మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ను దించేద్దాం!

22 Jun, 2017 09:36 IST|Sakshi
మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ను దించేద్దాం!

నంద్యాలలో టీడీపీ యత్నాలు
కార్పొరేటర్లను కొనేందుకు మంతనాలు
నేరుగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి
భారీగా తాయిలాలు, లొంగదీసుకునే ప్రయత్నాలు
ఉప ఎన్నికల కోసం అధికార పార్టీ బరితెగింపు


సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల బరిలో పరువు నిలుపుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీని వీడటంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. శిల్పాతోపాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దేశం సులోచన, అత్యధిక మంది కార్పొరేటర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో నంద్యాల మునిసిపాలిటీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగిరింది. ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్‌ సులోచనను తొలగించేందుకు టీడీపీ పావులు కదపడం ప్రారంభించింది. వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభపెట్టి తిరిగి టీడీపీలోకి చేర్చుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. కానీ అధికార పార్టీ తాయిలాలకు లొంగితే తమకు రాజకీయ భవిష్యత్‌ ఉండదని పలువురు కార్పొరేటర్లు పేర్కొంటున్నట్టు సమాచారం.

భారీగా తాయిలాలు
నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డితో రాజీనామా చేయించకుండానే పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా వలసలను ప్రారంభించిన సీఎంకు అక్కడి నుంచే గట్టి షాక్‌ తగిలింది. మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డితోపాటు 25 మంది కార్పొరేటర్లు వైఎస్‌ఆర్‌సీపీ జెండా కప్పుకోవడం టీడీపీకి ఏ మాత్రమూ మింగుడుపడటం లేదు. మునిసిపాలిటీలో వైఎస్‌ఆర్‌సీపీ హవా సాగితే ఉప ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తగులుతుందనేది అధికార పార్టీకి ఆందోళనగా ఉంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు భారీగా తాయిలాలు ఇచ్చి నయానో, భయానో లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం నేరుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నంద్యాలలో ఉండి ప్రణాళికలు రచించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మాజీ మంత్రి ఫరూఖ్‌కు ఎటువంటి పదవి ఇవ్వకపోవడంతో పాటు మంత్రివర్గంలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడంపై ముస్లిం వర్గంలో వ్యతిరేకత నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఫరూఖ్‌ను మండలి చైర్మన్‌ను చేయాలని ఇఫ్తార్‌ విందు సాక్షిగా సీఎం వద్ద పలువురు నినదించారు. అయినా ఆయన నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వారంతా నిరాశకు గురయ్యారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ ఏకపక్షంగా వ్యవహరిస్తూ... సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలల్లో ఎక్కడా ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి ఫోటో వేయకపోవడం మరింత అగ్గి రాజేసింది. దీంతో ఇరువర్గాల నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయి కలిసి ఎన్నికల్లో పనిచేసే పరిస్థితి లేదు. ఈ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకే అధికారపార్టీ కార్పొరేటర్ల భారీ కొనుగోళ్లకు తెరలేపినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు