ఆ సీఐ జాడేదీ?

30 May, 2019 11:35 IST|Sakshi

ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకుల నుంచి భారీగా వసూళ్లు

ఆపై ఆ పార్టీ నేతలపై అక్రమ కేసులు

టీడీపీ నేతలతో కలసి స్వయంగా నగదు పంపిణీ!

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో సెలవుపై వెళ్లిన వైనం

తిరుపతిక్రైం: ఆయనో మూడు స్టార్ల అధికారి. ఎన్నికల సమయంలో విధులు నిర్వర్తించేందుకు  దాదాపు 9 నెలల క్రితం తిరుపతిలోని ఓ పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. కర్నూలు జిల్లా నుంచి ఉద్యోగోన్నతిపై ఇక్కడికొచ్చిన ఆయన మొదట్లో కాస్త నిజాయితీపరుడిలా బిల్డప్‌ ఇచ్చారు. టీడీపీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ఒక పోలీస్‌ ఉన్నతాధికారికి దూరపు బంధువు కూడాను. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక నిజాయితీపరుడి ముసుగు తీసేసి తన అవినీతి విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులనే  టార్గె ట్‌ చేశారు. ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నా నగదు పంచుతున్నారని బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా  ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకులను బెదిరించి ఈ మాత్రం ఫార్మాలిటీస్‌ తెలి యవా? అంటూ బలవంతపు వసూళ్లకు పూనుకున్నారు. ఒక ముఖ్యనేత నుంచి భారీగా డబ్బు గుంజిన ఆయన తర్వాత ప్లేటు ఫిరాయించాడు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేయడం, వారిపై కేసులు పెట్ట డం పరిపాటిగా మారింది. పక్కా టీడీపీ ఏజెంటులా వ్యవహరించడం మొదలెట్టారు. జేబులో రూ.10వేలు ఉన్నా కూడా ఆ నగదును లాక్కొని, కేసులు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆ వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే..
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఫ్యాను గాలి జోరుగా వీయడంతో ఆ సీఐ సిక్‌ లీవు పెట్టి అదృశ్యమయ్యారు. ఎన్నికల సమయంలో ఇబ్బడిముబ్బడిగా దండుకున్న ఆయన సిబ్బందికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం సర్దేశారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు వైఎస్సార్‌ సీపీ నాయకుల వద్ద ఆధారాలు ఉండడంతో సీఐ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఈ వసూళ్ల పర్వం వెనుక బంధువైన మరో పోలీసు బాసు కూడా ఉండడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదలా ఉంచితే, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన మరికొందరు కూడా సిక్‌ లీవుపై వెళ్లి, ఆపై బదిలీపై వెళ్లే ప్రయత్నాలకు ఉద్యుక్తులవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

టీడీపీ ఏజెంట్‌గా..
వైఎస్సార్‌సీపీను టార్గెట్‌ చేయడంతో పాటు మరో వైపు టీడీపీకి అనుకూలంగా సీఐ వ్యవహరించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. చివరకు ఆయన ఓ కారులో నగదును తరలించి, కార్యకర్తలు పంచిపెట్టినట్లు ప్రచారంలోకి సైతం వచ్చింది. ఎన్నికల కోడ్‌ సమయంలో అభ్యర్థులను, వైఎస్సార్‌సీపీ వాళ్లను టార్గెట్‌ చేసిన ఆ సీఐపై పోలీసు బాసులకు తెలిసినా కూడా టీడీపీకి వీరవిధేయుడు కావడంతో చూసీ చూడనట్లు వ్యవహరించారు.

మా దృష్టికి వస్తే చర్యలే
దీనిపై అనంతపురం రేంజ్‌ డీఐజీ క్రాంతిరాణా టాటాను వివరణ కోరగా.. తమ దృష్టికి ఆ సీఐపై ఇలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు రాలేదని, తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు