మండలిలో టీడీపీ సైంధవ పాత్ర

22 Jan, 2020 01:50 IST|Sakshi
మండలిలో మాట్లాడుతున్న టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు

శాసనసభ ఆమోదించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును  పెట్టనివ్వకుండా మోకాలడ్డు

రూల్‌ –71ని తెరపైకి తెచ్చిన వైనం

మండలికి లేని అధికారాన్ని అడ్డుపెట్టుకొని తొండాట

బిల్లులు చర్చకు రాకుండా కుయుక్తులు

శాసనసభ పంపిన బిల్లులను అడ్డుకోవడం 

సరికాదంటున్న రాజ్యాంగ నిపుణులు

ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు,

ఇంగ్లిష్‌ మీడియం బిల్లులపైనా అదే తీరు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును మంగళవారం శాసనమండలిలోప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకునేయత్నం ద్వారా టీడీపీ సరి కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఈ బిల్లుపై శాసనసభలో సోమవారం సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ సభ్యులు ప్రయత్నించారు. చివరకు తమ వాదన వినిపించలేక వాకౌట్‌ చేశారు. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించి.. ఆమోదించిన బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో రూల్‌ 71 కింద నోటీసు ఇవ్వడాన్ని రాజ్యాంగ నిపుణులు తప్పుబడుతున్నారు. శాసన మండలిలో సంఖ్యా బలంతో ఆ బిల్లును జాప్యం చేయడం మినహా అడ్డుకోలేమని తెలిసినా, టీడీపీ ఈ డ్రామాకు తెరతీయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని అమరావతిలో తానూ, తన బినామీలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేసిన భూముల ధరలు తగ్గకుండా చూడటానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా చేయడానికే చంద్రబాబు రూల్‌ 71ను తెరపైకి తెచ్చేలా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను శాసనమండలిలో సంఖ్యా బలంతో అడ్డుకునే యత్నం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ నిపుణులు, సామాజిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

ఇటీవల కూడా ఇదే తీరు.. 
శాసనమండలిలో టీడీపీ ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎస్సీ కమిషన్‌ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు సంబంధించిన బిల్లు విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించింది. పర్యవసానంగా చారిత్రక బిల్లులు చట్టాల రూపు సంతరించుకోవడంలో తీవ్రంగా జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రజా సమస్యల పరిష్కారం.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా అర్థవంతమైన, లోతైన చర్చలకు వేదికగా నివాల్సిన శాసనమండలిని టీడీపీ ‘రాజకీయ’ కుయుక్తులకు వినియోగించుకుంటోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని 169వ అధికరణ ప్రకారం శాసనమండలిని ఏర్పాటు చేయాలన్నా, రద్దు చేయాలన్నా ఆ రాష్ట్ర శాసనసభ తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదిస్తే.. మండలి ఏర్పాటుకుగానీ, రద్దుకుగానీ ఆమోదముద్ర పడినట్లు లెక్క. శాసనసభ ఆమోదించిన బిల్లులపై మరింత అర్థవంతమైన చర్చలు జరిపి, వాటికి మెరుగులు దిద్ది.. జనరంజకంగా తీర్చి దిద్దడం శాసనమండలి ప్రధానోద్దేశమని భారత రాజ్యాంగం స్పష్టీకరిస్తోంది. కానీ, శాసన ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడానికే శాసనమండలిని కొన్ని రాజకీయ పార్టీలు వినియోగించుకుంటున్నాయని, అందుకే దాన్ని ఉండుకంగా, ఆరవ వేలుగా రాజ్యాంగ నిపుణులు అనేక సందర్భాల్లో విశ్లేషించారు. ఇప్పుడు శాసనమండలిలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ నిపుణుల విశ్లేషణకు అతికినట్లు సరిపోతుంది.

శాసనసభలో విఫలం.. మండలిలో వితండవాదన
సోమవారం శాసనసభలో పరిపాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిపై తమ వాదనను వినిపించడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు విఫలమయ్యారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఆ బిల్లును శాసనసభ ఆమోదించింది. నిబంధనల ప్రకారం ఈ బిల్లును శాసనమండలిలో మంగళవారం ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి ప్రతిపాదించింది. ఈ బిల్లును శాసనమండలిలో తిరస్కరిస్తే మళ్లీ అది శాసనసభకు వెళ్తుంది. ఆ బిల్లును శాసనసభ మరో సారి ఆమోదించి.. పంపితే శాసనమండలి దాన్ని ఆమోదించినా, తిరస్కరించినా.. ఆమోదించినట్లుగానే లెక్క. అంటే ఆ బిల్లు చట్టరూపాన్ని సంతరించుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ తొండాటకు దిగింది. ఈ బిల్లును శాసనమండలిలో ప్రవేశపెట్టడానికి వీల్లేదని రూల్‌–71 కింద టీడీపీ నోటీసు ఇస్తూ.. చర్చ చేపట్టాలని వితండవాదనకు దిగింది. ‘రూల్‌–71 కింద చర్చకు అనుమతిస్తే ఇది ఒక సంప్రదాయంగా మారిపోతుంది.. ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా భావించి ప్రవేశపెట్టిన బిల్లులను ప్రతిసారీ అడ్డుకోవడానికి ఈ రూల్‌ను తెరపైకి తెస్తే ప్రజాభ్యుదయానికి విఘాతం కలుగుతుంది’ అని శాసన వ్యవహారాలు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పదే పదే వి/æ్ఞప్తి చేసినా టీడీపీ పట్టించుకోక పోవడం వెనుక చంద్రబాబు, బినామీల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారమే కారణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు..
శాసనసభలో మెజార్టీ స్థానాలు సాధించిన పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధే లక్ష్యంగా శాసనసభ ఆమోదించిన బిల్లులను శాసనమండలిలో టీడీపీ సభ్యులు ప్రవేశపెట్టనివ్వకుండా అడ్డుకోవడం, తిరస్కరించడమంటే ప్రజా తీర్పును అవమానించినట్లేనని.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని రాజ్యాంగ నిపుణులు, మేధావులు అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ కోసం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా శాసనసభ బిల్లును ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోకుండా శాసనమండలి ఆ బిల్లులో మార్పులు చేస్తూ శాసనసభకు తిప్పిపంపేలా టీడీపీ చక్రం తిప్పింది. దీని వల్ల రెండు వేర్వేరు కమిషన్ల ఏర్పాటులో జాప్యం చోటు చేసుకుంది. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో బోధనకు వీలుగా శాసనసభ ఆమోదించిన ఏపీ ఎడ్యుకేషన్‌ యాక్ట్‌–1982 సవరణ బిల్లును కూడా ఇదే రీతిలో తిప్పి పంపేలా శాసనమండలిలో టీడీపీ సభ్యులు వ్యవహరించారు. దీంతో అది చట్టరూపం సంతరించుకోవడంలో జాప్యం ఏర్పడింది. దీంతో నిరుపేద వర్గాల విద్యార్థుల భవితను అంధకారంలోకి నెట్టడానికి టీడీపీ సభ్యులు ప్రయత్నించారనే విమర్శలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 
 
రూల్‌ 71 అంటే.. 
‘శాసనమండలిలో అధికారపక్షం విధానంపై ప్రతిపక్షం తన అభ్యంతరం లేదా అవిశ్వాసాన్ని ప్రకటిస్తూ రూల్‌–71 కింద చైర్మన్‌కు నోటీసు ఇవ్వొచ్చు. ఈ నోటీసు అందిన వారం రోజుల్లోగా శాసనమండలిలో చర్చ చేపట్టాలి. ఈ రూల్‌ కింద ఇచ్చిన నోటీసుపై చర్చ అనంతరం ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఇందులో ఆయా పక్షాల బలాబలాలను అనుసరించి బిల్లు ఆమోదం పొందడం/పొందక పోవడం ఉంటుంది. అయితే ఈ రూల్‌ కింద చర్చ చేపట్టే అంశం, బిల్లులోని అంశం ఒక్కటే అయితే సభలో ప్రవేశపెట్టకుండా తిరస్కరించడానికి వీల్లేదు. రూల్‌ 71కు, బిల్లులపై చర్చకు సంబంధం ఉండదు. ఆ బిల్లులను మళ్లీ సభలో చర్చకు తీసుకుంటారు. సభ్యులు దీనిపై సవరణలను ప్రతిపాదించవచ్చు. ఆ సవరణలను ప్రభుత్వం ఆమోదించడమో, లేదా తిరస్కరించడమో చేయొచ్చు.  

బిల్లును అడ్డుకునే అధికారం శాసనమండలికి లేదు
శాసన ప్రక్రియలో శాసనమండలి ముందుకు వచ్చిన బిల్లుపై తన అభిప్రాయాన్ని చెప్పాలి కానీ ఆ బిల్లును అడ్డుకునే అధికారం లేదు. అసలు రూల్‌ 71 అనే నిబంధన శాసనసభ తీసుకొచ్చిన బిల్లులపై శాసనమండలి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఉద్దేశించింది కాదు. కేవలం ప్రభుత్వ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించే నిబంధన మాత్రమే. కానీ పరిపాలన వికేంద్రీకరణ విధాన రూపాన్ని దాటుకుని.. బిల్లుగా రూపం దాల్చింది కాబట్టి ఈ దశలో అభిప్రాయాన్ని చెప్పడం మండలి బాధ్యత. బిల్లు కన్నా ముందు విధానంపై అభిప్రాయాన్ని చెప్పడంలో అర్థం లేదు. కాబట్టి రూల్‌ 71 కింద నోటీసును అనుమతించడం తప్పుడు నిర్ణయం.
– ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ 

>
మరిన్ని వార్తలు