జైల్లో పెడతానంటావా?.. నా వెనుక టీడీపీ ఉంది

22 Jan, 2019 10:08 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: అధికారంలో ఉన్నామన్న అహంకారమో లేక తమను ఎదురించి అడ్డు చెప్పేదెవరనుకుంటున్నారో ఏమో కానీ టీడీపీ నేతల, సానుభూతిపరుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. సామాన్య ప్రజలపైనే కాకుండా ఏకంగా పోలీసులపై బరితెగించి దౌర్జన్యానికి, దాడులకు పాల్పడుతున్నారు. మొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి బాబ్జి పోలీసులపై దౌర్జన్యానికి దిగిన వార్త మరువకముందే మరో ఘటన టీడీపీ అధినేత సొంత జిల్లాలో చోటుచేసుకుంది. తన కొడుకు టీడీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడనే అండతో ఏకంగా కానిస్టేబుల్‌పైనే దాడికి దిగాడు ఓ తండ్రి. ఈ ఘటన చిత్రూరు జిల్లా పెనుమూరు మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. 

వివరాలు.. పెనుమూరులో నివసిస్తున్న చంద్రశేఖర్‌ నాయుడు కొడుకు యుగంధర్‌ జిల్లా టీడీపీ ఆఫీస్‌లో పనిచేస్తున్నాడు. వీరికి సంబంధించిన స్థల వివాదం కోర్టులో ఉంది. దీంతో ఈ స్థలంలో ఎలాంటి పనులు చేపట్టరాదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ చంద్రశేఖర్‌ నాయుడు ఆ స్థలంలో పనులు చేపట్టాడు. స్థానికులు అందించిన సమాచారంతో వివాదస్పద స్థలం వద్దకు చేరుకున్న కానిస్టేబుల్‌.. కోర్టు పరిధిలోని స్థలంలో పనులు చేపట్టడం నేరమని చంద్రశేఖర్‌ నాయుడుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు‌. అయితే తనకే అడ్డు చెబుతావా అన్ని కానిస్టేబుల్‌ను దూషిస్తూ కర్రతో దాడికి దిగాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దీనిపై కానిస్టేబుల్‌ ఎస్‌ఐకి ఫిర్యాదు చేయగా.. విషయం తెలుసుకున్న యుగంధర్‌ ఎస్‌ఐకి ఫోన్‌ చేసి తన తండ్రిపై కేసు పెట్టవద్దని హుకుం జారీ చేశాడు. ఇక చేసేదేమి లేక కానిస్టేబుల్‌కు ఎస్‌ఐ నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో కానిస్టేబుల్‌ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు