తుళ్లూరులో టీడీపీ దౌర్జన్యం

22 Nov, 2014 02:39 IST|Sakshi
తుళ్లూరులో టీడీపీ దౌర్జన్యం

గుంటూరు: రాజధాని భూసేకరణ వ్యవహారంలో అధికార తెలుగుదేశంపార్టీ దాడులకు తెగబడుతోంది. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంకాదని, భూసమీకరణలో నష్టపోతున్న వారికి అండగా ఉండేందుకే  సభ నిర్వహిస్తున్నామని చెబుతున్నా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సహించలేకపోతున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, నాయకులు... నిన్న సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ నాయకులు... నేడు వామపక్షాల నాయకులపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. రాజధానికి భూసమీకరణలో నష్టపోతున్న రైతులు, రైతుకూలీలు, కౌలురైతులకు సంబంధించిన అంశాలపై పది వామపక్షాల ప్రతినిధులు శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరులో నిర్వహించిన బహిరంగసభను అక్కడి టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యూహాత్మకంగా అడ్డుకున్నారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయినా సభను నిర్వహిస్తుండటంతో ఓర్చుకోలేని కార్యకర్తలు సభావేదికపై ఉన్న నాయకుల వద్దకు దూసుకువచ్చారు. చంద్రబాబునాయుడు జిందాబాద్, టీడీపీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు.
 
 దీంతో వామపక్షాల నాయకులు సైతం ప్రతిఘటించారు. ఇరువర్గాలు పరస్పరం ఒకరినొకరు తోపులాటకు దిగారు. అప్పటివరకు అక్కడే ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు కనిపించకుండా పోయారు. గొడవ పెద్దది కావడంతో ఎస్‌ఐతో పాటు మరికొద్దిమంది పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి తరిమివేశారు. దీంతో వామపక్షాల నాయకులు మధ్యలోనే సభను ముగించి వెళ్లిపోయారు. మరోవైపు  తుళ్లూరులో ఇతర పార్టీ నాయకులపై వరుసగా దాడులు జరుగుతున్నా పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు. అయితే సభను నిర్వహణపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, ముందస్తు అనుమతి సైతం తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విల్స న్, వామపక్షాల నాయకులు కోటయ్య, హరనాధ్, రమాదేవి, తూమాటి శివయ్య, గుర్రం విజయ్‌కుమార్, సింహాద్రి లక్ష్మ య్య, తదితరులు పాల్గొన్నారు. సభలో ఎవరేమన్నారంటే...
 
 రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ఎందుకు?: రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
 ఆంధ్రప్రదే శ్ నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారత ప్రధాని వద్దకు వెళ్ళాలా? లేక సింగపూర్ ప్రధాని వద్దకు వెళ్లాలా? రాజధాని నిర్మాణానికి నిధులకోసం ఇప్పటివరకు భారత ప్రధానిని కలవని చంద్రబాబు సింగపూర్ ప్రధానిని ఎందుకు కలిశారో ప్రజలకు చెప్పాలి. ఇక్కడి రైతుల నుంచి 30వేల ఎకరాలు భూమి తీసుకొని అందులో ఆరువేల ఎకరాలు సింగపూర్ సంస్థలకు దోచిపెట్టాలన్నదే ఆయన ప్రయత్నం. తుళ్లూరులో రాజధానికి మేము వ్యతిరేకం కాదు. రాజధానికి భూములు కోల్పోతున్న రైతులు, రైతుకూలీల సమస్యలను పరిష్కరించాలన్నదే మా డిమాండ్. ప్రపంచంలో ఎక్కడా 30వేల ఎకరాల్లో రాజధాని నిర్మించిన దాఖలాలు లేవు.
 
 చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మడంలేదు: మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
 చంద్రబాబు రాజధానికి భూములు ఇచ్చే రైతులకు ప్రత్యామ్నాయంగా భూములు ఇస్తామంటున్నా ఆయన మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. రుణమాఫీ చేస్తామని మాటతప్పిన బాబును ఎవరు నమ్ముతారు? తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులు 1100 మంది ఉన్నారు. అలాగే 12వేల మంది వ్యవసాయరైతులు, 40వేల మంది కూలీలు, అరఎకరం ఉన్నవారు 20శాతం మంది ఉన్నారు. రాజధాని నిర్మించే 25 గ్రామాల్లో 1.50 లక్షల మంది దళితులు, గిరిజనులు ఉన్నారు. వీరందరికి భూసేకరణ చట్టం ప్రకారం రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి. రైతులు, ైరె తుకూలీలు, కౌలురైతుల హక్కులను పరిరక్షించేందుకు మేము పోరాటం చేస్తుంటే సహించలేని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇలా దౌర్జన్యం చేస్తున్నారు. తీరు మార్చుకోకుంటే ప్రజలు బుద్ధి చెబుతారు. మేము మళ్లీ వస్తాం, మరోసారి ఇక్కడే సభ నిర్వహిస్తాం.
 
 టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం సరికాదు:
 నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతువిభాగం అధ్యక్షుడు
 రాజధానికి భూసమీకరణ చేస్తున్న గ్రామాల్లో రైతులు, రైతుకూలీలు, కౌలురైతుల హక్కులను కాపాడేందుకు వివిధ పక్షాలు చేస్తున్న ప్రయత్నాలను, సభలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడం సబబుకాదు. భూసమీకరణతో నష్టపోతున్నవారి హక్కులను కాపాడేందుకు, వారికి జరిగే నష్టాలపై అవగాహన కల్పించడం విపక్షాల బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్చగా భావాలను వె ల్లడించే హక్కు ఉంది. మరోసారి ఇటువంటి దౌర్జన్యాలకు దిగితే వారికి ప్రజలు తగిన విధంగా బుధ్ధిచెబుతారు.

>
మరిన్ని వార్తలు