కోడ్‌ రానున్న నేపథ్యంలో పదవుల పందేరం!

6 Mar, 2019 16:42 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం: ఎన్నికల కోడ్‌ రానున్న నేపథ్యంలో టీడీపీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ పథకానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టినట్టుగా కనపడుతోంది. మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే ఎన్నికల షెడ్యూలు దాదాపుగా విడుదల కానుందనే సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పార్టీలో ఉండేదెవ్వరో., గోడ దూకేదెవ్వరో తెలియని సందిగ్ధ స్థితి నెలకొని ఉంది. ఉన్న వాళ్లను కాపాడుకునే క్రమంలో అసంతృప్తులను చల్లార్చుకొనేందుకు పదవుల పందేర కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఈ క్రమంలో త్వరలో గూడెం వ్యవసాయ మార్కెట్‌ కమిటీని ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్న నేపథ్యంలో కూడా నియామకపు ఉత్తర్వులు ఇస్తారని తెలుస్తోంది. పెంటపాడుకు చెందిన డీసీసీబి డైరెక్టర్‌ దాసరి అప్పన్న సతీమణి దాసరి కృష్ణవేణికి చైర్మన్‌ పదవి కట్టబెట్టడానికి  రంగం సిద్ధమైనట్టు సమాచారం. వైస్‌ చైర్మన్‌గా పట్టణంలోని 32వ వార్డుకు చెందిన రామిశెట్టి సురేష్‌ను నియమిస్తారని తెలుస్తోంది. గతంలో వీసీ పదవికి రాజీనామా చేసిన గొర్రెల శ్రీధర్‌కు ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పదవినిచ్చి ఆకర్ష పథకాన్ని అమలు చేసింది.

విధులు, నిధులు లేని టైలర్స్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఆకాశం స్వామిని నియమించారు. మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి కోసం పోటీపడి ఫలితం పొందలేక పోయిన కాపు సామాజిక వర్గానికి చెందిన 32వ వార్డు కౌన్సిలర్‌ రామిశెట్టి సురేష్‌కు ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ పదవిని ఇవ్వడం ద్వారా సైకిల్‌ దిగి వెళ్లకుండా టీడీపీ కట్టడి చేసుకున్నట్టుగా కనపడుతోంది.  

మరిన్ని వార్తలు