‘పచ్చ’ నేతల కక్ష

15 Apr, 2019 12:54 IST|Sakshi
పోలీసు బందోబస్తు నడుమ పోలింగ్‌ స్టేషన్‌కు వెళ్లి ఓట్లు వేసిన లలితాకుమారి కుటుంబ సభ్యులు

ఐదేళ్లుగా ఓ కుటుంబం వెలి

వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులవడమే వారి పాపం

అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లతో పట్టించుకోని అధికారులు

ఎన్నికల సంఘానికి ఫిర్యాదుతో ఓటు హక్కు వినియోగం

పోలీసు బందోబస్తు నడుమ ఓటు వేసిన బాధితులు  

తెల్లారి లేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి, ప్రజాస్వామిక విలువల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు లెక్చర్లు దంచేస్తూంటారు. అమరావతిలో ఆకాశాన్నంటేలా అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేస్తామని, ఆయన బాటలోనే నడుస్తామని ఆర్భాటాలు చేసేస్తారు. తీరా చూస్తే వల్లె వేస్తున్న ఆదర్శాలకు భిన్నంగా చంద్రబాబు ఆచరణ ఉంటోంది. అదే బాటలో ఆయన పార్టీ నాయకులు కూడా నడుస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులుగా ఉన్నారన్న కారణంతో ఓ కుటుంబంపై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా సామాజిక బహిష్కరణ అమలు చేస్తున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురం పట్టణంలోనే ఈ దుర్మార్గానికి బరితెగించారు.

తూర్పుగోదావరి, అమలాపురం టౌన్‌: విశ్రాంత బ్యాంక్‌ అధికారి అయిన టి.పల్లేశ్వరరావు, భార్య లలితాకుమారి, పిల్లలతో కలిసి అమలాపురం దుడ్డివారి అగ్రహారంలో నివసిస్తున్నారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులైన ఆ కుటుంబ సభ్యులపై స్థానిక టీడీపీ నేతలు కొందరు రాజకీయంగా కక్ష కట్టారు. వివక్ష చూపడం మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలో ఎక్కువమంది టీడీపీ వారే ఉండడంతో క్రమంగా ఆ కుటుంబంపై సామాజిక బహిష్కరణ మొదలుపెట్టారు. వారితో చుట్టుపక్కల వారు మాట్లాడరు. ఒకవేళ వీరు మాట్లాడేందుకు ప్రయత్నించిన ముఖం తిప్పుకొని వెళ్లిపోతారే తప్ప పట్టించుకోరు. మంచికీ చెడ్డకీ దేనికీ వారిని పిలవరు. 2014 ఎన్నికల ముందు రగిలిన ఈ ‘వెలి’ కాష్టం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తేవడంతో అధికారులు కూడా ఆ కుటుంబం పట్ల సహాయ నిరాకరణ ధోరణి చూపారు. ఫలితంగా సాంఘిక వెలితో ఆ కుటుంబం ఐదేళ్లుగా అవస్థలు  పడుతూనే ఉంది. మధ్యలో జిల్లా అధికార యంత్రాంగానికి, అమలాపురం ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌ వంటి అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నా ఫలితం లేకపోయింది. మొత్తం పల్లేశ్వరరావు కుటుంబ సభ్యులందరూ సాంఘిక వెలి బాధితులే.

పోలీసు రక్షణతో ఓటు హక్కు వినియోగం
సాంఘిక వెలితో అవస్థలు పడుతున్న లలితాకుమారి కుటుంబ సభ్యులు ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసుకోవడమెలా అన్నదానిపై కూడా ఆందోళన చెందారు. తమను ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసుకోనివ్వరని.. వైఎస్సార్‌ సీపీకే ఓట్లు వేస్తామన్న ఉద్దేశంతో తమను అడ్డుకుంటారని భావించారు. దీంతో ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కుటుంబ సభ్యులు స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎక్కాకు లలితకుమారి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఎక్కా ఆ కుటుంబ సభ్యులతో చర్చించారు. వారి భయాన్ని చూసి, వారి అభియోగాన్ని విన్న ఎక్కా.. ఆ కుటుంబ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ కుటుంబ సభ్యులను పోలింగ్‌ బూత్‌కు పోలీసు బందోబస్తు నడుమ తీసుకువెళ్లి, ఓట్లు వేసిన తరువాత తిరిగి బందోబస్తుతో ఇంటి వద్ద విడిచిపెట్టాలని పట్టణ సీఐ రజనీకుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ఆ కుటుంబ సభ్యులను ఎన్నికల రోజున పోలీసు బందోబస్తు నడుమ తీసుకు వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పించారు.

విముక్తి ఎప్పుడో..!
ఈ ఘటనతోనై ఇకపై ఆ కుటుంబానికి సాంఘిక వెలి నుంచి విముక్తి లభిస్తుందా? అనే ప్రశ్నకు ఇంకా పూర్తిస్థాయి సమాధానం దొరకడం లేదని ఫిర్యాదీ, బాధితురాలు లలితాకుమారి అన్నారు. గతంలో ఓ పని మీద మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్తే అక్కడి అధికారులు, సిబ్బంది సహాయ నిరాకరణ చేశారని, ఏవిధంగానూ స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెప్పుకొంటున్న ఈ రోజుల్లో కూడా సాంఘిక వెలి అంటూ ఓ కుటుంబం సమాజంలో స్వేచ్ఛగా బతికే హక్కును కొందరు టీడీపీ నేతలు హరించడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు