టీడీపీకి స్టాండింగ్ టెన్షన్

3 Feb, 2015 03:51 IST|Sakshi

⇒కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల  నిర్వహణపై వెనుకంజ
⇒గత నవంబర్‌లో ఎన్నికకు నోటిఫికేషన్
⇒ఆ తర్వాత నోరుమెదపని పాలకవర్గం
⇒కుంటుపడుతున్న నగర అభివృద్ధి

 
నెల్లూరు, సిటీ : నెల్లూరు నగర పాలక సంస్థలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి కన్పించడం లేదు. కొత్త కౌన్సిల్‌లో అధికారులు, పాలకుల మధ్య ఆధిపత్య పోరు ఫలితంగా ఈ దుస్థితి ఏర్పడింది. కౌన్సిల్ ఏర్పడిన మూడు నెలల వ్యవధిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని మున్సిపల్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. కౌన్సిల్ ఏర్పాటై ఆరు నెలలు దాటినా పాలకులు ఎన్నికల జోలికి వెళ్లడం లేదు. గత నవంబర్‌లో ఎన్నికలు నిర్వహిం చేందుకు కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసినా ఆధిపత్య పోరుతో వాయిదాపడ్డాయి.

తదుపరి ఉత్తర్వులు వస్తేనే ఆ ప్రక్రియ చేపడతామంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఖజానా ఖాళీ కావడంతో అభివృద్ధి పనులు గురించి పాల కులు నోరు మెదపడంలేదు. జిల్లాకు చెందిన వారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా ఒక్క పైసా కూడా ప్రభుత్వం రాలేదు. సాధారణ నిధులకు సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్టాండింగ్‌కమిటీ నియామకం తప్పని సరి. ఆ దిశ చర్యలు తీసుకోకపోగా నిత్యం అధికారులు, పాలకులు పరస్పరం పరోక్షంగా దూషించుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.

వాయిదాకు మంత్రి ఒత్తిడి...

స్టాండింగ్ కమిటీ ఏర్పడితే తాము ఎక్కడ బలహీనమవుతామనే ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి ఒకరు తెరవెనుక స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాయిదావేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో రూ.10 లక్షలపైన పనులు చేయాల్సి ఉంటే స్టాండింగ్ కమిటీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిల్ ఏర్పడి నెలలు గడుస్తున్నా పరిపాలనా పరమైన పనులు జరగడం లేదని పలువురు వాపోతున్నారు. కార్పొరేషన్‌లో జరగాల్సిన పనులను స్టాండింగ్‌కమిటీ ద్వారా ఎన్నుకోవడంతో తమకు ఎక్కడ ప్రాధాన్యం తగ్గుతుందోనని తమ్ముళ్లు ఆ ఊసేత్తడంలేదు.

మేయర్‌కు మద్దతు భయం

మేయర్ అజీజ్ కూడా తనకు టీడీపీ కార్పొరేటర్లు మద్దతు ఇస్తారో, లేదో అన్న సందేహంలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి తెలుగుదేశం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీలో చేరినప్పటి నుంచి అజీజ్‌కు ఆ పార్టీనాయకులు, కార్పొరేటర్లు పట్టించుకు న్న పరిస్థితి లేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహిస్తే తనకు మద్దతు ఇస్తారో, లేదోనని మేయర్ అంటున్నట్లు  తెలిసింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వాయి దా వేయడమే తనకు మంచిదనే ఉద్ధేశంలో ఉన్నారు. ఇప్పటికైనా స్టాండింగ్ ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు