ఇక పోరు బాటే

1 Aug, 2014 00:13 IST|Sakshi
ఇక పోరు బాటే

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఓ వైపు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేస్తూనే మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల్లో మనోధైర్యం నింపేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి అన్ని వర్గాలను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
 గుంటూరులోని బండ్లమూడి గార్డెన్స్‌లో మండపంలో గురువారం ఉదయం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. తొలుత అధినేత చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తిని నింపింది.
 
 స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో పార్టీ అధికారాన్ని కోల్పోయిందని, చంద్రబాబు కూటమికి, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య వ్యత్యాసం 5.60 లక్షల ఓట్లేనని, రాష్ట్ర స్థాయిలో ఇది పెద్ద సంఖ్య కాదని తెలిపారు.
 
 కడప ఉప ఎన్నికల సమయంలో తనకు 5.40 లక్షల ఓట్ల మెజార్టీ వచ్చిందని జగన్ పేర్కొంటూ కార్యకర్తల్లో నైరాశ్యాన్ని తొలగించే ప్రయత్నం చేశారు.ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి రైతులు, నిరుద్యోగులు, డ్వాక్రా గ్రూపులను చంద్రబాబు మోసం చేస్తున్నారని, ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. పార్టీని వార్డు స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు మీ అందరి సహకారం కావాలని జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ సీపీ శ్రేణులను కోరారు.
 
 కొందరు సీనియర్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్‌కు మద్దతుగా నిలిచామని, తుదిశ్వాస విడిచే వరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే ఉంటామని ప్రతిన బూనారు.

అబ్రహం లింకన్ 13 సార్లు ఓటమి పాలైన తరువాత అధికారంలోకి వచ్చారని, భవిష్యత్ అంతా మనదేనంటూ ఓ కార్యకర్త మాట్లాడగా, మరికొందరు కార్యకర్తలు బీజేపీ సోషల్ మీడియాను ఉపయోగించుకుని లబ్ధి పొందిందని చెబుతూ, అధికార పార్టీ వేధింపులను నిలువరించేందుకు మండల స్థాయిలో న్యాయవాదులను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇటువంటి సమీక్షలు తరచూ ఏర్పాటు చేస్తూ కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉండాలని కోరారు. ఈ సందర్భంగా కార్యకర్తలను జగన్ పేరుపేరున ఆప్యాయంగా పలకరించడం వారిలో సంతోషాన్ని నింపింది.
 
 గుంటూరు తూర్పు,
 పశ్చిమ నియోజకవర్గాలపై సమీక్ష
 తొలుత  ఈ రెండు నియోజకవర్గాలపై జగన్ సమీక్ష ప్రారంభించారు.  ఎమ్మెల్యే ముస్తఫా డివిజన్ కన్వీనర్లను కలుపుకుని పనిచేయాలని కార్యకర్తలు సూచించారు. మైనార్టీ నాయకుడు చాంద్‌బాషా మాట్లాడుతూ అంతా కలిసి పనిచేస్తే రానున్న నగరపాలక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుస్తుందని తెలిపారు.
 
 పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కష్టపడినంతగా ద్వితీయ శ్రేణినాయకులు పనిచేయలేదనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేశారు. 2014 ఓటర్లలో యువతీ, యువకులు అధికంగా ఉన్నారని, వారిని వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని పట్టాభిపురానికి చెందిన కార్యకర్త రఘు తెలిపారు.
 
 ప్రత్తిపాడు, తాడికొండ
 నియోజకవర్గాల సమీక్ష..
 ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి లోతైన సమీక్ష చేశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి మేకతోటి సుచరిత సమీక్షకు హాజరుకాకపోవడం పట్ల కొందరు కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
 అయితే పార్టీ కష్టకాలంలో సుచరిత మద్దతుగా నిలిచారని, ఉప ఎన్నికల్లో పోటీ చేసి తన నిబద్ధత చాటుకున్నారని, ఓటమి షాక్ నుంచి ఇంకా ఆమె తేరుకోలేదని జగన్ నచ్చచెప్పారు. ఈ సందర్భంగానే కొందరు కార్యకర్తలు సుచరితకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు. ఈ రెండు నియోజక వర్గాల్లో వెన్నుపోటు పొడిచారని కొందరు నాయకులపై కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. వారిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు.
 
 మంత్రి ఎమ్మెల్యే రావెల కిషోర్ వేధింపులు ఎక్కువుగా ఉన్నాయని కార్యకర్తలు వివరించారు. తాడికొండ నియోజవకర్గ అభ్యర్థి క్రిస్టినా అన్ని గ్రామాల్లో ప్రచారం చేయలేక పోయారని కొందరు తెలిపారు. విద్యార్థి విభాగానికి చెందిన హరి అధికార పార్టీ వేధింపులు, కేసుల నుంచి కాపాడేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని సూచించారు.
 
 తెనాలి, పొన్నూరు నియోజకవర్గాలు..
 సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన పొన్నూరు నియోజకవర్గ సమీక్షలో  పెదకాకానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి మొసిన్యాదేవి  మా ట్లాడారు. మండలంలో టీడీపీ కంటే ఒక ఎంపీటీసీ స్థానాన్ని ఎక్కువగా వైఎస్సార్ సీపీ గెలుచుకున్నప్పటికీ ఇద్దరు ఎంపీటీసీలు టీడీపీకి అమ్ముడుపోవడం వల్ల తాను ఎంపీపీని కాలేకపోయానని, అమ్ముడుపోయి పార్టీకి నష్టం చేకూర్చిన వారిపై చర్యలు తీసుకోవాలని జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీని అడ్డుపెట్టుకుని ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానంటూ అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని తెలిపారు.
 
 తెనాలి నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో టీడీపీ నేతలు అల్లకల్లోలం సృష్టిస్తున్నారని, పోలీసులు సైతం ఎదురుకేసులుపెడుతున్నారని కార్యకర్తలు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు చివరినిముషం వరకూ టికెట్ ఇవ్వలేదని, ముందుగా ప్రకటించి ఉంటే గెలిపించుకునేవారమని కొందరు చెప్పారు.
 
 చంద్రబాబు ఇంటికో ఉద్యోగం, రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేస్తానంటూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, మీరు మాత్రం ఓటమి కి భయపడకండి, విశ్వసనీయతను వదలకండి ఇప్పటికే ప్రజలు నిజం తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీకే పట్టం కడతారంటూ కొందరు కార్యకర్తలు జగన్‌కు వివరించారు.
 
 రేపల్లె, వేమూరు నియోజకవర్గాలు
 అనంతరం 8 గంటలకు రేపల్లె, వేమూరు నియోజకవర్గాల సమీక్షా సమావేశం జరిగింది. గ్రామాల్లో టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారని, ఆదుకోవాలని కార్యకర్తలు జగన్‌ను కోరారు. నియోజకవర్గ లీగల్ సెల్ ఏర్పాటుచేసి ఉచిత న్యాయ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
 
 టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాగా ఏర్పడి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని జగన్‌ను కోరారు. మాజీ మంత్రి రేపల్లె అభ్యర్థి మోపిదేవి వెంకటరమణను 18 నెలలపాటు జైల్లో ఉంచడం వల్ల కార్యకర్తలకు అందుబాటులోకి రాలేక ఓటమి చెందాల్సి వచ్చిందని కొందరు చెప్పారు.
 
 వేమూరు నియోజకవర్గంలో మేరుగ నాగార్జునకు ద్వితీయ శ్రేణి నాయకులు సహకరించలేదని, కొందరు టీడీపీకి కోవర్టులుగా పనిచేయడం వల్లే ఓటమి చెందాల్సి వచ్చింది జగన్‌కు తెలిపారు.
 గ్రామాల్లో పార్టీ కార్యకర్తలపై జరిగే దాడులను ఖండిస్తూ జిల్లా స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చేలా చూడాలని జగన్‌ను కొందరు నాయకులు కోరారు. దీంతో స్పందించిన జగన్ జిల్లాలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఎమ్మెల్యేలు, అభ్యర్థులు, నాయకులు ఏకమై నిరసన తెలిపేలా కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
 
 సమీక్ష సమావేశాల్లో ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటన్ తలశిల రఘురాం, ఎంవీ మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ నాగిరెడ్డి, అంబటి రాంబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర నాయుడు, వల్లభనేని బాలశౌరి, ఆతుకూరి ఆంజనేయులు, అన్నాబత్తుని శివకుమార్, గుదిబండి చినవెంకటరెడ్డి, జంగా కృష్ణమూర్తి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, రావి రవీంద్రనాథ్, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డితోపాటు  మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్‌బాషా, ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ కరీముల్లా, నగర కన్వీనర్ మార్కెట్‌బాబు, సభ్యులు షేక్ సాదిక్, గౌస్‌మొహిద్దీన్, లీగల్ విభాగం జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, సేవాదళ్ జిల్లా కన్వీనర్ కొత్తా చిన్నపరెడ్డి, నగర కన్వీనర్ పల్లపు శివ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొట్టె కవిత, దళిత విభాగం జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు, నగర కన్వీనర్ యరమాల విజయ్‌కిషోర్, సభ్యులు ఎం. దేవరాజు, అత్తోట జోసఫ్, యువజన విభాగం ఐదు జిల్లాల కోఆర్డినేటర్ వనమా బాలవజ్రబాబు(డైమండ్), మహిళా విభాగం జిల్లా కన్వీనర్ దాది లక్ష్మీరాజ్యం, నగర అధ్యక్షురాలు నిమ్మరాజు శారదాలక్ష్మీ, దేవెళ్ల రేవతి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఉప్పుటూరి నర్సిరెడ్డి, నగర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర కమిటీ సభ్యుడు దర్శనపు శ్రీనివాస్, వాణిజ్య విభాగం నగర కన్వీనర్  మేడా సాంబశివరావు,  నాయకులు నసీర్‌అహ్మద్, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), నూనె ఉమామహేశ్వరరెడ్డి, గులాం రసూల్,  మిన్నకూరి శంకర్‌యాదవ్, ఏటూకూరి విజయసారధి, శిఖాబెనర్జీ, మాజీ డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, వీరారెడ్డి, జగన్‌కోటి, మెహామూద్, సూరగాని శ్రీనివాసరావు, కడియాల శ్రీనివాసరావు, గాంధీ, కారుమూరి అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు