ఏం చేద్దాం..?

8 Jul, 2019 10:13 IST|Sakshi
గుంటూరులోని టీడీపీ కార్యాలయ భవనం

అక్రమ నిర్మాణమైన టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనంపై సర్వత్రా చర్చ 

చర్యలు చేపట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నకార్పొరేషన్‌ అధికారులు

లీజు రెన్యూవల్‌ చేయక పోవడంతో నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తం 

సాక్షి, గుంటూరు:  టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం అక్రమ నిర్మాణం అని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అటు టీడీపీ నేతల్లోనూ.. ఇటు నగరపాలక సంస్థ అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. ఇప్పటికే అక్రమ కట్టడాలైన ప్రజావేదిక కూల్చి వేయడం, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం సైతం అక్రమ కట్టడమని బయటపడడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీడీపీ నేతలు వణికి పోతున్నారు. మరోవైపు అక్రమంగా నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై నగరపాలక సంస్థ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే అక్రమ కట్టడానికి పన్నులు వేయించి దాన్ని సక్రమం చేసే పనిలో పడగా, విషయం బయటకు పొక్కడం, అక్రమ కట్టడాలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎవరూ పన్ను వేసే ధైర్యం చేయలేకపోతున్నారు. టీడీపీ కార్యాలయ భవనానికి ఆక్రమించిన కార్పొరేషన్‌ స్థలాన్ని  స్వాధీనం చేసుకుంటారా..? లేదా దానిపై అద్దెలు, జరిమానాలు వేసి చేతులు దులుపుకుంటారా? అనే చర్చ నడుస్తుంది. అయితే టీడీపీ కార్యాలయ భవనానికి ఎటువంటి అనుమతులు లేకపోవడం.. కార్పొరేషన్‌ స్థలం ఆక్రమించడం.. లీజుకు ఇచ్చిన స్థలాన్ని సైతం రెన్యూవల్‌ చేసుకోకుండా వదిలేయడం వంటి అంశాలపై సమగ్రంగా నివేదిక తయారు చేసి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ ఉన్నతాధికారులకు పంపేందుకు నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. 

నోటీసుల జారీకి రంగం సిద్ధం:
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా దృష్టి సారించడంతో టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై నగరపాలక సంస్థ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అధికారంలో ఉండటంతో చూసీచూడనట్లు వదిలేసిన అధికారులు, ఇప్పుడు టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడంతోపాటు, ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందించేందుకు సమాయత్తం అవుతున్నట్లు  తెలిసింది.

టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం నిర్మించినట్లుగా కనీసం కార్పొరేషన్‌ రికార్డుల్లో కూడా లేదంటే ఏ స్థాయిలో అక్రమం జరిగిందో అర్థమవుతోంది. మామూలుగా అయితే అక్రమ నిర్మాణానికి నోటీసులు జారీ చేసి కూల్చివేసే అధికారులు టీడీపీ రాష్ట్ర కార్యాలయం కావడంతో ఆచూతూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘోర పరాభవం తరువాత కార్యకర్తలకు అందుబాటులో ఉంటానంటూ ఈ భవనం నుంచే తన కార్యకలాపాలు మొదలు పెట్టడం.. ఆయన భవనంలోకి అడుగు పెట్టిన మరుసటి రోజే అక్రమ భవనం గుట్టు రట్టు కావడంతో టీడీపీ నేతలకు నిద్రపట్టడం లేదు.

ఇప్పటికే ప్రజా వేదికను కూల్చిన ప్రభుత్వం తనపై కక్షతో టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి సైతం నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబే  చెప్పడం చూస్తుంటే వారు ఏస్థాయిలో ఆందోళనకు గురవుతున్నారో అర్థమవుతోంది.  ఏదేమైనా నగరపాలక సంస్థ అధికారులు నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టి అక్రమ భవనాన్ని కూల్చివేయడంతోపాటు టీడీపీ  కార్యాలయ ఆక్రమణలో ఉన్న  కార్పొరేషన్‌ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నగర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.  

20 ఏళ్లుగా ఇష్టారాజ్యం 
నిరుపేదలు తలదాచుకునేందుకు చిన్న రేకుల షెడ్డు నిర్మించుకున్నా.. చిరు వ్యాపారులు చిన్న షాపు ఏర్పాటు చేసుకున్నా అదేదో భయంకరమైన తప్పు జరిగిపోయినట్లుగా భావించి యుద్ధ ప్రాతిపదికన వాటిని కూల్చివేసే నగరపాలక సంస్థ అధికారులకు అడ్డగోలుగా నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం మాత్రం కనిపించకపోవడం దారుణమైన విషయం. కార్పొరేషన్‌ లీజుకు ఇచ్చిన వెయ్యి గజాల స్థలంలో అన్ని అనుమతులతో భవనాన్ని నిర్మించాల్సి ఉన్నప్పటికీ  అడ్డగోలుగా అక్రమ కట్టడాన్ని నిర్మించేశారు.

20 ఏళ్లుగా అక్రమ కట్టడానికి ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడం.. ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ  నగరపాలక సంస్థ అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. అంతేకాకుండా నగరపాలక సంస్థకు చెందిన 1,637 చదరపు గజాల స్థలాన్ని ఆక్రమించేసి ప్రహరీ నిర్మించి 20 ఏళ్లుగా  టీడీపీ నేతలు తమ స్వాధీనంలో ఉంచుకున్నప్పటికీ నగరపాలక సంస్థ అధికారుల కంటికి అదేమీ కనిపించలేదు.

సుమారు రూ.30 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసినా.. స్థలంలీజును రెన్యూవల్‌ చేసుకోకుండా వదిలేసినా.. వారి జోలికి కూడా వెళ్లే ధైర్యం చేయలేకపోయారు. గత ఐదేళ్లుగా టీడీపీ అధికారంలో ఉండటంతో వారు  ఏం చేసినా అధికారులు తలాడిస్తూ వచ్చారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఉన్న అరండల్‌పేటలో ఆ స్థాయి భవనానికి ఆరు నెలలకు రూ. 5 లక్షలు చొప్పున పన్ను వేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నగరపాలక సంస్థకు ఏడాదికి రూ.10 లక్షలు చొప్పున సుమారుగా 20 ఏళ్ల పాటు రూ. 2 కోట్ల పన్ను ఎగవేయడంతోపాటు అతి ఖరీదైన స్థలాన్ని ఆక్రమించి కబ్జా చేసినా కార్పొరేషన్‌  అధికారులు పట్టించుకోలేదు.   

మరిన్ని వార్తలు