ఆ ఆరు స్థానాల్లో టీడీపీ విజయం

25 May, 2019 07:26 IST|Sakshi
శ్రీకాకుళంలో పోలీసులకు వైఎస్సార్‌సీపీ నేతలకు మధ్య వాగ్వాదం

ఫలితం ఆలస్యమైన మూడు ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు టీడీపీ ఖాతాలోకి..  

ఎంపీలుగా రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని, గల్లా జయదేవ్‌  

ఎమ్మెల్యేలుగా గంటా శ్రీనివాసరావు, పయ్యావుల, ఏలూరి సాంబశివరావు  

సాక్షి నెట్‌వర్క్‌:  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెల్లడైన మూడు లోక్‌సభ, మూడు శాసనసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.  

శ్రీకాకుళం ఎంపీ ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ  
శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో ఈవీఎంల కంటే.. పోస్టల్‌ బ్యాలెట్, సర్వీసు ఓట్ల లెక్కింపు పెద్ద సవాల్‌గా మారింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి పోçస్టల్‌ బ్యాలెట్లు ఎక్కువగా పోలయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంటుకు సర్వీసు ఓట్లు, పోస్టల్‌ ఓట్లు కలిసి మొత్తం 21,276 ఓట్లు పోల్‌ కాగా.. వీటిలో 14,626 మాత్రమే లెక్కించారు. ఇందులో టీడీపీకి 5,324 ఓట్లు రాగా.. వైఎస్సార్‌సీపీకి 6,948 ఓట్లు వచ్చాయి. మిగిలిన 6,980 ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటిలో ఎక్కువ ఓట్లు వైఎస్సార్‌సీపీకి చెందినవి కావడంతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం సిట్టింగ్‌ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నిమ్మాడ పరిసరప్రాంతాల్లోని 259, 287, 288, 290, 291 పోలింగ్‌ బూత్‌లలో టీడీపీ మినహా ఇతర పార్టీలకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ఈ ఐదు బూత్‌లు నిమ్మాడ పరిధిలో ఉన్నందున అక్కడ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుల ప్రోద్బలంతో ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్‌కి పాల్పడ్డారని పోలింగ్‌ సరళి స్పష్టంచేస్తోంది. ఈ విషయాలపై వైఎస్సార్‌ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ శ్రీకాకుళం పార్లమెంటు రిటర్నింగ్‌ అధికారి, పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. చెల్లని ఓట్లను మళ్లీ లెక్కించాలని కోరినా ఆర్‌వో అనుమతివ్వలేదు. దీనిపై దువ్వాడ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  

గుంటూరు, విజయవాడ లోక్‌సభ పరిధిలో.. 
గుంటూరు ఎంపీ స్థానంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల క్రాస్‌ ఓటింగ్‌ కారణంతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ గుంటూరు వెస్ట్‌ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరు చోట్లా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌ 4,205 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి మోదుగులపై గెలుపొందారు. విజయవాడ ఎంపీ నియోజకవర్గంలో 8,726 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కేశనేని నాని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పొట్లూరి వీర ప్రసాద్‌పై నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు.  

విశాఖ నార్తులో రీపోలింగ్‌ నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌  
విశాఖ నార్తు నియోజకవర్గంలో వివాదాస్పద ఈవీఎంలో పడిన ఓట్లతో సంబంధం లేకుండా సీఈసీ ఆదేశాల మేరకు 1,944 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు గంటాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. వివాదాస్పదమైన ఐదు ఈవీఎంలకు చెందిన బూత్‌ల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేకే రాజు సీతమ్మధార తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వివాదాస్పదమైన ఈవీఎంలో ఓట్ల వల్ల ఫలితంలో పెద్దగా మార్పు లేని కారణంగా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాన్ని ప్రకటించవచ్చని సీఈసీ సూచించడంతో ఆర్వో ఫలితాన్ని ప్రకటించారు.    
ఉరవకొండలో స్వల్ప మెజార్టీతో నెగ్గిన కేశవ్‌   
అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం ఇరు పార్టీలతోనూ దోబూచులాడింది. మొదటి 14 రౌండ్లలో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం కనబరచగా, ఆ తర్వాత టీడీపీ పుంజుకుంది. కౌంటింగ్‌ సమయంలో ఐదు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని లెక్కించకుండా పక్కన పెట్టారు. ఇతర ఈవీఎంల కౌంటింగ్‌ ముగిసిన తరువాత పక్కనపెట్టిన ఈవీఎంల లెక్కింపుపై ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఎన్నికల అధికారి వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్‌ పక్రియ శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ముగియగా.. 2,138 ఓట్ల మోజార్టీతో  కేశవ్‌ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.  

పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి   
ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వెలువడింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 1,503 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు 96,077 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరావుకు 94,574 ఓట్లు వచ్చాయి.   

మరిన్ని వార్తలు