బెడిసిన వ్యూహం

8 Aug, 2017 00:55 IST|Sakshi
బెడిసిన వ్యూహం
నంద్యాల వేదికగా టీడీపీ విష ప్రచారం
- వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి నామినేషన్‌ చెల్లదంటూ అధికార పార్టీ నానా యాగీ 
ఎన్ని చేసినా.. శిల్పా నామినేషన్‌కు రిటర్నింగ్‌ అధికారి గ్రీన్‌ సిగ్నల్‌
 
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించడం అసాధ్యమనే అభిప్రాయానికి వచ్చిన అధికార టీడీపీ నేతలు తాజాగా మైండ్‌ గేమ్‌కు తెర లేపారు. కుంటి సాకులు చూపి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని నానా యాగీ చేశారు. ఆ విషయానికి అనుకూల మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం కల్పించి స్థానిక ప్రజలను తికమక పెట్టేందుకు శాయశక్తులా యత్నించారు. ఎట్టకేలకు శిల్పా నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఆమోదించడంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు.

తిరిగి పాత ఆరోపణలే వల్లె వేస్తూ చేజారిపోతున్న ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. మొత్తానికి సోమవారం కర్నూలు జిల్లా నంద్యాల్లో టీడీపీ నేతలు సాగించిన హైడ్రామా బెడిసికొట్టింది. నాలుగు రోజుల క్రితం నంద్యాలలో ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సభ జరిగినప్పటి నుంచీ అధికార పార్టీకి ఓటమి భయం వెంటాడుతోంది. ఈ సభకు భారీగా జనం స్వచ్ఛందంగా హాజరు కావడం టీడీపీ నేతలను కలవరపాటుకు గురి చేసింది. నంద్యాలను జిల్లా చేయడంతో పాటు వ్యవసాయ వర్సిటీ, మోడల్‌ సిటీ, ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ వంటి హామీలతో జగన్‌ స్థానికులను ఆకట్టుకున్నారు.

ఈ సభ అనంతరం ఎవరిని గెలిపించాలనే విషయంలో నంద్యాల ప్రజలు ఒక క్లారిటీకి వచ్చారు. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రసంగంలోని అసలు అంశాలు చర్చకు రాకుండా అధికార పార్టీ నేతలు చవకబారు విమర్శలకు దిగారు. నంద్యాల ఓటర్ల మనసు మార్చడం వీలుకాదని భావించి చవకబారు ఎత్తుగడకు తెర తీశారు. ఇందులో భాగంగా శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ చెల్లదనే ప్రచారానికి పూనుకున్నారు. ఇందుకోసం అందరికీ సులభంగా అర్థం కాని సాంకేతిక అంశాలను ఎన్నుకుని.. అనుకూల మీడియా ద్వారా ఆ అంశానికి ప్రచారం కల్పిస్తూ ప్రజల్లో.. ప్రత్యేకించి నంద్యాల ఓటర్లను అయోమయా నికి గురిచేసేందుకు బరిలోకి దిగారు.

శిల్పా అఫిడవిట్‌పై సంతకం పెట్టిన న్యాయవాదికి నోటరీ అనుమతి లేదంటూ జిల్లా రిజిస్ట్రార్‌ నుంచి తెచ్చిన లేఖను విడుదల చేశారు. అనుబంధ నామినేషన్‌కు సరైన స్టాంపు పేపర్లు జత చేయలేదంటూ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. తుదకు నిబంధనల మేరకు శిల్పా నామినేషన్‌ ఉందంటూ రిటర్నింగ్‌ అధికారి ప్రకటించే వరకు ఈ వ్యతిరేక ప్రచారం కొనసాగింది. నామినేషన్ల పరిశీలన సందర్భంగా టీడీపీ హైడ్రామా వ్యవహారాన్ని చూసి స్థానికులు ముక్కున వేలు వేసుకున్నారు. 
 
టీడీపీ నేతలు ఇలా చేశారు..
జగన్‌ సభ నుంచి దృష్టి మళ్లించేందుకు మూడు రోజులుగా చేస్తున్న ప్రచారాన్ని నాలుగో రోజు టీడీపీ మరింత ఉధృతం చేసింది. సోమవారం మధ్యాహ్నం హడావుడిగా జిల్లా రిజిస్ట్రార్‌ నుంచి అధికార పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మా నందరెడ్డి పేరు మీద ఒక లెటర్‌ తెప్పించారు. శిల్పా మోహన్‌ రెడ్డి అఫిడవిట్లపై సంతకం చేసి న తులసిరెడ్డి నోటరీ కాదని ధ్రువీకరిస్తూ జిల్లా రిజిస్ట్రార్‌ లేఖ ఇచ్చారని రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఇదే లెటర్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి, శిల్పా మోహన్‌ రెడ్డి నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యిందంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి దిగారు. 
 
నోటరీ చట్టం ప్రకారం వాస్తవం ఇదీ..
రాష్ట్రంలో 2013 తర్వాత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఉత్తర్వులు ఇచ్చి ఏ నోటరీ కాలాన్ని పొడిగించలేదు. దీంతో కొద్ది మంది న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించి తమ నోటరీ కాలాన్ని పొడిగించుకున్నారు. మరికొందరు నోటరీని పొడిగించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. నోటరీ చట్టం ప్రకారం తమ నోటరీ కాల పరిమితి ముగిసినప్పటికీ రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే సదరు న్యాయవాది నోటరీ అమల్లో ఉన్నట్టేనని చెబుతోంది. ఈ ప్రకారం తులసిరెడ్డి నోటరీగా కొనసాగుతున్నట్లేనని స్పష్టమవుతోంది. 
 
ఎన్నికల సంఘం నిబంధనల మేరకు....
నోటరీ అయిన న్యాయవాది సంతకం చేయనం త మాత్రాన నామినేషన్‌ను తిరస్కరించే అవకాశం లేదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నాయి. నియామవళిలోని సెక్షన్‌ 6.10 ప్రకారం.. సదరు వ్యక్తి పోటీకి అనర్హుడైతేనో, అఫిడవిట్‌ను సదరు అభ్యర్థి నింపకపోతోనో, నామినేషన్‌ పేపరుపై అభ్యర్థి సంతకం చేయకపోతేనో, పేర్కొన్న డిపాజిట్‌ చెల్లించకపోతేనో వంటి కారణాలతో నామినేషన్‌ను తిరస్కరించే అధికారం రిటర్నింగ్‌ అధికారికి ఉంది.