ఎన్నికల కోడ్‌కు ‘సైకిల్‌’ తూట్లు

13 Mar, 2019 15:37 IST|Sakshi

కోడ్‌ ఉల్లంఘిస్తూ బాలికలకు సైకిళ్ల పంపిణీ

 టీడీపీ నేతల అధికార దుర్వినియోగం 

సాక్షి, కశింకోట (అనకాపల్లి) : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తరుణంలో ప్రభుత్వం యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘిస్తోంది. ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చాక ప్రభుత్వ స్కూళ్లలో చదివే బాలికలకు బడికొస్తా పథకంలో సైకిళ్లను పంపిణీ చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని ప్రభుత్వ హైస్కూళ్లు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలో చదువుతున్న 8,9 తరగతుల బాలికలకు ‘బడికొస్తా’ పథకం కింద ప్రభుత్వం 866 సైకిళ్లు  మంజూరు చేసింది.

వీటి పంపిణీ కార్యక్రమాన్ని గత నెలలో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ నామమాత్రంగా ప్రారంభించారు. ఆ తర్వాత వాటి పంపిణీ గురించి పట్టించుకోలేదు. తాజాగా ఆయా సైకిళ్లను లబ్దిదారులకు పంపిణీ చేయడానికి మంగళవారం ఆటో, ట్రాక్టర్లలో నిర్దేశిత స్కూళ్లకు తరలించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అధికార టీడీపీ ఇప్పుడు సైకిళ్ల పంపిణీతో ప్రలోభాలకు గురిచేస్తూ కోడ్‌ ఉల్లంఘిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

కోడ్‌ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న అధికార పార్టీ నేతలు, యంత్రాంగంపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు మంగళవారం డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి  ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని విమర్శించారు. తక్షణం అధికా ర పార్టీ దీనికి స్వస్తి చెప్పకపోతే ఆందోళన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి లగిశెట్టి గణేష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కరక శేషు పాల్గొన్నారు.

గత నెలలోనే పంపిణీ : ఎంఈవో
మండల విద్యా శాఖ అధికారి కె.మధుసూదనరావును ఈ విషయమై సాక్షి సంప్రదించగా గత నెలలో ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ కశింకోటలో ఈ పథకం ప్రారంభించాక 50 సైకిళ్ల వరకు పంపిణీ చేశామన్నారు. మిగిలిన సైకిళ్లు అసెంబ్లింగ్‌ పూర్తి కావడంతో తాజా వాటిని ఆ యా స్కూళ్లకు పంపిస్తున్నామని, దీనిలో ఎన్నిక ల నిబంధనల ఉల్లంఘించడం లేదని అన్నారు.
   

మరిన్ని వార్తలు