నెల్లూరులో.. టీడీపీ వర్సెస్‌ విష్ణు

5 Apr, 2019 15:55 IST|Sakshi

విష్ణువర్ధన్‌రెడ్డి ధోరణిపై రగులుతున్న టీడీపీ శ్రేణులు

కావలి టీడీపీలో తారస్థాయికి చేరిన గందరగోళం

టీడీపీ శ్రేణులపై విష్ణు గ్యాంగ్‌ నిఘా

కుమ్ములాటలో బీద, కాటంరెడ్డి వర్గాలు

కావలి: కావలి టీడీపీలో గందరగోళం నెలకొంది. కొత్త, పాత నేతల మధ్య కుదరని సఖ్యతతో రోజుకో వివాదం, పూటకో పంచాయతీ, సర్దుబాట్లతో తెలుగుతమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలకు, ప్రస్తుత కావలి అసెంబ్లీ అభ్యర్థి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డికి మధ్య వ్యవహారం చెడింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులతోపాటు ఇప్పటివరకు కావలి ఇన్‌చార్జ్‌గా ఉన్న బీద మస్తాన్‌రావుకు సన్నిహితులైన నాయకులను కనీసం మనుషులుగా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్న కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి కోసం పనిచేయడం అంటే ఆత్మాభిమానం చంపుకోవాల్సిన దుస్థితి అని టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు.

2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డి గెలిస్తే కావలిని తిప్ప దొంగలు పరిపాలన చేస్తారని, కావలి ప్రజలు నిద్రపోయే పరిస్థితి ఉండదని, కావలిని దొంగలు రాజ్యమేలుతారని తామే ప్రచారం చేశామని, ఇప్పుడు ఆయనకు ఓట్లేయాలని చెబుతుంటే ప్రజలే ఆనాడు తాము చెప్పిన అంశాలను గుర్తుచేస్తున్నారని, ఇది ప్రచారంలో ఇబ్బందిగా ఉందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. అందుకు తార్కాణం విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ట్రంక్‌రోడ్డులో ఉన్న వ్యాపారవర్గాల ప్రతినిధులు ఒక్కరు కూడా కనీసం పలకరించడానికి రాలేదని టీడీపీ నాయకులు గుర్తుచేస్తున్నారు.

అదే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసే సందర్భంలో జరిగిన ర్యాలీలో ట్రంక్‌రోడ్డులోని వ్యాపారవర్గాల ప్రతినిధులు కిక్కిరిసిన జనాల రద్దీ నడుమ ఆయనను సత్కరించారని కూడా గుర్తుచేస్తున్నారు. ఈ తేడా చాలని కావలి ప్రజల ఆదరణ ఎవరికి ఉందనే విషయం తేటతెల్లం చేస్తోందని టీడీపీ నాయకులు చెబుతుండడం గమనార్హం.

అల్లూరులో అధికారపార్టీ రౌడీయిజం 
ఎన్నికల ప్రచారం సీరియస్‌గా జరుగుతున్న నేపథ్యంలో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి వర్గం, ఆయన కుమారుడు, వేర్వేరుగా వైఎస్సార్‌సీపీ నాయకులపై రౌడీయిజం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వైఎస్సార్‌సీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించడం, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజలను భయకంపితులను చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ప్రజల్లోకి వెళ్లిపోయిందని, ప్రచారంలో ప్రజలు ఈ అంశాలపైనే తమను ప్రశ్నిస్తున్నారని టీడీపీ నాయకులే చర్చించుకుంటున్నారు.

ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సౌమ్యుడు అనే సానుకూలత ప్రజల్లో బలంగా ఉన్న నేపథ్యంలో.. ‘నా సంగతి ఎమ్మెల్యేకు పూర్తిగా తెలియదు, నేనేందో చూపిస్తా ఎమ్మెల్యేకు’.. అంటూ సాక్షాత్తూ మీడియా ముందే విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించడాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారని టీడీపీ శ్రేణులు చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రచారంలో పాల్గొంటున్న వారికి భోజనాల విషయంలో కూడా అభ్యర్థి మనుషులు చులకనగా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థి అనుచరుల తీరు, పార్టీ క్యాడర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకు నిరసనగా బుధవారం నుంచి భోజనాలు పెట్టే పథకాన్ని రద్దు చేశారు. అలాగే ఎన్నికల ప్రచారం, ఇతరత్రా అంశాల విషయంలో టీడీపీ నాయకులతోపాటు ప్రాంతాల వారీగా విష్ణువర్ధన్‌రెడ్డికి చెందిన వ్యక్తులు కూడా పరిశీలన నిమిత్తం నియమించాలనే అంశాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేపోతున్నారు. తమపై నిఘా పెట్టి ఎన్నికల ప్రచారం తమను చేయమనడం ఏమిటని, అంతగా తమ పట్ల నమ్మకం లేకపోతే అసలు తమ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ టీడీపీ జిల్లా అధ్యక్షుడైన బీద రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లి చర్చించి, తాము తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. 

whatsapp channel

మరిన్ని వార్తలు