గుడివాడలో టీడీపీ నేతల హంగామా

11 Apr, 2017 11:43 IST|Sakshi
గుడివాడలో టీడీపీ నేతల హంగామా

గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సంబరాలు ఘర్షణకు దారి తీశాయి.  గుడివాడ 19వ వార్డు ఉప ఎన్నికలో గెలుపుతో టీడీపీ నేతలు మంగళవారమిక్కడ హంగామా సృష్టించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి తెలుగు తమ్ముళ్లు రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు. అంతేకాకుండా కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. వారి చర్యలను వైఎస్ఆర్‌ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వివరాల్లోకి వెళితే...స్థానిక టీడీపీ నాయకులు ఊరేగింపుగా పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శరత్‌ థియేటర్‌ సమీపంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట బాణాసంచా  కాల్చి హంగామా చేశారు. ఇదే సమయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని కారులో బయటకు వెళుతుండగా, అప్పుడే బాణాసంచా పేల్చేందుకు యత్నించారు. అయితే ఆ బాణాసంచా సామాగ్రిని వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తులు అక్కడ నుంచి పక్కకు తీసేశారు. ఈ ప్రయత్నాన్ని టీడీపీ కార్యకర్తలు  అడ్డుకునే ప్రయత్నం చేయడంతో... ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

కాగా వైఎస్‌ఆర్‌ సీపీకి చెందిన కౌన్సిలర్‌ అనారోగ్యంతో మృతి చెందారు. సాధారణంగా ఏ పార్టీకి చెందిన సభ్యుడు మృతి చెందారో, ఆ పార్టీకి చెందినవారినే  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే గుడివాడలో మాత్రం పరిస్థితి భిన్నంగా టీడీపీ తన అభ్యర్థిని పోటీకి దించింది. అంతేకాకుండా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా ఒక్కో ఓటుకు దాదాపు రూ.7వేలు నుంచి రూ.10వేల వరకూ పంచి మీడియాకు అడ్డంగా దొరికిపోయింది కూడా. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడి ఎట్టకేలకు ఆ ఎన్నికలో గెలుపొందింది. పైపెచ్చు ఆ గెలుపుపై రెచ్చిపోతూ... వైఎస్ఆర్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టి... ఏదోఒక వివాదం చేసేందుకు యత్నించడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు