పచ్చటి నంద్యాలకు.. రక్తపు మరకలు

16 Aug, 2017 02:16 IST|Sakshi
పచ్చటి నంద్యాలకు.. రక్తపు మరకలు

ప్రశాంతతకు నెలవైన ప్రాంతంలో అలజడి
మూడేళ్లుగా అదుపు తప్పిన శాంతిభద్రతలు
‘ఆళ్లగడ్డ రాజకీయం’ అరువొస్తోందా?
భయాందోళన చెందుతున్న ప్రజలు


నంద్యాల: నంద్యాల.. ప్రశాంతతకు మారుపేరు. పచ్చదనానికి చిరునామా. కోనసీమను తలపించే వాతావరణం. పైరుగాలులతో పరవశించే పల్లెలు..వ్యాపారాలు, విద్యాసంస్థలతో కళకళలాడే పట్టణం. ఇదంతా 2014 ఎన్నికలకు ముందు మాట. నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నంద్యాలలో అలజడి రేగుతోంది. గొడవలు, బ్లాక్‌ మెయిలింగ్, బెదిరింపులు రాజకీయాలు, హత్యాయత్నాలు క్రమేణా పెరిగిపోతున్నాయి. ఇలాంటివి నంద్యాల ప్రజలు గతంలో ఎన్నడూ చూసి ఎరుగరు. ఆళ్లగడ్డ నాయకులు నంద్యాల వాకిట్లో అడుగుపెట్టడంతో ఇక్కడి పరిస్థితులు ఆందోళనకరంగా తయారయ్యాయని ప్రజలు అంటున్నారు. దీనికంతటికీ ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీయేనని మండిపడుతున్నారు.

 నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ ఓటు కూడా లేని ఆళ్లగడ్డకు చెందిన భూమా బ్రహ్మానందరెడ్డిని తన అభ్యర్థిగా బరిలోకి దించింది. దీంతో నియోజకవర్గంలో అలజడి ఎక్కువైంది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా  తీసుకున్న సీఎం చంద్రబాబు ఇక్కడి ప్రజలను భయపెట్టి గెలిచేందుకు మంత్రులను, ఎమ్మెల్యేలను, ఇతర కీలక నేతలను నంద్యాలలోనే తిష్ట వేయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలను చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దివంగత ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు గతంలో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి రెండు సార్లు పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ప్రధాన మంత్రిగా ఉన్నారు. అయినా ఎవరి ప్రచారం వారు చేసుకున్నారే తప్ప ఎలాంటి గొడవలు, ఘర్షణలు, అధికార దుర్వినియోగం వంటివి లేవు.

ఒక్క చిన్న కేసు కూడా నమోదు కాలేదంటే ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఈ ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. టీడీపీ నాయకులు పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని  ఓటర్లను భయపెట్టి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే ప్రలోభాలకు తెరలేపారు. నోటిఫికేషన్‌ వచ్చాక బెదిరింపులూ మొదలుపెట్టారు. ప్రశాంత  జీవనం సాగిస్తున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, నాయకుల ఇళ్లలో అర్ధరాత్రి సమయాల్లో పోలీసులతో సోదాలు చేయించారు.

 ఇళ్లలో మారణాయుధాలు, డబ్బులు ఉన్నాయంటూ పోలీసులు హల్‌చల్‌ చేసి..వారిని భయభ్రాంతులకు గురిచేశారు. ఇంతటితో ఆగకుండా కేసులు పెట్టించడం, తలలు పగలగొట్టడం, హత్యలు చేయడానికి సైతం వెనుకాడకపోవడం వంటి సంఘటనలతో నంద్యాల ఉలిక్కి పడుతోంది. పట్టణంలో 40వేల మంది ఆర్యవైశ్యులు, 68వేల మంది ముస్లింలు కేవలం వ్యాపారాలనే నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో సైతం ప్రస్తుతం భయాందోళనలు మొదలయ్యాయి. ఎన్నికల్లో ఓడిపోతే ‘మీ అంతు చూస్తామం’టూ టీడీపీ నేతలు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఆళ్లగడ్డ నాయకులు నంద్యాలకు ఎందుకు వచ్చార్రా బాబూ.. మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారం’టూ వారు వాపోతున్నారు.   
 

మరిన్ని వార్తలు