్‌లలో రెబల్‌గా పోటీ చేసిన వారందరిపైనా సస్పెన్షన్‌ వేటు వేస్తామని పొత్తు చర్చల్లో టీడీపీ అధిష్టానం దూతలు హామీ ఇచ్చారు. రెబల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని, క్రమశిక్షణ చర్యలు తప్పవని, వారిని పార్టీలోకి ఆహ్వానించేదిలేదని ప్రగల్భాలు పలికారు. కానీ...ఫలితాలొచ్చాక, గెలిచిన 29వ డివిజన్‌ రెబల్‌ వాసిరెడ్డి రామచంద్రరావు, 35వ డివిజన్‌ రెబల్‌ బలవూరి రామకృష్ణ, 39వ డివిజన్‌ రెబల్‌ మల్లిపూడి నాగ సూర్య దీపికలను అందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

 బీజేపీకి వెన్నుపోటు పొడిచిన విషయాన్ని పక్కన పెట్టి రెబల్స్‌కు రెడ్‌ కార్పెట్‌ వేశారు. ఇవన్నీ మిత్ర ధర్మాన్ని విస్మరించారనడానికి ఉదాహరణలని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. టీడీపీ నేతలు కౌంటర్‌ ఇస్తున్నా చెప్పుకోవడానికి ఏమీ కనబడటం లేదు. తాజాగా కేంద్ర బడ్జెట్‌పై వీరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొత్తానికి బీజేపీని ఎదగనివ్వకుండా టీడీపీ అడ్డుకుంటుందనడానికి పైన పేర్కొన్నవన్నీ అక్షర సత్యాలే.  వీరి మధ్య కొనసాగుతున్న కలహాల కాపురం ఇంకెంత కాలం పొసగుతుందో చూడాలి.

మరిన్ని వార్తలు