విశాఖ భూకుంభకోణంపై టీడీపీ త్రిసభ్య కమిటీ

16 Jun, 2017 02:09 IST|Sakshi

పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నిర్ణయం
టీడీపీ నుంచి ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సస్పెన్షన్‌


సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన విశాఖపట్నం భూకుంభకోణంపై విచారణకు పార్టీ పరంగా త్రిసభ్య కమిటీని నియమించాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ వ్యవహారంపై త్రిసభ్య కమిటీ విచారణ జరిపి, తనకు నివేదిక ఇçస్తుందని ఆయన చెప్పారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గురువారం జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా విశాఖపట్నం భూకుంభకోణంపై చర్చించినట్లు తెలిసింది. మంత్రులు, అధికారులు ఎవరికి వారు ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడం వల్ల ఇబ్బంది ఏర్పడినట్లు చంద్రబాబు అన్నారు.

 విషయం తెలుసుకోకుండానే లక్ష ఎకరాలు ట్యాంపరింగ్‌ జరిగినట్లు కలెక్టర్‌ చెప్పడం ఏమిటని ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి భూకబ్జా కేసులో అరెస్టయినా అతనిపై చర్యలు తీసుకోకపోవడం లేదంటూ బాబుపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపక్‌రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దీపక్‌రెడ్డిని పార్టీ నుంచి తప్పిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

మరిన్ని వార్తలు