టీడీపీ వర్గీయుల దాడి

15 Jun, 2019 04:08 IST|Sakshi
టీడీపీ వర్గీయుల కత్తిదాడిలో గాయపడిన వైఎస్సార్‌సీపీ వర్గీయులు పల్లపు రవి, శివ, తదితరులు

ఉప్పరపాలెం, తుర్లపాడు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే విడదల రజని

యడ్లపాడు (చిలకలూరిపేట): గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం ఉప్పరపాలెం, తుర్లపాడు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు గురువారం రాత్రి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగాను, మరో ముగ్గురు స్పల్పంగాను గాయపడ్డారు. ఉప్పరపాలెం గ్రామంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆలకుంట వెంకట్రావు కుమారుడు వరుణ్‌తేజ్‌ మొదటి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.

భోజనాలు చేసి బంధువులు తిరిగి వెళ్లిపోతున్న సమయంలో.. మా ఇళ్ల ముందు బాణసంచా కాలుస్తారా అంటూ టీడీపీకి చెందిన పెదపోలు రాజు తదితరులు రాళ్లు, ఇటుకలు, కర్రలు, కత్తులతో రణరంగం సృష్టించారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీకి చెందిన పల్లపు రవి, పల్లపు లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలు కాగా.. పల్లపు శివ, పల్లపు అంకమరావు, ఆలకుంట వెంకట్రావు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారు చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై రెండువర్గాల వారూ పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు.

తుర్లపాడులో: యడ్లపాడు మండలంలోని తుర్లపాడు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన వడ్లాన చినసుబ్బారావుపై టీడీపీ వర్గీయులు కట్టెలతో దాడికి పాల్పడగా, అతడు తీవ్రంగా గాయపడ్డారు. చినసుబ్బారావు గతంలో టీడీపీకి అనుకూలంగా ఉండేవారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పక్షాన పనిచేశాడు. ఇది సహించలేని టీడీపీ వర్గీయులు మేడిద త్యాగరాజు, అతని కుమారుడు లూక, వర్థయ్య, వడ్లాన సురేంద్ర, గోవడ పున్నారావు తదితరులు రాత్రి 11 గంటల సమయంలో చినసుబ్బారావుపై దాడికి దిగారు.

అడ్డువచ్చిన అతని కుమారుడు రమేష్‌పై పిడిగుద్దులు కురిపించారు. తల, మెడపై తీవ్రగాయాలైన చినసుబ్బారావును చిలకలూరిపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. రెండు ఘటనల్లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని శుక్రవారం పరామర్శించారు. ఎవరూ అధైర్య పడవద్దని, కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. క్షతగాత్రులను పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, నాయకులు ఎంవీ రత్నారెడ్డి, సయ్యద్‌ సుభాని, శ్రీనివాసనాయక్, అంజిరాజు ఉన్నారు.

మరిన్ని వార్తలు