పాంచ్‌.. పడుద్ది!

19 Jan, 2018 10:11 IST|Sakshi

ఎమ్మెల్యేల పనితీరుపై టీడీపీ ప్రత్యేక నివేదిక

వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని నిర్ణయం?

ఐదుగురు సిట్టింగ్‌లకు మొండిచేయి

గతంలోనూ పలు సర్వే రిపోర్టులు

తాజా నివేదిక తర్వాత పలువురికి క్లాస్‌

‘అనంత’ పార్లమెంట్‌ పరిధిలో నలుగురు.. 

హిందూపురం పార్లమెంట్‌లో ఒకరు

ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు

టీడీపీలో చర్చనీయాంశంగా సర్వే

విద్యార్థులు రాసిన పరీక్షల ఆధారంగా మార్కులు వేయడం మనందరికీ తెలిసిందే. ఇదే కోవలో టీడీపీ అధిష్టానం గత మూడున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు వేస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్కులు వేసి, ఎమ్మెల్యేలకు గ్రేడింగ్‌లు ఇవ్వడంపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఎమ్మెల్యేల పనితీరుపై ఇంటెలిజెన్స్‌ అధికారులతో ప్రత్యేకంగా ఓ నివేదిక తెప్పించుకున్న అధిష్టానం.. ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ అంశం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సాక్షి, అనంతపురం: ఐదుగురు సిట్టింగ్‌లతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా టిక్కెట్టు లేనట్లేనని తెలుస్తోంది. ఏ రాజకీయ పార్టీలోనైనా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల పనితీరును పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా ముందుకెళ్లడం సహజం. టీడీపీలో కూడా 2014 వరకూ అదే జరిగింది. అయితే గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొత్త పంథాకు తెరతీశారు. ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించి గ్రేడింగ్‌లు ఇచ్చారు. ఇది మొదట్నుంచి ఆ పార్టీలో తీవ్ర వివాదాస్పదమవుతోంది. 

ఎమ్మెల్యేల పనితీరును అధిష్టానం పరిగణనలోకి తీసుకోవడం తప్పు కాదని, అయితే గ్రేడింగ్‌లు ఇచ్చి ‘ఫలానా ఎమ్మెల్యే ఫస్ట్‌.. మరొకరు లాస్ట్‌’ అంటూ కాపీలు విడుదల చేయడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అధిష్టానం మాత్రం తామనుకున్న దారిలోనే వెళ్తోంది. మూడున్నరేళ్లుగా ఇచ్చిన గ్రేడింగ్‌లను మదింపు చేసి పనితీరును బేరీజు వేసి ఒక నివేదికను అధిష్టానం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇది కాకుండా ఇటీవల ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్‌ అధికారులతో ప్రత్యేకంగా ఓ నివేదికను తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ రెండింటి ఆధారంగా ఎమ్మెల్యేలకు ఫోన్‌ చేసి గట్టిగా క్లాస్‌ తీసుకున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఐదుగురు సిట్టింగ్‌లు ఔట్‌
పనితీరు ఆధారంగా టీడీపీలో ఐదుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకూడదని అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీలోని ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఐదుగురికి కూడా ఇప్పటికే భవిష్యత్తుపై స్పష్టత వచ్చిందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఐదుగురిలో నలుగురు ఎమ్మెల్యేలు అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే, మరో ఎమ్మెల్యే హిందూపురం పార్లమెంట్‌ పరిధిలో ఉన్నారు. వీరిలో నలుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వ్యక్తులే కావడం గమనార్హం. ఒక్కరు మాత్రమే సీనియర్‌ నాయకుడు. ఎలాగూ టిక్కెట్టు ఇవ్వరనే నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలను కూడా పూర్తిగా గాలికొదిలేశారు. ‘దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలి’ అనే చందంగా అధికారం ఉన్నప్పుడే వీలైనంత దండుకోవాలనే రీతిలో ప్రతి అంశాన్ని ఈ ఐదుగురు నేతలు ఆర్థిక కోణంలోనే చూస్తుండటం గమనార్హం. 

బాలకృష్ణకూ టిక్కెట్టు లేదంట!
ఐదుగురు సిట్టింగ్‌లతో పాటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా టిక్కెట్టు లేనట్లేనని తెలుస్తోంది. హిందూపురం నుంచి సీఎం తనయుడు నారా లోకేశ్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బాలకృష్ణను రాజ్యసభకు పంపించి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా పెట్టాలనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయంలో బాలకృష్ణకు కూడా స్పష్టత ఉందని, అందుకే నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని చెబుతున్నారు. 

బాలకృష్ణపై ఉన్న వ్యతిరేకతతో ఈ సారి పోటీ చేసినా ఓడిపోవడం తథ్యమని ఇంటెలిజెన్స్‌ నివేదికలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో లోకేశ్‌ను బరిలోకి దించి, ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. హిందూపురం నుంచి స్థానికేతరులు పోటీ చేస్తే పండుగకు కొత్త అల్లుళ్లు వచ్చినట్లు చుట్టపుచూపుగా రావడం మినహా నియోజకవర్గాన్ని పట్టించుకోరని అభిప్రాయానికి ‘పురం’ వాసులు వచ్చారు. గతంతో పోలిస్తే ప్రజల్లో కూడా చైతన్యం పెరగడంతో స్థానికేతరులు ఎవరు పోటీ చేసినా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఏదేమైనా టీడీపీలో సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కవనే ప్రచారం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. 

మరిన్ని వార్తలు