‘బాలకృష్ణ చేయి తాకడమే పుణ్యం’

17 Aug, 2017 18:47 IST|Sakshi
‘బాలకృష్ణ చేయి తాకడమే పుణ్యం’

నంద్యాల: ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ కార్యకర్త పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డంగా సమర్థించుకుంటోంది. ఈ ఘటనను ఖండించాల్సిన ఆ పార్టీ పై పెచ్చు బాలకృష్ణ చేయి తాకడమే పుణ్యం చేసుకున్నట్లు అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరం.  అసహనంతో అభిమానిపై బాలకృష్ణ చేయిచేసుకుంటే...అందులో తప్పేముందంటున్నారు టిడిపి నేతలు. బాలకృష్ణ చేయి తగిలితే ఆ పులకరింతే వేరంటున్నారు.

వివరాల్లోకి వెళితే...నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన బాలకృష్ణ రాత్రి బస కోసం పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు వచ్చారు. ఆ సమయంలో తన అభిమాన హీరోకు దండవేసి ఫొటో దిగాలని ఆశపడిన ఓ టీడీపీ కార్యకర్త ఉత్సాహంగా ఆయన వద్దకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఒక్కసారిగా ఆ కార్యకర్తపై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నాయకుడు దాడి చేసిన తీరు చూసి అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ కార్యకర్తలు ఆన్‌లైన్‌లో పెట్టారు.

అయితే పార్టీ కార్యకర్తను బాలకృష్ణ కొట్టడాన్ని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సమర్థించారు. అంతేకాకుండా ‘బాలకృష్ణ కొడితే ఆ అభిమాని పొంగిపోయి ఉంటాడు. ఆయన చేయి తాకడం అంటే పుణ్యం చేసుకున్నట్లు.’ అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి, అభిమానిపై చేయి చేసుకునే హక్కు బాలకృష్ణకు ఎవరిచ్చారని, ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించే తీరు ఇలాగేనా? అని సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.