బెదిరింపులకూ లొంగని బీసీలు

18 Feb, 2019 07:38 IST|Sakshi
బీసీ గర్జనకు తరలివస్తున్న అక్కచెల్లెళ్లు

టీడీపీ కుటిల యత్నాలు విఫలం

బలవంతంగా పోలవరం తరలింపు

జిల్లాలో ఒక్కరోజే 138 ఆర్టీసీ బస్సులు

ట్రాఫిక్‌ నియంత్రణలో పోలీసుల వైఫల్యం

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌ సీపీ చేపట్టిన బీసీ గర్జనకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు చేసిన కుటిల యత్నాలు విఫలమయ్యాయి. వారి బెది రింపులకు బీసీలు లొంగలేదు. స్వచ్ఛం దంగా బీసీ గర్జన సభకు తరలివచ్చారు.

డ్వాక్రా చెక్కులు రద్దు చేస్తామంటూ బెదిరింపులు
ఏలూరులో బీసీ గర్జన మహాసభకు బీసీ వర్గాలు, ప్రజలు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. మహిళలను ఏకంగా డ్వాక్రా చెక్కులు రద్దు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. తెల్లవారితే మహిళలు ఎక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించే బీసీ గర్జన సభకు వెళ్ళిపోతారనే భయంతో శనివారం రాత్రికి రాత్రే మహిళలను పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బలవంతంగా తరలించారు. ఏలూరు నగరంలో అయితే ఏకంగా ప్రతి డివిజన్‌కూ ఆర్సీసీ బస్సులను ఏర్పాటు చేసి ఉదయాన్నే మహిళలు, జనాన్ని బలవంతంగా బస్సులు ఎక్కించారు. ఇలా ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 138 ఆర్టీసీ బస్సుల్లో ప్రజలను పోలవరం తరలించారు.  కొందరు మహిళలు తాము బీసీ గర్జన సభకు వెళ్ళాలని టీడీపీ నేతలకు చెప్పటంతో.. డ్వాక్రా చెక్కులను రద్దు చేస్తామని, మీకు ఇతర పథకాలేవీ రాకుండా చేసేస్తామంటూ హెచ్చరించినట్టు పలువురు బాధితులు చెబుతున్నారు. చాలామంది ఆ బెదిరింపులకు లొంగలేదు. స్వచ్ఛందంగా బీసీ గర్జనకు తరలివచ్చారు. కొందరు చేసేది లేక శాపనార్థాలు పెట్టి బస్సుల్లో పోలవరం వెళ్లినట్టు సమాచారం. ఇలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ మహిళలను బలవంతంగా పోలవరం సందర్శనకు తీసుకువెళ్ళినట్లు తెలుస్తోంది.

ట్రాఫిక్‌ నియంత్రణలో ఘోర వైఫల్యం
బీసీ గర్జన సభ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను పోలీసులు గాలికి వదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  పోలీసులు సభా ప్రాంగణం, సభకు వచ్చే దారుల్లో ట్రాఫిక్‌ నియంత్రణ విషయాల్లో విఫలమయ్యారు.  బీసీ గర్జన రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. అయితే ట్రాఫిక్‌ను మళ్ళించటం, నియంత్రించటంలో మాత్రం పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సభకు వెళ్ళేందుకు మధ్యాహ్నం వచ్చిన బస్సులు, కార్లు, ఇతర వాహనాలను సభ ప్రాంగణానికి చాలా దూరంలోనే నిలిపివేయటం, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకపోవటంతో అసలు సభ వద్దకు రావటానికే అవకాశం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులోని మినీ బైపాస్, జాతీయ రహదారిపైనా సభకు వచ్చే వాహనాలను అడ్డుకోవటంతో వేలాదిమంది సభకు రాలేకపోయామని బాధపడుతున్నారు. ఇక మరోవైపు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే వట్లూరు సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి విజయవాడ వైపు ఆర్టీసీ బస్సులు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వటంతో సభ జరుగుతున్న రోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించింది. ఆఖరికి మోటారుసైకిల్‌ కూడా అటుగా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్‌ జగన్‌ ప్రసంగం సాయంత్రం 6 గంటలకు ముగిసినా... రాత్రి 11 గంటల సమయంలోనూ కలపర్రు టోల్‌గేట్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ స్తంభించిపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణికుల్లో సభపై వ్యతిరేకత రావాలనే ఈ విధంగా పాలకులు ఆదేశాల మేరకు పోలీసులు వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు