పరారీలో ఉన్న టీడీపీ నాయకులు

20 Aug, 2019 07:37 IST|Sakshi
యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, యినుగంటి సత్యనారాయణ 

 పోలీసులకు చిక్కని యనమల కృష్ణుడు, పోల్నాటి, యినుగంటి

ఎలాగైనా అరెస్టు చేసి తీరుతామంటున్న పోలీసులు

సాక్షి, తుని(తూర్పుగోదావరి) : రాజ్యాంగేతర శక్తిగా అవతరించి దౌర్జన్యాలు చేయడంలో టీడీపీ నాయకులు దిట్ట. అన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ్ముడు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ యనమల కృష్ణుడు, ఆయన ఆసరా చూసుకుని ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్‌ పోల్నాటి శేషగిరిరావు, అధినాయకుల ప్రాపకం పొందేందుకు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యినుగంటి సత్యనారాయణ అధికార బలంతో చేసిన అరాచకాలు నియోజకవర్గంలో ప్రజలందరికి తెలిసిందే. అధికారంలో ఉండగా తొండంగి మండలంలో మామూళ్లు ఇవ్వనందుకు హేచరీలపై దాడులకు పురిగొల్పిన యనమల కృష్ణుడు, ఇప్పుడు అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేసి ప్రతిపక్షంలో ఉన్నా తమదే పైచేయి అని నిరూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

అన్న క్యాంటీన్‌ అద్దాలను ధ్వంసం చేయడంపై మున్సిపల్‌ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దౌర్జన్యకాండకు కారుకులైన ఈ ముగ్గురూ (యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, యినుగంటి సత్యనారాయణ), దిబ్బ శ్రీను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయారు. మరుసటి రోజు దిబ్బ శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ముగ్గురూ పరారీలో ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

1984 నుంచి యనమల రామకృష్ణుడు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ కీలక పదవులు చేపట్టగా ఆ హోదాను యనమల కృష్ణుడు అనుభవించారు. తమను అడ్డుకునే శక్తివంతులు లేరని రెచ్చిపోయిన కృష్ణుడు, అతడి సన్నిహితులు శేషగిరిరావు, సత్యనారాయణ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పరారైనట్టు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం అధికారం లేకపోవడంతో పాటు ప్రజలకు అండగా నిలిచి ఢీకొనేందుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా ఉండడంతో అధికారుల్లోను, ప్రజల్లో ధైర్యం నెలకొంది. ఇన్నాళ్లు తనపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికి లేదని, తన ఇంటి దరిదాపుల్లోకి పోలీసులు రాలేరన్న మొండితనంతో ఉన్న యనమల కృష్ణుడు, పోల్నాటి శేషగిరిరావు, యినుగంటి సత్యనారాయణలు ఇళ్లను వదిలి పరారవ్వడంపై నియోజకవర్గంలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏ అర్ధరాత్రి ఇళ్లకు వచ్చినా అరెస్టు చేసేందుకు పోలీసులు వారి ఇళ్ల వద్ద నిఘా ఉంచారు.

మరిన్ని వార్తలు