టీడీపీ x బీజేపీ

12 Sep, 2014 00:36 IST|Sakshi
టీడీపీ x బీజేపీ
  • కైకలూరులో కమ్ముకుంటున్న విభేదాలు   
  •  పీటముడిగా మార్కెట్ చైర్మన్ గిరి
  • కైకలూరు : తెలుగు తమ్ముళ్లు, కాషాయ కార్యకర్తల మధ్య అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికల పొత్తుల్లో భాగంగా జిల్లాలో కైకలూరు సీటును చంద్రబాబు బీజేపీకి కేటాయించారు. ఆ పార్టీ తరఫున విజయం సాధించిన కామినేని శ్రీనివాస్‌ను మంత్రి పదవి వరించింది.  అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన బీజేపీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో కార్యకర్తలు వారి ఆవేదనను మంత్రి కామినేని ముందు వెళ్లగక్కారు. గ్రామాల్లో టీడీపీ నాయకులదే పైచేయిగా ఉంటుందనీ, కనీసం సమావేశాలకు తమను ఆహ్వానించడం లేదని వాపోయారు.

    అధికారులు సైతం టీడీపీ నాయకుల మాటకే ఎక్కువ విలువిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కైకలూరు మండలంలో ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానం బీజేపీకి వచ్చినప్పటికీ ఆమెను ఎంపీపీగా ఎంపిక చేశామని, ఇది కార్యకర్తలు గమనించాలని మంత్రి కామినేని సర్దిచెప్పారు. నామినేటెడ్ పదవుల కేటాయింపుల్లో బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పిస్తామన్నారు.  అయితే మరుసటి రోజున జరిగిన మంత్రి పర్యటనకు బీజేపీ ఎంపీపీ బండి సత్యవతి,  టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ హాజరు కాలేదు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.

    కాంగ్రెస్ గాలిలో ఎన్నో ఇబ్బందులను తట్టుకుని తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని, నామినేటెడ్ పదవులు తమకే దక్కాలని టీడీపీ నాయకులు ఒక విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే చంద్రబాబు వద్ద దీనిపై పంచాయతీ పెట్టాలని భావిస్తున్నారు. దీంతో అటు టీడీపీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఇటు మంత్రి కామినేని శ్రీనివాస్‌కు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.
     
    అసహనంతో ఎంపీపీ సత్యవతి......

    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓసీ రిజర్వేషన్‌లో ఆలపాడు ఎంపీటీసీ సభ్యురాలుగా బండి సత్యవతి ఎన్నికయ్యారు. ఆమె భర్త శ్రీనివాసరావు మండల బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా కామినేని గెలిచి మంత్రి అయ్యారు. దీంతో పదవీకాలంలో మొదటి సగం సత్యవతి ఎంపీపీగా ఉండాలని నాయకులు నిర్ణయించారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా గడచిన కొద్ది కాలంగా టీడీపీ సమావేశాలకు, వివిధ కార్యక్రమాలకు ప్రొటోకాల్ ప్రకారం ఎంపీపీని ఆహ్వానించడం లేదని బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత  కాంగ్రెస్ పాలనలో అప్పటి మంత్రి పార్థసారథి, ఎంపీ కావూరి సాంబశివరావు బీజేపీ నేతలను స్టేజీపైకి ఆహ్వానించారని, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.  
     
    మార్కెట్  చైర్మన్‌గిరికి పెరిగిన గిరాకీ......
     
    వివాదానికి కేంద్ర బిందువుగా కైక లూరు మార్కెట్ చైర్మన్ గిరి మారింది. కైకలూరులో  ఎమ్మెల్యే తర్వాత అంతటి స్థానం ఈ పదవికి ఉంది. కైకలూరు వ్యవసాయ మార్కెట్ సంవత్సర ఆదాయం రూ. 3కోట్లు. నియోజకవర్గంలో కైకలూరు, కలిదిండి మండలాల్లో రెండు మార్కెట్ కమిటీలున్నాయి. నూతన ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక్క మార్కెట్ కమిటీ మాత్రమే కొనసాగించే అవకాశం ఉందని తెలియడంతో కైకలూరు మార్కెట్ పైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మంత్రి కామినేని, ఎంపీ మాగంటి  వద్దకు ఆయా సామాజిక వర్గాల నాయకులతో పైరవీలు నెరపుతున్నారు. దీనికి తోడు గత స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారికి మార్కెట్ కమిటీ కేటాయించాలనే వాదన వినిపిస్తుంది. టీడీపీ, బీజేపీ, ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన కొందరు నాయకులు మార్కెట్ చైర్మన్‌గిరిని ఆశిస్తున్నారు
     

>
మరిన్ని వార్తలు